దివ్యప్రణాళికా ఫలకములు
- యునైటెడ్ స్టేట్స్, కెనడాల బహాయిలకు వెలువరించిన దివ్యఫలకము
[యునైటెడ్ స్టేట్స్, కెనడాల బహాయిల నుద్దేశించి 1916 సం. ఏప్రిల్ 11 న బహజీ సౌధంలోని అబ్దుల్-బహా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ నిజమైన అమెరికన్ బహాయిలారా!
మీరు ఆ సువిశాల ఖండమున దివ్యబోధనల పరివ్యాపనమునకు బద్ధులై, భగవంతుని సామ్రాజ్యాహ్వానము నొసగి, దివ్యసేనాధీశుని, మహోన్నత వాగ్దత్తపురుషుని శుభవర్తమానమును ప్రకటించినందులకు మహోన్నత దివ్యాభీష్టమునకు ప్రస్తుతి. ఈ లక్ష్యమున మీరు సాహాయ్యమునొంది, అనుగ్రహీతు లైనందులకు దేవదేవునకు ధన్యవాదములు. ఇది సంపూర్ణముగా, దివ్యసేనాధీశుని అనుగ్రహముననే, పవిత్రాత్మ నిశ్వాసముల మూలముననే సంభవిల్లినది. మీ విజయపు సంపూర్ణ పరిమాణ మింకనూ అభివ్యక్తము కానందున, తత్ర్పాధాన్యమింకనూ గ్రహియింపబడలేదు. అనతికాలమునకే, మీలోని ప్రతి యొక్కరును తేజరిల్లు తారకవలె మీ దేశపు టాకసమున దివ్యమార్గదర్శకజ్యోతిని భాసిల్లజేసి, తత్ప్రజానీకమునకు అమరజీవన వైభవమును ప్రసాదించుటను మీ నేత్రములతోనే మీ రవలోకింతురు.
యోచింపుడు! క్రీస్తుకాలమున ధర్మదూతల స్థాయి, ధన్యతలు తెలియవు, వారి యెడ గౌరవభావముతో నెవ్వరును వ్యవహరింపలేదు; పైగా, వారిని వేధించినారు, అవహేళన మొనరించినారు. అటుపైననే తెలియవచ్చినది: ధర్మదూతలైన మగ్దలీను మరియ, యోహాను మాతృమూర్తి మరియల శిరములు యే సముజ్జ్వల రత్నఖచిత మార్గదర్శక మకుటములతో నలంకృతములైనవో. ఇంకను మీ భావిసాఫల్యముల స్థాయి ప్రచ్ఛన్నముగనే యున్నది. సమీపభవిష్యత్తున, మీ సాఫల్యముల ఫలితముగ, సమస్తభూమియూ సచేతనమై, ప్రకంపిత మగునని మనఃపూర్వకముగా ఆశింపుచున్నాడను. కనుకనే, అబ్దుల్-బహా మీకై నిల్పుకొనిన ఆశ: అమెరికాలో మీ యత్నము లకు చేకూరిన విజయమే, ప్రపంచములోని ఇతర ప్రాంతముల యందున మీ రొనరించు యత్నములకు సైతము పట్టము గట్టవలెనని; భగవంతుని దివ్యధర్మము మీ ద్వారా ప్రాక్పశ్చిమములకు పరివ్యాపితమై ప్రపంచఖండము లైదింటి లోనూ దివ్యసేనాధీశుని సామ్రాజ్యాగమనము సముద్ఘోషితము కావలెనని.
అమెరికన్ విశ్వాసు లీదివ్యసందేశమును అమెరికా తీరములనుండి దూరభూములకు కొనిపోవగ, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలేషియా, సుదూర పసిఫిక్ దీవుల వరకూ అది విస్తారితమైనప్పుడు, తానొక అమరధామ సింహాసనముపై సుభద్రముగ సంస్థాపితమైతినని - ఈ సమాజము తెలిసికొనును. ఆధ్యాత్మికముగా ఈ సమాజము జ్యోతిర్మయమై, దివ్యత్వము దెసకు నిర్దేశితమగుటను ప్రపంచజను లప్పుడు వీక్షింతురు. దాని యౌన్నత్య, ఘనతల ప్రశంసలతో భువియంతయు ప్రతిధ్వనించును. తమ భాషలలో సంభాషించు నిస్సంగాన్విత, పావన, భగవద్వాత్సల్య ప్రపూరితబృంద మొక్కటి తమ దృక్కులను పసిఫిక్ మహాసముద్రమునందలి మూడు బృహద్ద్వీప సముదాయములు: పోలీనేషియా, మైక్రొనేషియా, మెలనేషియా; వాటికి అనుసంధానమైన న్యూ గినియా, బోర్నియో, జావా, సుమత్రా, ఫిలిప్పీన్స్, సాల్మన్ ఐలండ్స్, ఫిజీ ఐలండ్స్, న్యూ హెబ్రైడ్స్, లాయల్టీ ఐలండ్స్, న్యూ కెలడోనియా, బిస్మార్క్ ఆర్కిపెలాగో, సీరమ్, సెలిబీస్, ఫ్రెండ్లీ ఐలండ్స్, సమోవా ఐలండ్స్, సొసైటీ ఐలండ్స్, క్యారొలైన్ ఐలండ్స్, లో ఆర్కిపెలాగో, మార్క్వీసస్, హవాయియన్ ఐలండ్స్, గిల్బర్ట్ ఐలండ్స్, మొలక్కాస్, మార్షల్ ఐలండ్స్, టిమోర్ ఐలండ్స్ వంకకూ, ఇంకా ఇతర ద్వీపముల వంకకూ దృష్టిని సారించి, అటుగా పయనము సాగింపవలె. భగవద్వాత్సల్యముతో పొంగులువారు మనస్సులతో, భగవత్సంకీర్తన మొనరించు జిహ్వలతో, భగవత్సామ్రాజ్యము దెస కభిముఖములైన నేత్రములతో దివ్యసేనాధీశుని ప్రత్యక్షీకరణ శుభవార్తను సర్వజనులకును వా రందింపవలె. అవతారపురుషుని దివ్యసందేశమును వారు జనులకు వెల్లడింపవలె. మీరు ఏ సమావేశమున ప్రవేశించినను, పవిత్రాత్మ తరంగము లచ్చోటికి వెల్లువెత్తునని, శుభసౌందర్యుని దివ్యానుగ్రహము ఆ సమా వేశము నావరించునని నిక్కముగ దెలిసికొనుడు.
పరికింపుడు: శుభసంపూర్ణుని ప్రియసేవికయు, దివ్యసామ్రాజ్యపుత్రిక అయిన కుమారి ఏగ్నెస్ ఆలెగ్జాండర్ హవాయి దీవులకూ, హొనొలులు ద్వీపమునకూ ఒంట రిగా వెళ్లినది, జపాన్‌లో ఇప్పుడు ఆధ్యాత్మిక విజయముల నందుచున్నది! ఈ పుత్రిక హవాయియన్ దీవులయందున ఎటుల ఆశీఃకృతయైనదో గమనింపుడు. ప్రజాసమ్మేళన మొకదానికి మార్గదర్శన హేతువైనదామె.
అదే విధముగా, కుమారి నోబ్లాక్ ఒక్కతే జర్మనీకి వెళ్లినది. ఎంతటి మహత్తర స్థాయికి అనుగ్రహీత యైనదామె! కనుక, ఈ యుగమున దివ్యపరిమళముల పరివ్యాపనార్థమై యుద్యమించు నాతడిని భగవత్సామ్రాజ్య సేనాదళము లనుగ్రహించునని, శుభసంపూర్ణుని ఉపకృతు లాతని నావరించుకొనునని నిక్కముగా తెలిసికొనుడు.
కాలినడకనైనా, కటికదారిద్ర్యములోనైనా, “యా బహా ఉల్ అభా” నినాదా న్నిస్తూ నగరాలలోనూ, గ్రామాలలోనూ, ఎడారులలోనూ, మహాసముద్రాలలోనూ, దైవ బోధనలను ప్రచారం గావిస్తూ ఈ ప్రాంతాలకు పయనించగలిగాను! అయ్యో, నేనిది చేయజాలను. ఇందులకెంతో చింతిస్తున్నాను! భగవంతుని సంప్రీతుని గావింపుడు, దీనిని మీరు సాధింపవచ్చును.
ఈ సమయానికి, కుమారి అలెగ్జాండర్ యత్నములతో, హవాయియన్ దీవుల యందలి పలువురు - విశ్వాస సాగరతీరమును సమీపించినారు. పరికింపుడు, ఎంతటి ఆనందమది, ఎట్టి ఆహ్లాదమది! ఈ మాన్యనందిని ఏకముగా ఒక సామ్రాజ్యమునే స్థాపించి యుండిననూ, ఆ సామ్రాజ్య మింతటి మహత్తరమై యుండదని దివ్యసేనాధీశుని పేరిట ప్రకటింపుచున్నాడను. ఎందులకనగా, శాశ్వతసార్వభౌమత్వ మీసార్వభౌమత్వము, నిత్యవైభవ మీవైభవము.
ఆ విధముగనే, బోధకులు కొందరు ఆస్ట్రేలియా ఖండము, న్యూజీలండ్, తస్మానియా, జపాన్, ఏషియాటిక్ రష్యా, కొరియా, ఫ్రెంచి ఇండోచైనా, సయామ్, స్ట్రెయిట్స్ సెటిల్‌మెంట్స్, ఇండియా, సిలోన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి అన్యద్వీపములకూ, దేశములకూ వెళ్లినట్లైతే మహత్తర ఫలితములు సిద్ధింపగలవు. స్త్రీ పురుష సమన్విత మైన రాయబారబృంద మేదేని - చైనా, జపాన్‌లకు పయనించగల అవకాశమున్నచో ఎంత బాగుండును! ఈ అనురాగబంధ మీతీరున పటిష్టతను సంతరించుకొన వచ్చును, ఈ రాకపోకలతో వారు మనుష్యప్రపంచపు టేకత్వమును స్థాపింపవచ్చును, జనులను భగవంతుని దివ్యసామ్రాజ్యమున కాహ్వానించి, బోధనలను పరివ్యాప్త మొన రింపవచ్చును.
అలాగే, వీలైతే, వారు ఆఫ్రికా ఖండమునకూ, క్యానరీ ఐలండ్స్, కేప్ వెర్డీ ఐలండ్స్, మెడియేరా ఐలండ్స్, రీయూనియన్ ఐలండ్స్, సెయింట్ హెలీనా, జాంజి బార్, మారిషస్ లకూ వెళ్లి, ఆయా దేశాల ప్రజలను భగవంతుని దివ్యసామ్రాజ్యమునకు ఆహ్వానిస్తూ, “యా బహా ఉల్-అభా” నినాదము నీయవలె. మడగాస్కర్ దీవిలో సైతము మానవప్రపంచపు టేకత్వ పతాకమును వారు తప్పక ఎగురవేయవలె.
ప్రతి ప్రదేశమునకూ, సకల దిశలకూ పంపిణీ చేయబడేందుకై—పుస్తకములనూ, కరపత్రములనూ ఈ దేశముల, దీవుల భాషలలోనికి అనువదించుటయో, వ్రాయుటయో జరుగవలె.
దక్షిణాఫ్రికాలో వజ్రముల గని యొక్కటి కనుగొనబడినదట. మహత్తర విలువ కలిగినదే అయిననూ, ఆ గని వట్టి శిల మాత్రమే. బహుశః, దైవేచ్ఛయైనచో, మానవగని కనుగొనబడునేమో, దివ్యసామ్రాజ్య సముజ్జ్వల మౌక్తికములు లభియింప వచ్చునేమో. సంక్షిప్తముగా చెప్పవలెనంటే, ప్రపంచమును కబళిస్తున్న ఈ యుద్ధము మాటల కంద నంతటి చిచ్చును మనస్సులయందున రగుల్కొలిపినది. ప్రపంచదేశము లన్నింటా, మానవమస్తిష్కములోనికి - విశ్వశాంతికై ఆకాంక్ష ప్రవేశించినది. శాంతి సామరస్యములను కాంక్షించని వా రొక్కరైననూ లేరు. గ్రహణశీలత విషయముగ పరమాద్భుత స్థాయి నెలకొనినది. సామర్ధ్యము సృజితమై, మానవలోకపు టేకత్వ పతాక మూర్ధ్వీకృతమై, విశ్వశాంతి మూలభావనా, దివ్యసూత్రములూ ప్రాక్పశ్చిమముల యందున పరివ్యాప్తి నొందునటుల – సంపూర్ణముగా దైవేచ్ఛతోనే ఇది సంభవిల్లినది.
కనుక, ఓ భగవద్విశ్వాసులారా! ప్రయత్న మొనరింపుడు, ఈ యుద్ధానంతరము దివ్యబోధనల సారమును బ్రిటిష్ ఐలండ్స్, ఫ్రాన్సు, జర్మనీ, ఆస్ట్రియా-హంగేరీ, రష్యా, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, స్విట్జర్లండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, హలెండ్, పోర్చుగల్, రుమేనియా, సెర్బియా, మాంట్‌నీగ్రో, బల్గేరియా, గ్రీస్, ఆండోరా, లీష్టెన్స్టీన్, లక్సెంబర్గ్, మొనాకో శాన్ మెరినోలలో, బలయారిక్ ఐలండ్స్, కోర్సికా, సర్‌దీనియా, సిసిలీ, క్రీట్, మాల్టా, ఐస్‌ల్యాండ్, ఫరో ఐలండ్స్, షెట్లాండ్ ఐలండ్స్, హెబ్రైడ్స్, ఓర్క్నీ ఐలండ్స్ లలో పరివ్యాప్త మొనరింపుడు.
మార్గదర్శకత్వ క్షితిజమున ఉషఃతారలవలె ఆ దేశముల యందున శోభిల్లుడు. మీ యత్నములయందున మీరింత వరకును, అవిశ్రాంతముగనే యుండినారు. ఇక మీ యుద్యమములను వేయింతలు కానిండు. ఈ దేశముల, రాజధానుల, ద్వీపముల, సభల, చర్చీలలోని జనులకు ఆభా సామ్రాజ్యమున ప్రవేశించుట కాహ్వానము నిండు. మీ యుద్యమముల లక్ష్యము విస్తరించుట ఆవశ్యకము. దాని పరిధి విస్తృతమగు కొలది భగవత్సాహాయ్య నిదర్శన మంతకన్నను మనోజ్ఞముగ నుండును.
అబ్దుల్-బహా తాను తీవ్రమైన శారీరక బలహీనతతో, అశక్తతతో, అయిష్టతతో, కదలజాలని నిస్సహాయస్థితిలో ఉండికూడా - ఈ పరిస్థితిని లక్ష్యము సేయక, అనేక దేశములయందునా, ఐరోపా, అమెరికాలలోనూ పర్యటించుటనూ; చర్చీలలో, సభలలో, సమ్మేళనములలో దివ్యసూత్రప్రచార నిమగ్నుడై, అభా దివ్యసామ్రాజ్యావతారము వంకకు ప్రజల నామంత్రించుటనూ మీరు గమనించినారు. శుభసంపూర్ణుని ఆశీస్సులు సర్వులనూ సమావృత మొనరించుటను సైతము మీరు పరికించినారు. భౌతిక విశ్రాంతితో, ప్రశాంతతతో, సౌఖ్యముతో, ఈ ఐహికప్రపంచ వ్యామోహముతో చేకూరెడు ఫలితమేమి? వీటిని వెన్నంటిపోవు మానవుడు తుదకు పశ్చాత్తప్తుడై నష్టము నొందుట తధ్యము.
కనుక, మనిషి ఈ ఆలోచనలపై ఎంతమాత్రమూ దృష్టిని పెట్టకూడదు, అమర జీవనమునూ, మానవప్రపంచపు టౌన్నత్యమునూ, అలౌకిక పరిణామములనూ, పవిత్రాత్మనూ, భగవద్వచన ప్రచురతనూ, ప్రపంచవాసులకు పథనిర్దేశమునూ, విశ్వశాంతి సముద్ఘోషణనూ, మానవజాతి ఏకత్వ ప్రకటనమునూ కాంక్షింపవలె! ఇదియే, చేయవలసిన పని! లేని పక్షమున, తక్కిన పశుపక్ష్యాదుల వలెనే, జంతుప్రపంచపు టున్నతాశయ సాకారమైన - మానవ భౌతికజీవితావసరములతో నిరతుడు కావలె; చతుష్పాదజీవివలె విశ్వమునం దంతటా విహరింపవలె.
పరికింపుడు! మనిషి ఈ లోకమున ఎంతటి సిరిసంపదలనూ, సౌభాగ్యమునూ సముపార్జించుకున్ననూ - ఒక ఆవు వలె స్వతంత్రుడు కాబోడు. ఎందులకనగా, పుష్టిని సంతరించుకొనిన ఈ ఆవులు విశాలమైన పచ్చికమైదానము లలో స్వేచ్ఛగా సంచరిస్తాయి. అన్ని గడ్డిభూములూ, పచ్చికబయళ్లూ అవి మేసేందుకే, నదులూ, నీటిచెలమలూ అన్ని అవి త్రాగేందుకే! వాటికి, ఈ పుష్కలతరమైన ప్రాపంచిక వరములు లభించిన వనునది ప్రత్యక్ష నిదర్శనం.
ఇంతకన్ననూ ఉత్తమమైనది - పక్షి జీవితము. రాజభవనములను తలదన్నిన రమ్యతరమైన కులాయము (గూడు)ను పర్వత శిఖరాగ్రానా, ఎంతో ఎత్తున ఊగిసలాడే శాఖలపైనా నిర్మించుకుంటుంది పక్షి! ఎంతో పరిశుభ్రమైన గాలి, స్ఫటికసదృశమైన స్వచ్ఛమైన చల్లని నీరూ, సుమనోహర సుందర పర్యావరణమూ. అంతటి మనోజ్ఞ పరిసరాల మధ్యన అది తన పరిమిత జీవితాన్ని వెళ్లబుచ్చుతుంది. మైదానంలో పండే పంట దిగుబడులన్నీ దాని ఆస్తులే; ఇదంతా అది — కాస్తంత శ్రమైనా లేకుండా సంపాదించుకున్నదే. కనుక, మనిషి ఈ ప్రపంచములో ఎంతో పురోగమించి ఉండవచ్చును గాక; ఈ పక్షి స్థాయిని మాత్రం అందుకొనజాలడు! కనుక, తాను మరణించేంత వరకూ, ప్రాపంచికాంశములయం దెంతగా కష్టించి, కృషి చేసినా ఒక చిన్న పక్షికి గల సమృద్ధినీ, స్వేచ్ఛనూ, స్వతంత్ర జీవితమునూ మానవుడు సాధించజాల డన్నది విస్పష్టం. ఇది నిజమును నిరూపిస్తున్నది, నిలుపుతున్నది. మానవుడు సృష్టించబడినది ఈ నశ్వర ప్రాపంచిక జీవితం నిమిత్తం కాదు - అయితే, మరి అతను సృజించబడినది - సర్వసమగ్రతల సముపార్జనకూ, మానవప్రపంచమున సమున్నత స్థాయీసాధనకూ, దివ్యగేహళీ సామీప్యత నొందేం దుకూ, అనంత సార్వ భౌమాధికార సింహాసనాసీనుడు కావడానికీ మాత్రమే!
బహాఉల్-ఆభా మీతో నున్నాడు!
బోధనాప్రవాసార్థమై, ఏ ప్రదేశమున కెవరు బయలుదేరుచున్ననూ, అతడిని - విదేశములలో తన పర్యటనాకాలమున, రేయింబవళ్లూ ఈ ప్రార్థనను చేయుమనవలె.
ఓ దేవా, నా దేవా! నీ ఘనసామ్రాజ్యముతో ముగ్ధతనొంది, తదాకర్షితుడనై, మానవాళియందున నీ ప్రేమాగ్నితో ప్రజ్జ్వలితుడనై, ఈ సువిస్తృత, సువిశాలభూములకు నీ సామ్రాజ్యదూతనై, నీవు దక్క అన్యసమస్తముతోనూ బంధములను త్రెంచుకుని, నిన్ను విశ్వసించి, విశ్రామసౌఖ్యములను పరిత్యజించి, నిజగృహదూరుడనై, ఈ ప్రాంతములయందున ద్రిమ్మరినై, భువిపై బడిన అపరిచితుడనై, నీ మహాద్వారసీమ యెదుట సాగిలపడి, నీ సర్వశక్తిసమన్విత స్వర్గవిధేయుడనై, నీ దివ్యధర్మమును సేవించుట యందున, నీ బోధనలను దూరభూములకు పరివ్యాప్త మొనరించుట యందున, ప్రాక్పశ్చిమములలో నీ దివ్యవచనమును సంకీర్తించుట యందున నాకు తోడ్పడు మని నిశిరేయినా, ప్రభాతసమయానా నిన్ను వేడుచూ, ఉదయ సాయం సంధ్యల యందున నిన్నర్ధింపుచూ, ప్రస్తుతింపుచున్న నన్ను వీక్షింపుచున్నాడవు.
ఓ ప్రభూ! నా వెన్నును పటిష్టీకృతమొనరించు, పూర్ణయత్నముతో నిన్ను సేవింపనిమ్ము, ఈ ప్రాంతములయందున నా దారికి నన్ను ఏకాకిగ, నిస్సహాయునిగ వదలివేయవలదు.
ఓ ప్రభూ! నా ఏకాంతమున నీతో సంభాషణము ననుగ్రహించు, ఈ సుదూర భూముల యందున నాకు సహచరుడవు కమ్ము.
నిక్కముగా, నీ వెంచినదానియందున నీకు ఇష్టులైన వారికి ధృవకర్తవు, నిక్కముగ, నీవు సర్వశక్తియుతుడవు, సర్వోన్నతుడవు.
- యునైటెడ్ స్టేట్స్, కెనడాల బహాయిలకు వెలువరించిన దివ్యఫలకము
[యునైటెడ్ స్టేట్స్, కెనడాల బహాయిల నుద్దేశించి 1916 సం. ఏప్రిల్ 19 న బహజీ సౌధంలోని అబ్దుల్-బహా గదిలోనూ; ఏప్రిల్ 20 న బహజీ సౌధంలోని పుణ్యయాత్రీకుల నివాసాల్లోనూ; ఏప్రిల్ 22 న బహాఉల్లా దివ్యసమాధికి చేరువగా ఉన్న ఉద్యానవనంలోనూ దీనిని వెలువరించడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ బహాఉల్లా దివ్యధర్మదూతలారా!
మీకై నా జీవిత మర్పితమగు గాక!
పవిత్రగ్రంథమున - వాగ్దత్తపురుషుని దివ్యమూర్తిని దైవసేనాధీశుడని వ్యాఖ్యా నింపనైనది. దైవసేనలనగా – అటువంటివారు మనుష్యప్రపంచమునుండి పరిపూర్ణ స్వేచ్ఛనొంది, అలౌకికాత్మలుగా పరివర్తితులై, దేవదూతలుగా ధృవీకృతులైనారన్న మాట. అటువంటివారు సమస్తఖండములనూ తేజోభరితము సేయు సత్యసూర్యుని కిరణములు. సమస్తప్రదేశముల మీదికీ జీవనపవనమును వెలువరింపుచు కాహళ నొకదానిని, ప్రతి ఒక్కరూ చేత ధరించినారు. వారు మానవగుణ, ఐహికావలక్షణ విముక్తులై, దైవలక్షణములను సంతరించుకొని, కరుణాన్వితుని సౌరభములకు సమాకర్షితులైనారు. క్రీస్తునే తమయందున నిలుపుకొనిన ఆయన ధర్మదూతలవలె, వీరును పరమపూజ్యుడైన బహాఉల్లాను నిలుపుకొని యున్నారు; అంటే, వారి ప్రత్యంగముపైనా, శరీరభాగముపైనా, అవయవముపైనా మనుష్య ప్రపంచప్రేరణ లేవీ ప్రభావమును చూపజాలనంతటి ఆధిపత్యమును బహాఉల్లా పట్ల ప్రేమ సాధించిన దన్నమాట.
వీరు భగవంతుని సేనలు, ప్రాక్పశ్చిమముల విజేతలు. వీరిలోని ఏ ఒక్కరు తమ వదనమును ఏ దెసకు మరలించి, ప్రజలను భగవంతుని దివ్యసామ్రాజ్యమునకు ఆమంత్రించినా, ఆతడి సాహాయ్యమునకూ, సుదృఢీకరణకూ సర్వోత్కృష్ట సైనికబలగములూ, దైవాశీస్సులూ సత్వరమే తరలుతాయి. సర్వద్వారములూ తెరచుకొనుటనూ, సమస్త పటిష్ట రక్షణనిర్మాణములూ, దుర్భేద్యదుర్గములూ భూపతనము లగుటనూ ఆత డవలోకించును. ఒంటరిగా, ఏకాకిగా ప్రపంచసేనల నెదిరించి, సకల దేశముల సేనల వామదక్షిణ పార్శ్వముల నోడించి, యావద్దేశముల సైనిక శ్రేణులనూ ఛేదించుకుని, ప్రాపంచికశక్తుల మూలకేంద్రముపైననే తన ముట్టడిని కొనసాగించు నాతడు. భగవంతుని సేనలకు అర్థమిదే.
బహాఉల్లా విశ్వాసులయం దీస్థాయిని సాధించిన వా డెవ్వడైననూ బహాఉల్లా దివ్యధర్మదూతగనే తెలియవచ్చును. కనుక, మనఃపూర్వకముగ యత్నము గావింపుడు – తద్వారా మీ రీమహోన్నత, మహనీయ స్థాయినంది, అనంత వైభవ సింహాసనము నధిష్ఠించి, శతాబ్దులనూ, కాలకక్ష్యలనూ జ్యోతిర్మయ మొనరించు దివ్య సామ్రాజ్య సముజ్జ్వల రత్నవిభూషిత జేగీయమాన మకుటముతో మీ శిరస్సుల నలంకరించుకొనవచ్చును.
ఓ దయాన్విత మిత్రులారా! మీ ఔదార్యమును వ్రవృద్ధ మొనరించి, స్వర్లోకశిఖరి దెస కెగసిపొండు, తద్వారా మీ ఆశీఃకృత హృదయములు సత్యసూర్యుని, అనగా - పరమపూజ్యుడైన బహాఉల్లా కిరణములతో అనునిత్యమూ ఇంకెంతగనో ప్రకాశింప వచ్చును; క్షణక్షణమునకు మనస్సులు నవచైతన్యమునొంది, ప్రాకృతిక ప్రపంచాంధకారము పారద్రోలబడవచ్చును; ఆ విధముగా, మీరు - అవతరించిన జ్యోతిగ, మూర్తీభవించిన స్ఫూర్తిగ ఈ ప్రపంచపు టయోగ్యాంశముల నేమాత్రమూ లక్ష్యము సేయక, దైవలోక వ్యవహారములతో సంబంధము నొందవచ్చును.
బహాఉల్లా మీ యెట్టయెదుట దెరచిన ద్వారములను పరికింపుడు, మీరు సాధించుటకు నిర్దేశితమైన స్థాయి ఎంతటి ఉదాత్తమో, మహోన్నతమో! పరికింపుడు, మీ కనుగ్రహీతములైన ఉపకృతు లెంతటి అపూర్వములో! ఈ పానపాత్రముతో మత్తిల్లితిమేని, మన దృష్టికి యీ భూగోళసార్వభౌమాధికారము బాల్యక్రీడకన్నను అత్యల్పమైనదే యగును. వారు యుద్ధాంగణమున యావత్ప్రపంచ ప్రభుత్వ మకుటమును నిలిపి దానిని స్వీకరింపుమని మనలోని ప్రతి ఒక్కరినీ ఆహ్వానించినచో, నిస్సందేహముగా మనము దానికి లొంగక, తత్స్వీకరణమునకు నిరాకరింపవలె.
అయితే, ఈ సర్వోన్నత స్థాయీసాధన, కొన్ని నిర్దిష్టనిబంధనల పరిపూర్తిపై ఆధారితమై ఉంటుంది: తొలి నిబంధన - భగవంతుని దివ్యఒడంబడికయెడ స్థైర్యము. ఎందులకనగా: ఒడంబడిక శక్తి – భ్రాంతి నొందిన వారి సంశయముల నుండి బహాఉల్లా దివ్యధర్మమును కాపాడుతుంది. భగవంతుని దివ్యధర్మపు టభేద్య దుర్గమిది, భగవన్మత సుస్థిర స్తంభమిది. భగవంతుని దివ్యఒడంబడిక తప్ప ఇక ఏ శక్తీ ఈనాడు బహాయి ప్రపంచపు టేకత్వమును సంరక్షింపజాలదు; లేని పక్షమున, విభేదములు పెనుతుఫానువలె బహాయి ప్రపంచము నావరిస్తాయి. మనుష్యప్రపంచపు టేకత్వమునకు ఇరుసు - ఒడంబడిక శక్తి తప్ప వేరొకటి కాదనునది ప్రస్ఫుటము. ఒడంబడిక సంభవించి ఉండకపోయినా, సర్వోతృష్ట లేఖినినుండి ఆవిష్కృతమై ఉండక పోయినా, సత్యసూర్యకిరణమువలె ప్రపంచమును తేజోభరితము గావించకపోయినా - భగవంతుని దివ్యధర్మసేనలు సంపూర్ణముగా చెదరిపోయి, స్వీయ వ్యామోహ, వాంఛా బంధితులు కొందరు పరశువును చేబూని, ధన్యవృక్షమును మొదలంటా తెగవైచి యుండెడి వారే. ప్రతి ఒక్కడూ తన స్వీయవాంఛను ప్రతిపాదించి యుండెడివాడు, ప్రతి వ్యక్తీ స్వీయాభిప్రాయ వ్యక్తీకరణము నొనరించి యుండెడివాడు. అజ్ఞానులు కొందరు ఈ మహత్తర ఒడంబడికను లక్ష్యము సేయక, భగవంతుని దివ్యధర్మ పునాదిని దుర్బల మొనరించగల మనుకొనుచు, తమ యుద్ధాశ్వముల నధిరోహించి రణభూమిలోనికి దూసుకు వచ్చినారు. కాని, భగవంతుడు ప్రకీర్తితుడు; వారెల్లరునూ పశ్చాత్తప్తులైనారు, పరాజితులైనారు; అచిరకాలమునకే వారు తీవ్రనిస్పృహకు లోనగుదురు. కనుక, విశ్వాసులు ఒడంబడికపట్ల స్థైర్యముతో ముందుగనే అడుగులను వేయవలె, తద్వారా, బహాఉల్లా ఆశీస్సు లన్నిదెసలనుండియూ వారల నావరింపవచ్చును, సర్వోన్నత దివ్యగణ సేనాదళములు వారి సమర్ధకులూ, సహాయకులూ కావచ్చును; అబ్దుల్-బహా ఉపదేశములూ, సూచనలూ సమస్తహృదయఫలకముల పైననూ చెరిగిపోవని తీరున, శిలాశిల్పిత చిత్రములవలె శాశ్వతములై నిలిచి పోవచ్చును.
మలి నిబంధన – విశ్వాసులలో మైత్రీభావము, ప్రేమ. భగవన్మిత్రు లొకరి పట్ల ఒకరు సమాకర్షితులూ, సానురాగబద్ధులూ కావలె, ఒకరికై ఒకరు తమ జీవితములను సైతము త్యాగము సేయవలెనను ఇచ్ఛతో నుండవలె. విశ్వాసులయం దొకరిం కొకరికి తారసపడినపు డది – నోరార్చుకుపోయిన దాహార్తుడు జీవజలస్రవంతి దరిచేరి నటుల, ప్రియుడు తన ప్రేమికను కలుసుకొనినటుల ఉండవలె. ఎందుల కనగా, ఇది పవిత్రావతారమూర్తుల ఆగమన సంబంధిత మహత్తర దైవవిజ్ఞతలయం దొకటి: ఆత్మలు ఒకదానినొకటి తెలుసుకొని, ఒకదాని కొకటి సన్నిహితమౌతాయి; భగవంతుని ప్రేమశక్తి వాటి నన్నింటినీ ఒకే సముద్రపు కెరటములను, ఒకే గులాబీవన ప్రసూనములను, ఒకే ఆకసపు తారలను గావిస్తుంది. పవిత్రావతారమూర్తుల అవతరణములోని విజ్ఞత ఇదే: మహోత్కృష్ట వదాన్యత విశ్వాసుల హృదయములయం దభివ్యక్తమైన యపుడు ప్రాకృతిక ప్రపంచము పరివర్తిత మౌతుంది, అనిశ్చితస్థితి అంతమై దైవశోభ సంతరించుకోబడుతుంది. అటుపై యావత్ప్రపంచమూ ఆభాస్వర్గమై, భగవద్విశ్వాసుల యందలి ప్రతి ఒక్కరూ అద్భుతఫలముల నిచ్చెడు ధన్యవృక్ష మౌతారు.
ఓ మిత్రులారా! మైత్రి, మైత్రి! ప్రేమ, ప్రేమ! సమైక్యత, సమైక్యత! తద్వారా బహాయి దివ్యధర్మశక్తి దృగ్గోచరమై, అస్తిత్వప్రపంచమున వ్యక్తము కావచ్చును. నా యాలోచనలు మీ వైపుకు మరలినవి, నా మనస్సు మీ ప్రసక్తితో ఎగసిపడుతున్నది. మీ ప్రేమతో నా ఆత్మ యెట్లు ప్రజ్జ్వలిస్తున్నదో మీ రెఱిగినచో, మీ రొకరిపట్ల ఒకరు మరులు గొనునంతగా, మీ మనస్సుల యందున మహదానందపు వెల్లువ పొంగులు వారుతుంది.
మూడవ నిబంధన: బోధకులు నిరంతరమూ ఖండాంతర దేశము లన్నింటా, కాదుకాదు, ప్రపంచదేశము లన్నింటా పయనింపవలె, అయితే, అమెరికన్ నగరములలో పర్యటించిన అబ్దుల్-బహా వలె వారు పయనమును సాగింపవలె. ఆయన సమస్త అనుబంధ ప్రక్షాళితుడూ, విముక్తుడూ, పూర్ణవిరాగీ. పరమపూజ్యుడైన క్రీస్తు చెప్పినట్లు: మీ పాదధూళిని దులిపివేయుడి. 1
అమెరికాలో ఉన్నప్పుడు అనేకులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొన్ని బహుమతులను అర్పింప నెంచినారు, అయినను, కొన్ని సందర్భములలో—మే మత్యంత నిర్ధన పరిస్థితులయం దున్ననూ—శుభసంపూర్ణుని ప్రబోధములనూ, ఆదేశములనూ అనుసరించి యీ సేవకు డెన్నడూ, దేనినీ స్వీకరించకపోవుటను మీరు గమ నించినారు. అయిననూ, ఇంకొకవైపున, ఎవరైనా భగవంతుని నిమిత్తమై స్వచ్ఛందముగా, తమ ఇష్టపూర్తిగా, ఒక బోధకుని వ్యయములకై విరాళము నర్పించ నెంచినచో, ఆ విరాళదాతను సంతోషపెట్టుటకు, స్వల్పమొత్తమును బోధకు డంగీకరింప వచ్చును; అయినను, ఆతడు పూర్ణసంతృప్తితోనే జీవింపవలె.
లక్ష్యమిది: బోధకుని ఉద్దేశము పవిత్రమైనదై ఉండవలె, ఆతడి హృదయము స్వేచ్ఛాయుతమై, ఆత్మ ఆకర్షితమై, భావములు ప్రశాంతములై, నిశ్చయము స్థిరమైనదై, ఔదార్యము సమున్నతమైనదై, భగవత్ప్రేమలో ప్రకాశించు దీపికవలె వర్థిల్లవలె. అతడు అలా అయినట్లైతే తన పావనశ్వాస - శిలను సైతము ప్రభావిత మొన రించును; లేనిచో ఎటువంటి ఫలితమూ ఉండదు. పరిపూర్ణతను సంతరించుకోనంత వరకూ, మానవు డన్యుల లోపముల నెట్లు తొలగించగలడు? భగవంతుడు దక్క అన్య మంతటినుండీ తాను విముక్తుడు కానంతవరకూ, బంధవిముక్తిని ఆతడు ఇతరుల కెట్లు బోధించగలడు?
సంక్షిప్తముగా, ఓ భగవద్విశ్వాసులారా! ప్రయత్నింపుడు, తద్వారా, మీరు భగవన్మత ప్రచురతలో, భగవత్పరిమళ ముల పరివ్యాప్తతలో ప్రతి సాధనముపైననూ సాధికారతను సాధింపవచ్చును. తక్కిన అంశములలో: విశ్వాసుల యందలి ధన్య జీవులూ, వృద్ధులూ - భగవత్ప్రేమాన్వితులైన యువజనులను శిక్షణాలయములలో సమీకరించి, వారికి దైవనిదర్శనములనూ, తిరుగులేని తర్కములనూ ధర్మచరిత్రమునూ సమస్త దివ్యప్రమాణములనూ బోధించేందుకూ, దివ్యధర్మచరిత్రమును వివరించి, స్పష్టీకరించేందుకూ, వాగ్దత్తపురుషుడి అవతరణమును గురించి వ్రాయబడినవీ, దివ్యగ్రంథములలోనూ, శ్రీముఖములయందునా ఉన్నవీ అయిన భవిష్యవాణులనూ, నిదర్శనములనూ సైతము - ఈ స్థాయిలన్నింటా పరిపూర్ణజ్ఞానము నొందు నటుల - అర్థవివరణము గావించేందుకూ గాను బోధనా సమావేశాలను నిర్వహించడమూ ఉన్నాయి.
ఆ విధముగనే, వీలైనప్పుడు, దివ్యఫలకముల అనువాదమున కొక సమితిని ఏర్పరుపవలె. ఫారసీ, అరబ్బీ, ఇంకా - అన్య విదేశీ భాషలపైనా సాధికారతను సాధించి, సమగ్రాధ్యయనము గావించిన, లేదా ఒక్క విదేశీ భాషనైనా ఎఱిగి ఉన్న విజ్ఞులు - దివ్యఫలకముల, ఈ దివ్యావిష్కరణ నిదర్శనాయుత గ్రంథముల - అనువాదమునూ, ఆ పుస్తకముల ప్రచురణనూ, ప్రపంచములోని ఐదు ఖండముల యందునా వితరణ మొనరించుటనూ మొదలిడవలె.
అలాగే, స్టార్ ఆఫ్ ది వెస్ట్ పత్రిక సంపాదకత్వ మత్యంత సక్రమముగ కొనసాగవలె; అయితే అందలి అంశములు - ప్రాక్పశ్చిమములకు అత్యంత ప్రధాన ఘట్టములు తెలియవచ్చేలా - భగవంతుని దివ్యధర్మవితరణకు సంబంధించినవై యుండవలె.
సూక్ష్మముగా చెప్పవలెనంటే, బహిరంగ సభలైనా, వైయక్తిక వేదికలైనా అన్ని సమావేశములలోనూ ఇప్పుడు ప్రస్తావితమౌతున్న దానిని గురించి దక్క యికదేనినీ చర్చించరాదు, సమస్త వ్యాసములూ భగవంతుని దివ్యధర్మమునే కేంద్రముగా గైకొని పరిభ్రమింపవలె. అందులోనికి అసంబద్ధ ప్రసంగములను లాగవలదు; వివాదము సంపూర్తిగా నిషేధమే.
వివిధ దిశలకూ పయనించు బోధకులు తాము వెళ్లుచున్న దేశీయభాషను నేర్చుకొనవలె. ఉదాహరణమునకు: జపనీసు భాషలో నిష్ణాతుడు జపానుకు వెళ్లుట, అటులే, చైనీసు భాష తెలిసిన వ్యక్తి సత్వరమే చైనాకు తరలుట వంటివి.
క్లుప్తముగా చెప్పవలెననిన, ప్రజలు ఈ విశ్వయుద్ధానంతరము, దివ్యబోధనల నాలించగల అసాధారణ సామర్ధ్యము నలవరచుకొనినారు; ఎందులకనిన, యుద్ధాగ్ని ప్రపంచవినాశకమనీ, శాంతికిరణములు ప్రపంచ జ్ఞానోదయ హేతువులనీ సర్వులకూ నిరూపితము కావచ్చునన్నదే - ఈ యుద్ధవిజ్ఞత. ఒకటి మృత్యువు, వేరొకటి జీవితము; వినాశ మిది, అమరత్వ మది; ఘోరతర విపత్తొకటి, మహదనుగ్రహ మింకొకటి; ఇది చీకటి, అది వెలుగు; నిత్యావమానమిది, అమరవైభవమది; మానవమూల వినాశిని యొకటి, మానవజాతి సౌభాగ్యసంస్థాపిని ఇంకొకటి.
పర్యవసానముగా, పలువురు ఉద్యమించి, పై నిబంధనల కనుగుణముగా వ్యవహరించి ప్రపంచదేశము లన్నింటికీ – విశేషించి - అమెరికా నుండి ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాలకు వెళ్లుట, జపాన్, చైనాల ద్వారా పయనములను సాగించుట సంభవించవచ్చును. ఆ విధముగనే బోధకులూ, విశ్వాసులూ జర్మనీ నుండి అమెరికా, ఆఫ్రికా, జపాన్, చైనాలకు పయనించవచ్చును; క్లుప్తముగా చెప్పవలెననిన, ప్రపంచమునందలి అన్ని ఖండములకూ, ద్వీపములకూ వారు పయనించవచ్చును. అలా అచిరకాలమునకే అత్యద్భుత ఫలితములు సాధించబడుతవి, ప్రపంచశిఖరాగ్రమున విశ్వశాంతి కేతనము రెపరెపలాడి, ప్రపంచమానవ యేకత్వజ్యోతులు విశ్వమును శోభాయమాన మొనరింపవచ్చును.
సంక్షిప్తముగా, ఓ భగవద్విశ్వాసులారా! దివ్యగ్రంథపాఠమిది: భగవత్సంబంధిత సమస్యలలో దేనిని గురించైనా ఇద్దరు విభేదించుకుంటూ, వాదించుకుంటూ, కలహించుకుంటూ, స్పర్ధించుకుంటూ ఉన్నట్లైతే, ఆ యిరువురిదీ దోసమే యగును. అప్రతిహతమైన యీ దైవశాసన విజ్ఞత ఇది: భగవద్విశ్వాసులలోని ఏ యిద్దరి మధ్యనైనను విభేద వివాదములు పొడసూపరాదు; పరస్పర మత్యంత స్నేహానురాగములతో వారు సంభాషించుకొనవలె. వివాదము ఛాయామాత్రముగ పొడసూపిననూ, వారు మౌనము నాశ్రయింపవలె, ఇరువర్గములూ చర్చల నిక సాగించరాదు, అయినను, వ్యాఖ్యాత నుండి సమస్య సత్యమునూ అడిగి తెలిసికొనవలె. ఖండనీయము కాని ఆదేశ మిది!
బహాఉల్-ఆభా మీతో నున్నాడు!
ప్రార్థన
ఓ దేవా నా దేవా! సమస్తప్రాంతములనూ గాఢాంధకార మెట్లు క్రమ్ముకొను చున్నదో, సకలదేశములూ విరోధజ్వాలలతో యెట్లు రగులుచున్నవో, ప్రాక్పశ్చిమములలో యుద్ధ-నరమేధాగ్ని యెట్లు జ్వలియింపుచున్నదో వీక్షింపుచున్నాడవు. రక్తము పారుచున్నది, మృతదేహములు నేలపై చెల్లాచెదరుగ పడుచున్నవి, తెగిన తలలు యద్ధభూమియందున ధూళిపాలైనవి.
ఓ ప్రభూ! ఈ అజ్ఞానులపై జాలిని వహించు, వీరిని క్షమాదృష్టితో వీక్షించి, మన్నించు. ఈ అగ్నిని ఆర్పు, తద్వారా, దిఙ్మండలము నగుపింపనీయని కాలమేఘములు చెదరిపోయి, సఖ్యతాకిరణములతో సత్యసూర్యుడు ప్రకాశించి, ఈ నిబిడాంధకారము పటాపంచలై, సకలదేశములపైనను సముజ్జ్వల శాంతిజ్యోతి తన దీప్తిని ప్రస రింపవచ్చును.
ఓ ప్రభూ! ప్రజలను విద్వేష, వైరముల అగాధము నుండి వెలికితీసి, ఈ అభేద్యాంధకారము నుండి వారికి విముక్తి నిమ్ము. వారి హృదయములను సమైక్యపరచు, శాంతి సఖ్యతల జ్యోతితో వారి నేత్రములను ప్రకాశింపజేయి. యుద్ధమునుండియు, రక్తపాతపు లోతులనుండియు వారిని విముక్తులను చేసి, దోషాంధకారమునుండి స్వేచ్ఛాజీవు లను గావించు. వారి కనులను గప్పిన తెరలను తొలగించి, మార్గదర్శక జ్యోతితో వారి హృదయములకు విజ్ఞతనిమ్ము. నీ మృదుకారుణ్యవాత్సల్యములతో వారిని దరి జేర్చుకో; శక్తివంతుల సర్వాంగములనూ ప్రకంపిత మొనరించు; వారి పట్ల నీ న్యాయవైఖరితో, క్రోథముతో వ్యవహరింప వలదు.
ఓ ప్రభూ! యుద్ధములు పంతము బూనినవి. ఆవేదనమూ, ఆందోళనమూ మితిమీరిపోయి, ప్రవర్ధమాన మౌతున్న ప్రతి ప్రాంతమూ వ్యర్థతనొంది యున్నది.
ఓ ప్రభూ! హృదయములు భారమైనవి, ఆత్మలు వేదన చెందుతున్నవి. ఈ దీనులపై కరుణను వహించు, స్వీయవాంఛాతిరేకతలకు వీరిని వదలివేయకు.
ఓ ప్రభూ! వినమ్రులను, విధేయులను నీ భూభాగములయం దావిర్భవిల్లజేసి, వారి వదనములను మార్గదర్శన కిరణములతో శోభిల్లజేసి, వారు ప్రపంచమునుండి బంధవిముక్తులై నీ దివ్యనామమును ప్రస్తుతి సేయుచూ, నీ ప్రశంసను సల్పుచూ, నీ పావనతా సౌరభములను మానవాళియందున పరివ్యాప్తము గావింపనిమ్ము.
ఓ ప్రభూ! వారి వెన్నులను బలపరుచు. వారి కటిసీమలను బిగియించు, వారి మనస్సులకు నీ మహనీయ వాత్సల్యచిహ్నములతో ప్రఫుల్లతను చేకూర్చు.
ఓ ప్రభూ! వారు నిశ్చయముగా బలహీనులు, నీవు శక్తిమంతుడవు, శౌర్యశాలివి; వారు శక్తిహీనులు, నీవు సహాయకుడవు, దయామయుడవు.
ఓ ప్రభూ! విద్రోహసముద్రము విజృంభిస్తున్నది, సమస్త ప్రదేశావృతమైన నీ అపారానుగ్రహముతో దక్క మరి దేనితోనూ ఈ తుఫానులు ప్రతిరోధితములు కావు.
ఓ ప్రభూ! నిక్కముగా, ప్రజలు వ్యామోహాగాధమున యున్నారు, నీ అనంతానుగ్రహములు తప్ప మరియేవీ వారిని రక్షించలేవు.
ఓ ప్రభూ! ఈ అనైతిక వాంఛాతిమిరమును తొలగద్రోయుము, అనతికాలమునకే సమస్తదేశములూ శోభాయమానము గావింపబడు నీ అనురాగజ్యోతితో వారి హృదయములను జ్యోతిర్మయ మొనరింపుము. అంతియగాక, తమ దేశములను, తమ పరివారములను, తమ బిడ్డలను వీడి, నీ దివ్యసౌందర్యవాత్సల్యమునకై, నీ సౌరభపరివ్యాపనమునకై, నీ బోధనల ప్రచురతకై దూరభూములకు తరలిన నీ ప్రియతములను అనుగ్రహించు. వారి ఏకాంతమున వారి సహచరుడవు, పరదేశముల యందున వారి సహాయకుడవు, వారి విచారనివారకుడవు, విపత్తున వారి ఆశ్వాసకుడవు కమ్ము. వారి దాహార్తిని దీర్చు నీటి చుక్కవు, వారి రుగ్మతలకు నివారణౌషధానివి, వారి హృదయోద్విగ్నతకు లేపనానివి కమ్ము.
నిక్కముగా, నీవు మహాదాతవు, అనంత కారుణ్యాధీశుడవు; నిశ్చయముగా, నీవు అనుకంపాన్వితుడవు, కరుణామయుడవు.
References:
1 బైబిల్ - మత్తయి 10:14
- ఉత్తరీశాన్య రాష్ట్రాల బహాయిలకు వెలువరించిన దివ్యఫలకము
[యునైటెడ్ స్టేట్స్ లోని తొమ్మిది ఉత్తరీశాన్యరాష్ట్రాలు: మెయిన్, మసచుసెట్స్, న్యూ హ్యాంప్షర్, రోడ్ ఐలండ్, కనెడికట్, వెర్మాంట్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్ నివాసు లైన బహాయిలను ఉద్దేశించి 1917 సం. ఫిబ్రవరి 2న హైఫాలో, అబ్దుల్-బహా నివాసంలోని ఇస్మాయిల్ ఆఖా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ నిజ మిత్రులారా:
నిజైకదైవ దృష్టిలో దేశములన్నియూ ఒక్కటే దేశము, సకల నగరములదీ, గ్రామములదీ ఒకే ప్రాతిపదిక. ఏదియూ ఇంకొకదానిని మించిన విశిష్టత నొంది యుండలేదు. అవన్నియూ దైవక్షేత్రములే, జనావాసములే. అయితే, విశ్వాసముతో, దృఢనిశ్చయముతో, ఒకరిపై ఒకరు సాధించిన ప్రాధాన్యతతో, నివాసి - ఆవాసమునకు గౌరవమును చేకూరుస్తాడు. కొన్ని దేశములు విశిష్టతను సంతరించుకుని, ఉదాత్తస్థాయి నందుకుంటాయి. ఉదాహరణకు: యూరోపియన్, అమెరికన్ దేశముల యందలి కొన్ని - పర్యావరణ రమ్యతలోనూ, జలసమృద్ధిలోనూ, పర్వతముల, మైదానముల, పచ్చికబీళ్ల మనోజ్ఞతలోనూ కొన్ని దేశములను అధిగమించినప్పటికీ, పాలస్తీనా మాత్రము - అబ్రహామ్ నాటి నుండి ప్రవక్తల ముద్ర1 అవతరణము వరకూ, పవిత్రావతారములు ఆ దేశమున వసించడమో, అచటకు తరలిపోవడమో, ఆ దేశము ద్వారా పయనించడమో జరిగినందున - దేశములకే తలమానికమైనది. అటులే, ప్రవక్తృత్వ జ్యోతి భాసిల్లినందున మక్కా, మదీనాలు అనంతకీర్తిని సముపార్జించుకొని యున్నవి. ఈ కారణముననే అన్య దేశములకన్ననూ పాలస్తీనా, హిజాజ్ లకు విశిష్టత చేకూరినది.
ఆ విధముగనే, నిజైకదైవదృష్టిలో అమెరికా ఖండము: ఆయన జ్యోతిర్వైభవ మావిష్కృతము కావలసిన, ఆయన దివ్యధర్మమర్మములు ప్రదర్శితములు కావలసిన, ధర్మవర్తనులు వసింపవలసిన, స్వేచ్ఛాజీవులు సమీకృతులు కావలసిన భూభాగము. అందువలన, అక్కడి ప్రతి ప్రాంతమూ ఆశీఃకృతమైనది; అయితే, విశ్వాస, అభయప్రదానముల పరముగా ఈ తొమ్మిది రాష్ట్రములూ అనుగ్రహీతము లైనందున, తత్ప్రాముఖ్యతతో అవి - ఆధ్యాత్మిక మహద్భాగ్యమునకు పాత్రత నొందినవి. ఈ అనుగ్రహప్రాధాన్యత నవి గ్రహియించి తీరవలె: ఎందులకనగా, అవి అంతటి బహూకృతికి పాత్రమైనవి, ఈ ఘనతరానుగ్రహమునకు ధన్యవాదముల నర్పించుటకై - అవి దివ్యసౌరభముల పరివ్యాపనమున కుద్యమింపవలె. తద్వారా: “స్వర్గమునకూ, భూమికీ జ్యోతి భగవంతుడే: ఆయన జ్యోతి అనురూపత గోడ గూటిలోని దివ్వె; గాజుపేటికలో దాచి ఉంచబడిన దాదీపము; ప్రకాశమయ నక్షత్రము వలె కానవచ్చు నాగాజు. అది ఒక ధన్యవృక్షపు – ప్రాక్పశ్చిమములలో దేనికీ చెందని ఆలివ్ వృక్షపు – తైలముతో ప్రజ్జ్వలితమైనది; అది ఆశించునది అల్పమే, కాని, ఏ అగ్నీ తనను స్పర్శించకున్ననూ ఆ తైలము వెలుగు నిచ్చును. ఈ వెలుగు ఇంకొక తేజముతో మిళితమైనది. భగవంతుడు తన తేజమును తనకు ఇష్టులైనవారి వంకకే ప్రసరించు,”2 నను ఖురాన్ పవిత్రవాక్కులు సాకారము కావచ్చును.
ఇట్లనుచున్నా డాయన: ప్రాకృతిక ప్రపంచ మంధకారమయ ప్రపంచము, ఏల యనగా, సహస్రభ్రష్టత్వములకు మూలమది; అంతియకాదు, చీకటికి తోడైన చీకటి యది. ప్రాకృతిక ప్రపంచశోభ సత్యసూర్యుని తేజముపై ఆధారితము. మార్గదర్శన కారుణ్యము, జ్ఞానవిజ్ఞతలనబడు గాజుగోళమున ప్రజ్జ్వలితమైన మైనపువత్తి వంటిది; మానవహృదయ దర్పణమే ఆ జ్ఞానవిజ్ఞతల గాజుగోళము. ఆ దేదీప్యమాన దీపిక తైలము ధన్యవృక్ష ఫలము నుండి స్వీకృతమైనది; ఆ తైలము అగ్నిలేకనే వెలుగు నటుల శుద్ధీకృతమైనది. దీపిక కాంతితీవ్రతనూ, గాజుగోళపు పారదర్శకతనూ, దర్పణ నైర్మల్యమునూ సమీకృత మొనరించినప్పుడు, దీప్తికి దీప్తి చేకూరిన యట్లగును.
సూక్ష్మముగా చెప్పవలెననిన, ఈ తొమ్మిది ఆశీఃకృత రాష్ట్రములయందునా అబ్దుల్-బహా - పర్యటించినాడు, ఒకచోటినుండి వేరొకచోటికి వెడలినాడు, దివ్యగ్రంథ జ్ఞానవ్యాఖ్యానము గావించినాడు, పరిమళ పరివ్యాపన మొనరించినాడు. రాష్ట్రములలో దివ్యసదనమును చాలవరకు నెలకొలిపి, బోధనాద్వారము దెరచినాడు. స్వచ్ఛబీజము లను ఆ రాష్ట్రములలో చల్లి, అనుగ్రహవృక్షములను నాటినాడు.
ఇక ఇప్పుడు, భగవద్విశ్వాసులును, దయామయుని సేవికలును ఈ క్షేత్రములకు నీటిని పెట్టి, ఈ దివ్యసస్యముల సేద్యమున అధికశక్తితో నిమగ్నులు కావలె. తద్వారా, బీజములు మొలిచి, ప్రవృద్ధములై, సౌభాగ్యానుగ్రహము సాకారమై, పంట దిగుబడు లెన్నియో పుష్కలముగ సమకూడవచ్చును.
స్వచ్ఛమైన సారవంతభూమికి, స్వామి అయిన కర్షకుని వంటిది - భగవంతుని దివ్యసామ్రాజ్యము. అందున దివ్యబీజములు వేయబడతాయి, దైవేచ్ఛామేఘములు వర్షిస్తాయి, సత్యసూర్య కిరణములు ప్రసరిస్తాయి.
ఈ అనుగ్రహములన్నియూ ఇప్పుడు ఈ తొమ్మిది రాష్ట్రములలోనూ నెలకొని, పరిపూర్ణముగా దృగ్గోచర మౌతాయి. దివ్యవనపాలుడు ఆ పుణ్యభూమిని జేరి, ఆ మహోదాత్త బోధనాబీజముల నాక్షేత్రమున వైచినాడు; భగవంతుని అనుగ్రహ జలధార వర్షితమైనది, సత్యసూర్యోష్ణిమ - అనగా దయాన్వితుని ఆశీస్సులు - పూర్ణతేజముతో ప్రసరింపనైనది. ఆ ధన్యజీవులయందలి ప్రతి ఒక్కరూ అప్రమేయుడైన ఏకైక జలప్రదాత కాగా, ప్రాక్పశ్చిమ అమెరికాలు మనోహర స్వర్గముగా పరివర్తన మొందవచ్చును. తద్వారా, సర్వోత్కృష్ట దేవగణమునుండి “ధన్యులు మీరు, మరియొకమారు, ధన్యులు మీరు,”3 అను ఉద్ఘోషణమును మీ రాలకింపవచ్చును.
మీకు ప్రశంసాభినందనలు.
ఈ ప్రార్థన బోధకులకూ, మిత్రులకూ నిత్యపఠనీయము:
దయాన్వితుడవైన ఓ దేవదేవా! నీకు ప్రస్తుతి - మాకు మార్గదర్శన మహాపథ దర్శనము గావించి, సామ్రాజ్యద్వారములను దెరచి, సత్యసూర్యునిచే సాక్షాత్కృతుడ వైనావు. అంధులకు దృష్టినిచ్చినావు; బధిరులకు వినికిడి ననుగ్రహించినావు; నిర్జీవులను సజీవులను గావించినావు; దీనులను శ్రీమంతులను జేసినావు; పెడద్రోవ బట్టిన వారికి పథదర్శన మొనరించినావు; నోరెండిన వారిని మార్గదర్శక ప్రస్రవణము దెసకు నడిపినావు; దాహార్తి నొందిన మత్స్యమును సత్యసముద్రపు దరిజేర్చినావు; త్రిమ్మరుచున్న పక్షులను కృపయను గులాబి వనములోని కాహ్వానించినావు.
ఓ సర్వశక్తిశాలీ! మేము నీ సేవకులము నీ దీనులము; ఒంటరులము - నీ సాన్నిధ్యాకాంక్షులము, నీ స్రవంతీజల దాహార్తులము, అస్వస్థులము – నీ వొన గూర్చు స్వస్థత నభిలషిస్తున్నాము. నీ పథమున పయనిస్తు న్నాము, నీ సౌరభపరివ్యాపనము దక్క మా కింకొక లక్ష్యమో, ఆశయమో లేదు; కనుక ఆత్మ లన్నియూ: “ఓ దేవా, మమ్ము సన్మార్గమునకు నిర్దేశింపు,”2 మని ఆక్రందింపవచ్చును. వెలుగును జూచుటకై వారి నేత్రములు తెరువబడు గాక; వా రజ్ఞానాంధకార విముక్తు లగుదురు గాక. వారు నీ మార్గదర్శకజ్యోతిని పరివేష్టింతురు గాక. భాగము నొందని ప్రతి యొక్కరునూ భాగము నొందెదరు గాక. అభాగ్యులు నీ మహిమల సాన్నిహిత్యము నొందెదరు గాక.
ఓ సర్వశక్తిమంతుడా! వాత్సల్యదృష్టితో మమ్ము వీక్షించు, దైవానుగ్రహములను మాకు ప్రసాదించు, పవిత్రాత్మ నిశ్వాసమును మా కనుగ్రహించు, తద్వారా, మేము నీ సేవయందున సాహాయ్యమునొంది, నీ మార్గదర్శనజ్యోతితో ఈ ప్రాంతముల యందున సముజ్జ్వలతారల వలె ప్రకాశింపవచ్చును.
నిశ్చయముగా, నీవు శక్తిసమన్వితుడవు, శౌర్యశాలివి, విజ్ఞుడవు, సంవీక్షకుడవు.
References:
1 మహమ్మదు 2 ఖురాన్ 24:35 3 ఖురాన్ 1:6
- దక్షిణాది రాష్ట్రాల బహాయిలకు వెలువరించిన దివ్యఫలకము
[యునైటెడ్ స్టేట్స్ లోని పదహారు దక్షిణాది రాష్ట్రాలు: డెలవేర్, మేర్లండ్, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, నార్త్ కరొలైనా, సౌత్ కరొలైనా, జార్జియా, ఫ్లారిడా, అలబేమ, మిసిసిపి, టెనెసీ, కెంటకీ, లుయిజియాన, అర్కన్సా, ఓక్లహోమా, టెక్సస్ నివాసులైన బహాయిలను ఉద్దేశించి 1917 సం. ఫిబ్రవరి 3న హైఫాలో, ఇస్మాయిల్ ఆఖా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఓ ధన్యజీవులారా, మాన్యులారా!
జనుల నివాసమున కత్యంత సముచితస్థలము సమశీతోష్ణమండలము, ఎందులకనగా, పరిపక్వతాపరముగా ఈ ప్రాంతమున మేధాశక్తులూ, మనోభావములూ ఉదాత్తస్థితి నొందుతాయి, నాగరికతా సంబంధిత ప్రతిభా పాటవములు పరిపూర్ణ స్థాయిలో వికసిస్తాయి - అను వాస్తవమును ప్రాచీన తత్త్వవేత్తలూ, మధ్యయుగ మేధావులూ, ప్రస్తుత, పూర్వశతాబ్దుల శాస్త్రజ్ఞులూ - సర్వులూ సమ్మతించినారు. మీరు విమర్శనాపూర్వకముగా, సునిశితదృష్టితో చరిత్రాధ్యయన మొనరించినప్పుడు, ప్రముఖులయందలి పలువురు - సమశీతోష్ణమండలమున జన్మించి, వృద్ధిలోనికి వచ్చి తమ కృషిని కొనసాగించిన వారేననీ, అత్యుష్ణ, అతిశీతలమండలవాసులు బహు కొద్దిమందేననీ స్పష్టమౌతున్నది.
ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లోని ఈ పదహారు దక్షిణాది రాష్ట్రములూ సమశీతోష్ణ మండలస్థితములే. ఈ ప్రాంతమున ప్రాకృతికప్రపంచ పరిపూర్ణతలు సర్వసమగ్రముగా వెల్లడియైనవి. ఎందులకనగా, పర్యావరణ సమతుల్యతా, ప్రకృతి సౌందర్యమూ, గ్రామసీమల భౌగోళిక విన్యాసమూ మేధస్సులలోనూ, మనోభావముల యందునా మహత్తర ప్రభావమును ప్రదర్శిస్తాయి. పరిశీలనాత్మకముగ, అనుభవపూర్వకముగ, ప్రస్ఫుటముగ వెల్లడియైన వాస్తవమిది.
పవిత్ర దివ్యావతారమూర్తులు సైతము, అత్యంత సమతులన స్వభావులై యుండెడివారు; వారి శరీరారోగ్యమూ, సర్వసమగ్రతా అత్యంత పరిపూర్ణములై, వారి భౌతికతత్త్వములు దేహదార్ఢ్యతాయుతములై, వారి శక్తులు నిర్దిష్టసరళీ సమన్వితములై, వారి బాహ్యస్పందనలు అంతర్లీన గ్రహణశక్త్యనుసంధానితములై, అసాధారణ శీఘ్రతాయుతములై, సమన్వయ ప్రపూరితములై యుండెడివి.
అందువలన, ఈ పదహారు రాష్ట్రాలలోనూ- వాటి వాతావరణము అత్యంత సమతులనయుతము కనుక, నిస్సందేహముగా దివ్యబోధనలు సముజ్జ్వలప్రభతో ఆవిష్కృతములు కావలె, పవిత్రాత్మనిశ్వాసములు మహోధృతిని ప్రదర్శింపవలె, ఉత్తుంగతరంగములతో భగవద్వాత్సల్యసాగర ముప్పొంగవలె, దివ్యానురాగమను ఉపవన మలయపవనములు మహోధృతవేగమున వీయవలె, పవిత్రతాసౌరభములు సత్వరమే శీఘ్రగతిన పరివ్యాప్తములు కావలె.
భగవంతునికి ప్రస్తుతి, దివ్యప్రవాహము లనంతములై, ఉదాత్తసూత్ర మధురిమ పరమప్రభావశీలమై, మహత్తరకక్ష్య పరిపూర్ణశోభా ప్రభాసితమగుచూ, సర్వోత్కృష్టగణ సైనికదళములు అప్రతిహతశక్తితో ముట్టడిస్తుండగా, జిహ్వలు ఖడ్గముల కన్నను నిశితములై, హృదయములు విద్యుత్కాంతి కన్నను తేజోభరితములై, మిత్రుల యౌదార్యము పూర్వాపర తరముల వదాన్యతల నధిగమిస్తుండగా - ఆత్మలు దైవసంకల్ప సమాకర్షితములై - భగవంతుని ప్రేమాగ్ని ప్రజ్జ్వలితమైనది.
ఈ సమయాన, ఈ సందర్భాన, మన మీమహదవకాశమును తప్పక వినియోగించుకొనవలె. క్షణమేని స్తబ్ధులము కారాదు; స్థిమితము, విశ్రామము, ప్రశాంతత, వస్తుజాలము, జీవితము, ప్రాపంచిక విషయవ్యామోహముల నుండి బంధవిముక్తులము కావలె. పరమోన్నతుడైన జీవాధినాధునికై సమస్తమును త్యాగము సేయవలె, తద్వారా దివ్యసామ్రాజ్యశక్తులు మహత్తర బుద్ధిసూక్ష్మతలను ప్రదర్శిత మొనరింప, ఈ నవీనావృత్తస్థిత తేజోభాసము - మేధో, లక్ష్య ప్రపంచములను శోభిల్లజేయ వచ్చును.
అమెరికాలో దైవసౌరభములు పరివ్యాప్తములై దరిదాపుగా ఇరువదిమూడు వత్సరములైనది, కాని సముచిత, సయుక్తస్పందన సాధింపబడలేదు, మహత్తర ప్రశంసా, వేగాధిక్యతా అగుపించలేదు. ఇప్పుడిక దైవశక్తితో, దయాన్వితుని పరిమళములతో, చైతన్యాకర్షణముతో అలౌకిక వర్షధారలతో, దైవసేనాదళములతో, భగవద్వాత్సల్య ప్రస్రవణపు వెల్లువతో, భగవద్విశ్వాసు లుద్యమింతురని, మహాశుభము అనతి కాలమునకే తన ముసువును తొలగించునని, ప్రాకృతిక ప్రపంచాంధకారము సంపూర్ణముగ పటాపంచలై, పారద్రోలబడునంతటి తీక్ష్ణతతో సత్యసూర్యుడు ప్రకాశించునని; సకల దిశలనుండియు మహాద్భుత మధురగీతిక వెలువడునని, మానవాళి సచేతనయై, పురోగమించునటుల, ఘనపదార్థములు ద్రవీభవించునటుల, వజ్ర కఠినులు తమ రెక్కలను విప్పార్చుకుని భగవంతుని అనురాగోష్ణిమలో స్వర్గసీమ దెస కెగయునటుల - ప్రాతఃకాల విహంగములు గళములనెత్తి గానము సేయునని నా యాశ.
రమారమి రెండువేల వత్సరములకు పూర్వము ఆర్మీనియా నిబిడాంధకార సమావృతమై యుండెడిది. క్రీస్తు శిష్యులయందలి ధన్యజీవి యొక్కడు, సత్వరమే తరలినా డాప్రాంతమునకు; ఆతడి కృషితో అచిరకాలమునకే ఆ దేశము చైతన్య ప్రపూరితమైనది. ఆ విధముగ దివ్యసామ్రాజ్యశక్తి క్రియాశీలకత ప్రస్ఫుటమైనది.
కనుక, దయామయుని ఆశీస్సులూ, మహోన్నతుని సాహాయ్యమూ సునిశ్చితములని విశ్వసింపుడు; ఈ ప్రపంచమున కతీతముగ, ప్రపంచవాసులనుండి ప్రక్షాళితులూ, పునీతులూ కండు; మీ లక్ష్యములను సకలజన హితార్థమై వ్యవహరింప నిండు; మీ ప్రాపంచిక వ్యామోహమును త్రెంచుకుని, ఉత్తేజసారమై లాఘవమును, సౌకుమార్యమును సంతరించుకొనండి. అటుపై, దృఢసంకల్పముతో, నిర్మలహృదయముతో, సముల్లాసస్ఫూర్తితో, వచోధారాసమన్విత భాషతో, దివ్యసూత్ర ప్రకటనమునకై మీ సమయమును వెచ్చింపవలె, తద్వారా మానవప్రపంచ ఏకత్వము తన మండపమును అమెరికా శిఖరాగ్రముపై నెలకొలుపవచ్చును, ప్రపంచదేశము లన్నియూ దైవవిధానము ననుసరింపవచ్చును. దైవవిధానమనగా సకలజనావళికీ న్యాయము, కృపలే యనునది సునిశ్చయము. ఎందులకనగా, ప్రపంచదేశము లన్నియూ భగవంతుని గొఱ్ఱెలే, భగవంతుడే ప్రేమాస్పదుడైన కాపరి. ఆయన ఈ గొఱ్ఱెలను సృష్టించి, సంరక్షించి, పరిపోషించి, శిక్షణ నొసగినాడు. ఇంతకుమించిన అనంతవాత్సల్య మేమున్నది? భగవంతునకు ప్రస్తుతి, మనము సమస్త జ్ఞానవిహీన వివక్షలనుండీ విముక్తులమై, భగవంతుని గొఱ్ఱె లన్నింటిపట్లనూ కారుణ్యముతో ఉన్నందులకూ; ప్రతి ఒక్కరినీ సేవింపవలె, దయాన్విత పితరునివలె ప్రతి ఒక్కరికీ శిక్షణ నీయవలె ననునది మన పరమావధి అయినందులకూ - దశసహస్ర ధన్యవాదముల ననుక్షణమూ అర్పింపవలె.
మీకు ప్రశంసాభినందనలు!
ఈ రాష్ట్రముల యందలి నగరములకు, గ్రామములకు, కుగ్రామములకు వెడలి, భగవత్సౌరభములను పరివ్యాపన మొనరించుట యందు నిమగ్నతనొందెడు ప్రతి వ్యక్తీ, ప్రతి ఉదయమూ - ఈ వినతిని ధ్యాన పూర్వకముగా పఠింపవలె.
ఓ నా దేవా! ఓ నా దేవా! నీ వాక్కును జనసామాన్యమున ప్రవృద్ధ మొనరించి, నీ జనులయందున నీ బోధనలను పరివ్యాపనము గావింప సంకల్పించి, మహత్తరకార్యమున మగ్నుడనైన నన్ను, నా అల్పత్వమున, అశక్తత యందున వీక్షింపుచున్నాడవు. పవిత్రాత్మ నిశ్వాసముతో నీవు నాకు సాహాయ్యపడకుండినచో, విజయము నొందుటకు నీ సువిఖ్యాత సామ్రాజ్యసేనలతో నాకు తోడుపడకుండినచో, మక్షికమును పక్షీంద్రునిగ, జలబిందువును నదులుగ, సముద్రములుగ, అణువును దీపికలుగ సూర్యులుగ పరివర్తన గావింపగల నీ యనుగ్రహములను నాపై కురియింప నిచో నే నెటుల సాఫల్యత నొందగలను. ఓ నా ప్రభూ! నా జిహ్వ సర్వజనులయందుననూ నీ ప్రస్తుతులను, విశిష్టతలను వచియించునటుల, నీ ప్రేమ, పరిజ్ఞానముల మధువుతో నా మనస్సు ఉప్పొంగునటుల నీ విజయ ప్రదాయక, కార్యసాధకశక్తితో నాకు తోడ్పడు.
నీవు సర్వశక్తియుతుడవు, నీ ఇచ్ఛానుసార వ్యవహర్తవు.
- మధ్య రాష్ట్రాల బహాయిలకు వెలువరించిన దివ్యఫలకము
[యునైటెడ్ స్టేట్స్ లోని పన్నెండు మధ్య రాష్ట్రాలు: మిషిగెన్, విస్కాన్సన్, ఇలినోయీ, ఇండియాన, ఒహాయో, మినెసోట, అయ్వా, మిజోరీ, నార్త్ డకోట, సౌత్ డకోట, నెబ్రాస్క, కాన్సస్ ల నివాసులైన బహాయిల నుద్దేశించి, 1917 సం. ఫిబ్రవరి 8న అక్కాలో అబ్బుద్ గృహంలోని బహాఉల్లా గదిలో దీనిని వెలువరించచడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ వృద్ధవిశ్వాసులారా, సన్నిహిత మిత్రులారా!
మహనీయ ఖురాన్‌లో భగవంతుడు ఇలా వచిస్తున్నాడు: “తా దలచిన వారి పట్ల తన కారుణ్యప్రదర్శనమున ప్రవీణు డాయన.”1
యునైటెడ్ స్టేట్స్ లోని ఈ పన్నెండు మధ్యరాష్ట్రాలూ అమెరికాకు హృదయము వంటివి; మానవుని సర్వావయవములకూ హృదయము అనుసంధానితమై ఉంటుంది. హృదయము బలపడితే సమస్త శరీరభాగములూ శక్తిసమన్వితములై, సత్త్వమును సంతరించుకుంటాయి, హృదయము బలహీనమైతే సమస్త శరీరాంగములూ దౌర్బల్యమునకు లోనౌతాయి.
షికాగో, దాని పరిసరములూ, భగవత్సౌరభముల పరివ్యాపన మారంభమైనప్పటినుండీ ఇంతవరకూ దృఢమనస్క యగుచూ వచ్చినందున, భగవంతునికి ప్రస్తుతి. భగవత్కృపతోనూ, విధాతానుగ్రహముతోనూ ఇది కొన్ని మహత్తరాంశములలో నిరూపితమైనది. .
మొదటిది: దివ్యసామ్రాజ్యాహ్వానము ప్రప్రథమముగా షికాగోనుండి వెలువడి నది. వాస్తవమునకు మహత్త రానుగ్రహమిది, ఏలననగా, భావిశతాబ్ద కాలములలో షికాగో ప్రతిష్ఠ కిది పరిభ్రమణ కేంద్రము వంటిది కాగలదు.
రెండవది: ఆ ధన్యభూమియందున మహాధైర్యశాలులూ, స్థైర్యవంతులూ అయిన వారెందరో భగవద్వచన ప్రచారార్థమై అవతరించి, ప్రతి భావననుండియూ ప్రక్షాళిత, పునీత మనస్కులై, దైవబోధనల పరివ్యాపనమున నిమగ్నులైనారు. కనుకనే, అవిచ్ఛిన్నముగా సర్వోత్కృష్ట దివ్యగణమునుండి ప్రశంసాధ్వానము వెలువడినది.
మూడవది: అమెరికా పర్యటనాక్రమములో అబ్దుల్-బహా పలుమారులు షికాగో మీదుగా వెళ్లడమూ, భగవన్మిత్రులతో సహవర్తి కావడమూ సంభవించినవి. ఆయన - కొంతకాలముపా టానగరమున వసించినాడు; సత్యస్వరూపుని సంకీర్తనమున రేయింబవళ్లు నిమగ్నుడై, ప్రజలను భగవత్సామ్రాజ్యమున కామంత్రించినాడు.
నాలుగవది: ప్రస్తుత సమయము వరకు, షికాగోయం దారంభింపబడిన ప్రతి ఉద్యమమూ, తత్ప్రభావమూ - హృదయములోనూ, హృదయమునుండీ ద్యోతకమౌతూ, అభివ్యక్తమౌతూ శరీరాంగములనూ, అవయవములనూ సమస్తమునూ ప్రభావిత మొనరిస్తూ ఉండే ప్రతిదాని వలెనే - సకల ప్రాంతములకూ, దిశలకూ విస్తరించినవి.
ఐదవది: అమెరికాలో తొలి మష్రికుల్-అఝ్కార్ షికాగోలో సంస్థాపితమైనది, అమూల్యము లాగౌరవప్రతిష్ఠలు. ఈ మష్రికుల్-అఝ్కార్ నుండి, నిస్సందేహముగా, వేలకొలదీ మష్రికుల్-అఝ్కార్ ల ఆవిర్భావము జరుగుతుంది.
ఆ విధముగనే, షికాగోలో - సార్వత్రిక వార్షిక సదస్సులూ, ది స్టార్ ఆఫ్ ది వెస్ట్ సంస్థాపనా, దివ్యఫలకముల ప్రచురణా, అమెరికాలోని అన్ని ప్రాంతములలోనూ వాటి వితరణలకై పబ్లిషింగ్ సొసైటీ ఏర్పాటూ జరిగినవి, భగవంతుని దివ్యసామ్రాజ్య స్వర్ణ శతాబ్ది వార్షికోత్సవ నిర్వహణకు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ దివ్యోత్సవమూ, ఈ దివ్యప్రదర్శనమూ అత్యంత నిర్దుష్టతతో జరుపుకొనబడునని, తద్వారా, “ఏకేశ్వరుడు దక్క వేరుదైవము లేడు, ఆది నుండి ప్రవక్తృత్వ ముద్రయైన మహమ్మదు వరకూ పంపబడిన సమస్త దివ్యవార్తావహులూ సత్యస్వరూపి యానతిన యేతెంచినా,” రను ప్రపంచ సమైక్యతాహ్వానము వెలువడవచ్చునని; మనుష్యప్రపంచపు టేకత్వపతాక మావిష్కృతమై, విశ్వశాంతి మధురగీతిక ప్రాక్పశ్చిమముల వీనులను జేరి, మార్గములన్నియూ నిర్నిరోధితములై, అవక్రములై, హృదయములన్నియూ భగవత్సామ్రాజ్య సమాకర్షితములై, అమెరికా శిఖరాగ్రమున సమైక్యతాపటవేశ్మము సంస్థాపితమై, సమస్త దేశములనూ, ప్రజలనూ భగవంతుని ప్రేమగీతిక హర్షోల్లసితులను సేయగా, ధరణీతలము అమరధామమై, కాలమేఘములు పారద్రోలబడి, సత్యసూర్యుడు సంపూర్ణ తీక్ష్ణతతో భాసిల్లవచ్చునని ఆశిస్తున్నాను.
ఓ భగవన్మిత్రులారా! మనఃపూర్వకముగ యత్నింపుడు, తద్వారా, హృదయముల మధ్యన సహవర్తన, వాత్సల్యము, సమైక్యత, ఏకీభావములు సాధింపబడ వచ్చును, లక్ష్యములన్నియూ ఒకే లక్ష్యము కావచ్చును, గీతిక లన్నియూ ఒకే గీతిక కావచ్చును, సమస్త ప్రాకృతిక ప్రపంచశక్తులనూ అధిగమించు నంతటి మహత్తర విజయమును పవిత్రాత్మశక్తి సాధింపవచ్చును. పరిశ్రమింపుడు; మీ లక్ష్యము అనిర్వచనీయ వైభవప్రపూరితము. విజయము మీ కృషికి మకుటమైనచో, అమెరికా - ఆధ్యాత్మిక శక్తితరంగముల ప్రాదుర్భావకేంద్రముగా తప్పక పరిణామము చెందును. తన అనంత యశోవైభవములతో భగవంతుని దివ్యసామ్రాజ్యసింహాసనము సుదృఢముగ ప్రతిష్ఠిత మగును.
ఈ అసాధారణ ప్రపంచము మార్పునకు లోనుకాని స్థితియందున స్వల్పకాలమైననూ ఉండదు. క్షణక్షణము నకూ మార్పుచెందుతూ, పరివర్తితమగుచునే యుండు నిది. అంత్యమునకు ప్రతి పునాదీ కదలి, ప్రతి శోభావైభవమూ కనుమరుగై, అదృశ్యత నొందును; అయితే భగవత్సామ్రాజ్యము నిత్యము; స్వర్లోక సార్వభౌమత్వ ప్రాభవములు సుస్థిరములు, శాశ్వతములు. కనుక, ఒక జ్ఞాని దృష్టిలో: ప్రపంచ ప్రభుత్వ సింహాసనమున కన్ననూ భగవత్పామ్రాజ్యమున యున్న చాపకే ప్రాథమ్యత.
భగవత్ప్రేమ ప్రభాతస్థలులూ, పవిత్రీకరణ, పావనత్వముల క్షితిజతారలూ, ఇంకా ఈ అంధకారమయ విశ్వమును తేజోమయ మొనరించి, ఈ జీవరహిత ప్రపంచమునకు ప్రాణదాతలూ అయిన కొందరు ధన్యజీవుల మధురగానము - బహుశః నాకు వినవచ్చునేమోయని నా కన్నూ, చెవీ మధ్య రాష్ట్రముల వైపునకే నిరంతరమూ సారింపబడి ఉంటాయి. అబ్దుల్-బహా ఆనందము దీనిపైననే ఆధారితమైనది! ఇందున మీ రనుగ్రహీతులు కాగల రని ఆశింతును.
కనుక, పరిపూర్ణ బంధవిముక్త స్థితినంది, ప్రాకృతిక ప్రాపంచిక లోపప్రక్షాళితులై, ఈ ఐహికవ్యామోహ పునీతులై, అమరజీవనశ్వాసతో సజీవులై, జ్యోతిర్మయ హృదయులై, దైవస్ఫూర్తిప్రపూరితులై, చైతన్యాకర్షణాన్వితులై, అలౌకిక వితరణశీలులై, వచోధారాన్వితజిహ్వులై, విస్పష్టవివరణాయుతులైన వారు సత్వరమే తరలి వెడలి, మధ్య రాష్ట్రీయ ప్రాంతములయం దంతటా పర్యటింపవలె. నగరనగరమునా, గ్రామ గ్రామమునా దివ్యప్రబోధముల, సూచనల పరివ్యాపనమున మగ్నులై, ఆత్మలకు పథనిర్దేశము గావింపుచూ, ప్రపంచ మానవాళి యేకత్వమునకు ప్రచురతను జేకూర్పవలె. ప్రతి బధిరుడూ శ్రవణశక్తి నొందునంతటి, మలిగిన ప్రతియొక్కడూ ప్రజ్జ్వలితు డగునంతటి, మృతినొందిన ప్రతి యొక్కడూ నవచేతన నొందునంతటి, ప్రతి నిర్లిప్తుడూ మహదానందభరితు డగునంతటి శక్తితో అంతర్జాతీయ సాంత్వనాగీతికను వా రాలపింప వలె. అదియే పరాకాష్ట యనునది సునిశ్చయము.
భగవత్సౌరభ పరివ్యాపకులను ప్రతి ఉదయమునా ఈ ప్రార్ధనను చేయనిండు:
ఓ ప్రభూ, నా దేవా! నీవు నన్ను సామ్రాజ్యమహాపథమునకు మరలించి, నన్ను ఈ అవక్ర, ఋజుమార్గమున పయనింపచేసి, నీ తేజఃప్రభాస వీక్షణముతో నా కంటికి వెలుగునిచ్చి, మార్మికసామ్రాజ్య పావనవిహంగముల మధురగానముల వంకకు నన్ను చెవియొగ్గజేసి, ధార్మికులయందలి నీ ప్రేమతో నా హృదయము నాకర్షించి నందులకు నీకు ప్రస్తుతి, కృతజ్ఞతా సమర్పణములు.
ఓ ప్రభూ! దేశములయందున నీ దివ్యనామధేయము పేరిట పిలుపునిచ్చి, నీ దివ్యసామ్రాజ్యావతరణ శుభవార్త నందించునటుల పవిత్రాత్మతో న న్ననుగ్రహించు.
ఓ ప్రభూ! నేను బలహీనుడను, నీ శక్తిసత్త్వములతో నన్ను సశక్తీకరించు, నా జిహ్వ తొట్రువడుచున్నది, నన్ను నీ స్మరణాప్రస్తుతులను గావింపనిమ్ము, అధముడను, నీ సామ్రాజ్యములోనికి న న్ననుమతించి ఆదరించు, దూరస్తుడను నీ కారుణ్య ద్వారము దరి జేరనిమ్ము.
ఓ ప్రభూ! నన్నొక సముజ్జ్వలజ్యోతిని, శోభయమాన తారకను, ఈ ప్రాంతముల నన్నింటినీ తన శాఖలతో సమాచ్ఛాదించు ఫలయుత ధన్యవృక్షమును గావింపుము. నిక్కముగా, నీవు శక్తిశాలివి, అధికారపరిపూరితుడవు, నిర్నిరోధితుడవు.
References:
1 ఖురాన్ 2:105, 3:74
12. పశ్చిమ రాష్ట్రాల బహాయిలకు వెలువరించిన దివ్యఫలకము
[యునైటెడ్ స్టేట్స్ లోని పదకొండు పశ్చిమ రాష్ట్రాలు: న్యూ మెక్సికో, కొలరాడో, అరిజోనా, నెవాడ, కాలిఫోర్నియా, వయోమింగ్, యూటా, మంటానా, ఐడహో, ఓరెగన్, వాషింగ్టన్ ల నివాసులను ఉద్దేశించి 1917 సం. ఫిబ్రవరి 15న అక్కాలో అబ్బుద్ గృహంలోని బహాఉల్లా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ మిత్రులారా, దయామయుని సేవికలారా, దివ్య సామ్రాజ్య నియుక్తులారా,
ఆశీఃకృతమైన కాలిఫోర్నియా రాష్ట్రమునకూ, పవిత్రభూమికీ - అనగా పాలస్తీనా దేశమునకూ – ఎంతో సారూప్యత ఉన్నది. అక్కడి గాలి అత్యంత సమశీతలమై, పీఠము సువిశాలమై ఉంటాయి, పాలస్తీనా ఫలము లెంతో నవనవలాడుతూ, నాజూకుగా ఉంటాయి. ఆ రాష్ట్రములలో పర్యటిస్తున్నప్పుడు తాను పాలస్తీనాలో ఉన్నట్లే అనుభూతిని చెందినాడు – అబ్దుల్-బహా; ఎందులకనగా ఈ ప్రాంతమునకూ ఆ రాష్ట్రమునకూ ప్రతి కోణంలోనూ మంచి పోలిక ఉన్నది. పసిఫిక్ సముద్రతీరములు సైతం, కొన్ని సందర్భములలో, సంపూర్తిగా పవిత్రభూమి తీరములను తలపిస్తాయి; పవిత్రభూమిలోని వృక్షజాలమూ ఆ తీరములలో అభివృద్ధి చెందినదే. ఈ అనుశీలన మత్యద్భుతమూ, ఆశ్చర్యజనకమూ కూడ.
అదే విధముగా కాలిఫోర్నియాలోనూ, తక్కిన పశ్చిమ రాష్ట్రములయందునా, మానవమేధలను మంత్రముగ్థము గావించు ప్రాకృతిక ప్రపంచపు టద్భుత దృశ్యములు గోచరిస్తాయి. బృహత్పర్వతములూ, లోతైన లోయలూ, మహోత్తుంగ జలపాతములూ, మహావృక్షములూ అన్నిచెరగులా అగుపిస్తాయి, ఇక దాని నేల అత్యంత సారవంతమూ, సర్వసమృద్ధమూ. ఆశీఃకృతమైన ఆ రాష్ట్రము పవిత్రభూమి వంటిదే; ఆ ప్రాంతమూ, ఆ జనపదములూ మనోహర స్వర్గతుల్యములే. పలు విధములుగా అది పాలస్తీనా వంటిదే. ప్రాకృతిక సారూప్యతలున్నవి కనుక, ఇప్పుడిక, దివ్యత్వ సారూప్యతలు సైతము సాధింపబడవలె.
పాలస్తీనాలో దివ్యత్వ ఛాయాప్రభలు అభివ్యక్తమౌతున్నాయి. ఇజ్రాయేలీయ దివ్యప్రవక్తలయందలి పలువురు ఈ పావనస్థలినుండియే భగవత్సామ్రాజ్యాహ్వానమును వెలువరించినారు. ఆధ్యాత్మిక బోధనలు పరివ్యాపన మగుటచే, ధార్మికహృదయుల నాసికా రంధ్రములు పరిమళభరితములైనవి, చైతన్యవంతుల నేత్రములు తేజోవంతములైనవి, వీనులు యీ గీతికతో పులకించినవి, హృదయములు భగవంతుని దివ్యసామ్రాజ్య మనోల్లాస మారుతముతో సచేతనములై, సత్యసూర్యుని ప్రభ నుండి మహోత్కృష్ట ప్రభాసము నొందినవి. అటుపై, ఈ ప్రాంతమునుండి ఐరోపా, అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలకు జ్యోతి పరివ్యాప్త మొందినది.
కాలిఫోర్నియా, తక్కిన పశ్చిమ రాష్ట్రములూ - పవిత్రభూమితో ఇప్పుడు మరింత చక్కని సారూప్యతను సంతరించుకొనవలె, ఆ రాష్ట్రమునుండి, ఆ ప్రాంతమునుండి అమెరికా, ఐరోపాలకు పవిత్రాత్మ నిశ్వాసములు విస్తరింపవలె; తద్వారా – భగవంతుని దివ్యసామ్రాజ్యాహ్వానము, సమస్త శ్రవస్సులకూ సంతసోల్లాసములను కలిగింప వచ్చును, దైవసూత్రములు నవజీవనము ననుగ్రహించవచ్చును, భిన్నపక్షము లేకపక్షము కావచ్చును, వైమనస్య భావన లంతరించి ఒకే విశిష్టకేంద్రము చుట్టూ పరిభ్రమణ మొనరింపవచ్చును, ప్రాక్పశ్చిమ అమెరికాలు పరస్పర మాలింగన మొనరించుకొన వచ్చును, మానవప్రపంచ సమైక్యతాగీతిక మానవబాల లెల్లరకూ నవచేతనను ప్రసాదింప వచ్చును, విశ్వశాంతి పటవేశ్మము అమెరికా శిఖరాగ్రమున ప్రతిష్ఠితము కావచ్చును; ఆ విధముగా ఐరోపా, ఆఫ్రికాలు పవిత్రాత్మ నిశ్వాసములతో చైతన్యము నొందవచ్చును, ఈ ప్రపంచ మింకొక ప్రపంచము కావచ్చును, రాజ్యవ్యవస్థ నూతనోల్లాసము నొందవచ్చును, ప్రాకృతికప్రపంచపు టద్భుతదృశ్యములు కాలిఫోర్నియా రాష్ట్రములో వలె, తక్కిన పశ్చిమ రాష్ట్రములలో వలె ప్రత్యక్షములూ, ప్రస్ఫుటములూ కావచ్చును, భగవంతుని దివ్యసామ్రాజ్య బృహత్సంకేత ములు సైత మభివ్యక్తములై, తద్వారా దేహము ఆత్మకు ప్రతిరూపము కావచ్చును. బాహ్యప్రపంచము మనో ప్రపంచమునకు ప్రతీక కావచ్చును, భూమియను అద్దము స్వర్లోక సుగుణములను ప్రతిఫలించు దివ్యసామ్రాజ్య దర్పణము కావచ్చును.
ఆ ప్రాంతములలో నా పయన, పర్యటనల సందర్భమున మహాద్భుత ప్రాకృతిక ప్రదేశములనూ, సువిస్తృత విహంగవీక్షణ దృశ్యములనూ, ఉద్యానములనూ, వాహినులనూ వీక్షించినాడను; జాతీయ పార్కులూ, సార్వత్రిక సమావేశములూ; ఎడారులూ, మైదానములూ, పచ్చికబయళ్ళూ; ఇంకా ఆ ప్రాంతీయ ధాన్యములూ, ఫలములూ నా దృష్టి నెంతో ఆకట్టుకున్నాయి; ఈ క్షణము వరకూ నా మదిలో నిలిచే ఉన్నాయి.
ప్రత్యేకించి, శాన్‌ఫ్రాన్సిస్కో, ఓక్లండ్ లలో జరిగిన సభలతోనూ, లాస్ ఏంజెలెస్ లో జరిగిన సమావేశములతోనూ, అన్యరాష్ట్ర విశ్వాసులతోనూ నేనెంతో సంతుష్టుడనైనాను. వారి ముఖసీమలు లెప్పుడు స్ఫురణకు వచ్చినా, అప్పటికప్పుడు నాకు అంతులేని ఆనందం కలుగుతుంది.
అందువల్లనే, దివ్యబోధనలు సూర్యకిరణములవలె పశ్చిమ రాష్ట్రములన్నింటా ప్రసరింపవలెనని, “శుభనగర మిది, ప్రభుడు క్షమాదాత!”1 యను ఖురాన్ సుభాషితము సాకారము కావలెనని - ఆశిస్తున్నాను. ఆ విధముగనే, “మీరు దేశ మంతటా పయనింపరా?”2 యను ఖురాన్ సుభాషితమూ, “భగవత్కృప ఛాయల నవ లోకింపు,”3 డను వేరొక సుభాషితమూ మహాశోభాయమానముగా ఆవిష్కృతమగు గాక.
దైవానుగ్రహముతో, విధివశాత్తూ సేవాక్షేత్ర మాప్రాంతమున సువిస్తృతినొంది నందులకూ, బుద్ధికుశలత, పురోగమనముల పరముగా మానవమేధలు మహోన్నత స్థాయిలో ఉన్నందులకూ, శాస్త్రవిజ్ఞానములూ, కళలూ ప్రోత్సహింపబడుతున్నందులకూ, హృదయములు దర్పణసదృశములై, అనంతనిర్మలములై, పారదర్శకస్థితిలో ఉన్నందులకూ, భగవన్మిత్రులు పరిపూర్ణముగా పరస్పరాకర్షితులై ఉన్నందులకూ గాను - భగవంతునికి ప్రస్తుతి. అందువల్ల, బోధనాసమావేశములు నిర్వహింపబడుననీ, మొదలిడబడుననీ, భగవత్సౌరభ పరివ్యాపనమునకై విజ్ఞులైన బోధకులను నగరములకూ, గ్రామములకూ పంపుట సైతము జరుగుననీ ఆశింపనైనది.
దివ్యధర్మబోధకులు - పావనులూ, సమున్నతులూ, జ్యోతిర్మయులూ కావలె. వారు స్ఫూర్తిస్వరూపులూ, విజ్ఞానమూర్తులూ కావలె; సుదృఢనిశ్చయులై, స్థైర్యవంతులై, ఆత్మత్యాగనిరతులై సేవాపూర్వకముగ వా రుద్యమింప వలె. వారు తమ పర్యటనలలో ఆహార, వస్త్రధారణలకు సమ్మోహితులు కారాదు. వారు తమ ఆలోచనలను భగవ త్సామ్రాజ్య జలధారలపై కేంద్రీకరించి, పవిత్రాత్మ అనుగ్రహముల నర్థింపవలె. ఒక దివ్యశక్తితో, చైతన్యాకర్షణముతో, దివ్యలోక శుభసమాచారముతో, అలౌకిక పావిత్య్రతతో - అభా దివ్యస్వర్గసౌరభములతో నాసికా రంధ్రములను వారు పరిమళభరిత మొనరింపవలె.
ఈ క్రింది వినతిని వా రనునిత్యమూ ధ్యానపూర్వకముగ పఠింపవలె.
ఓ దేవా! ఇది యొక రెక్కలు విరిగిన విహంగము, ఇతడి యుద్గమన మెం తయో నెమ్మదైనది. సౌభాగ్య, మోక్షశిఖరము దెస కెగయునటుల, అనంత విశ్వాంతరాళమున పరమానందోత్సాహములతో పయనించునటుల, సకలరాజ్యముల యందున నీ సర్వోన్నత నామసంకీర్తనము నుచ్చైస్వనమున గావించునటుల, ఈ పిలుపుతో తన శ్రవస్సులను ఉల్లాసపరచుకొనునటుల, మార్గదర్శక సంకేతములను విలోకించి నేత్రములను తేజోభరిత మొనరించు కొనునటుల ఇతడికి సహాయము చేయుము.
ఓ ప్రభూ! నేను అసహాయుడను, ఏకాంతవర్తనుడను, అధముడను. నాకు నీవు దక్క సహాయకుడు లేడు. నాకు నీవు దక్క వేరొక పరిపాలకుడు లేడు. నీ సేవలో నన్ను దృఢపరచు. నీ దేవదూతాగణములతో నాకు తోడ్పడు. నీ దివ్యప్రవచన విస్తరణలో నాకు విజయము నొనగూర్చు. నీ ధర్మాన్ని నీ ప్రజలతో ప్రసంగించేందుకు నాకు అనుమతిని ప్రసాదించు. నిశ్చయంగా, నీవు అశక్తుల సహాయకుడవు, అల్పుల సంరక్షకుడవు; నిశ్చయముగా, నీవు అధికారపూరితుడవు, శక్తిమంతుడవు, నిర్నిరోధితుడవు.
References:
1 ఖురాన్ 34:15 2 ఖురాన్ 30:9, 40:82, 47:10 3 ఖురాన్ 30:50
- కెనడా, గ్రీన్‌ల్యాండ్ బహాయిలకు వెలువరించిన దివ్యఫలకము
[కెనడా – అంటే న్యూ ఫౌండ్లాండ్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలండ్, నోవా స్కోటియా, న్యూ బ్రన్స్విక్, క్విబెక్, సాస్కట్కెవన్, మనిటోబా, అంటారియో, అల్బర్తా, బ్రిటిష్ కొలంబియా, యుకాన్, మెకంజీ, కీవాటిన్, ఉంగావా, ఫ్రాంక్లిన్ ఐలండ్స్– గ్రీన్‌ల్యాండ్ నివాసులైన బహాయిలకు 1917 సం. ఫిబ్రవరి 21న అక్కాలో అబ్బుద్ గృహంలోని బహాఉల్లా గదిలో దీనిని వెలువరించడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ వదాన్య మిత్రులారా, దయామయుని సేవికలారా,
మహనీయ ఖురాన్‌లో, భగవంతుడు ఇట్లనుచున్నాడు: “భగవంతుని జీవుల యందున నీవెట్టి భేదమునూ చూడవలదు.”1 వేరొక తీరున చెప్పవలెనంటే, సముచిత దృక్కోణమున వీక్షించినచో ఆయన ప్రాణులయందున వ్యత్యాస మేదియూ లేదు, ఏలయనిన - అవి యన్నియూ తాను సృజించినవే నంటున్నా డాయన. పై ప్రాతిపదికన - దేశముల మధ్యన భేదములు లే వను నిర్ణయమునకు రావడమైనది. కాగా, కెనడా రాజ్యభవిత ఎంతయో మహత్తరము; తత్సంబంధిత సంఘటన లత్యంత ప్రసిద్ధములు. భగవత్కటాక్ష వీక్షణమున కిదియే లక్ష్యము కావలె; సమస్త యశస్వి అనుగ్రహముల నభివ్యక్తము సేయవలె.
ఆ రాజ్యపర్యటనమునా, ఆయా మజిలీలయందునా అబ్దుల్-బహా ఎంతయేని ఆనందము ననుభవించినాడు. నేను మాంట్రియల్ కు బయలుదేరడానికి ముందు, అక్కడి నివాసులయం దధిక సంఖ్యాకులు క్యాథలిక్కులనీ, పరమఛాందసులనీ; అనుకరణల సముద్రమున మునిగియున్నారనీ, భగవంతుని దివ్యసామ్రాజ్యాహ్వానము నాలకించు శక్తి వారికి లేదనీ, మహత్తర మార్గదర్శన సంకేతములను వీక్షించలేనంతగా, మతోన్మాదపు తెరలు వారి నేత్రములను కప్పివేసినవనీ, సత్యమున కిసుమంతైనా తా వీయక, పూర్తిగా వితండవాదములు ఆక్రమించుకొని ఉన్నాయనీ చెబుతూ – అక్కడికి వెళ్లవలదని నన్నెందరో హెచ్చరించినారు. సత్యసూర్యుడు ఆ రాజ్యవ్యాప్తముగా సంపూర్ణవైభవముతో భాసిల్లవలెననిన, మూఢవిశ్వాసము లనబడు దుర్భేద్యకాలమేఘము లాసూర్యకిరణముల విలోకన మెవరికైననూ అసాధ్యమే నను నంతగా, దిఙ్మండలము నావరించుకుని యున్నవని వారు నొక్కి చెప్పడం జరిగింది.
అయితే, ఈ కథలు అబ్దుల్-బహా నిర్ణయము నేవిధముగానూ ప్రభావితము గావించలేకపోయినవి. భగవంతునియందున విశ్వాసమునుంచి, మాంట్రియల్ దెసకు తన దృష్టిని సారించినా డాయన. తా నానగరము లోనికి ప్రవేశించినప్పుడు ద్వారములన్నీ తెరుచుకునే ఉన్నాయని ఆయన గమనించినాడు; హృదయము లత్యంత సానుకూలదృక్పథ సమన్వితములై యున్నవనీ, భగవంతుని దివ్యసామ్రాజ్య మహోత్కృష్టశక్తి ప్రతి అవరోధమునూ, ఆటంకమునూ తొలగించి వేస్తున్నదనీ గుర్తించి నాడాయన. ఆ రాజ్యపు చర్చీలలోనూ, సమావేశములలోనూ – అమితానందముతో - ప్రజలను భగవంతుని దివ్యసామ్రాజ్యమున కాహ్వానించి, దైవశక్తిహస్తము నీరుపోసి సాగుచేయు బీజములను చల్లినా డాయన. అవి నిస్సందేహముగా మొలకలై, హరితసమృద్ధములై, పుష్కలమగు పంటదిగుబడు లెన్నియేని లభ్యమగును. దివ్యసూత్రముల ప్రబోధమున - ఏ విరోధియూ, ఏ ప్రత్యర్ధియూ ఆయన కగుపించ లేదు. ఆ నగరమునం దాయన కలుసుకొనిన విశ్వాసు లత్యంత ధార్మికహృదయులై, భగవత్సౌరభములకు సమాకర్షితులై ఉన్నారు. ఈ మహదానందమును దినదిన ప్రవర్ధమానము గావిస్తూ - భగవత్సేవిక శ్రీమతి మ్యాక్స్వెల్ కృషితో - ఆ రాజ్యములోని భగవత్సామ్రాజ్య నందినీనందనులెందరో సమీకృతులై, పరస్పర సాన్నిహిత్యము నొందినారు. అక్కడి మజిలీ కొద్ది దినములకే పరిమితమైనా, భవిష్యత్పర్యవసానము లపరిమితములై ఉన్నాయి. సేద్యము సేయబడని భూమికి తాను స్వామి అయి నప్పుడు, కర్షకుడు - స్వల్పకాలమునకే సువిశాలక్షేత్రమును సాగులోనికి తీసుకు వస్తాడు. కనుక, భవిష్యత్తులో ఈ రాజ్యమునుండి దివ్యసామ్రాజ్యగీతిక ప్రపంచదేశము లన్నింటికీ పరివ్యాప్తమయ్యేలా, పవిత్రాత్మ నిశ్వాసము లాకేంద్రమునుండి ప్రాక్పశ్చిమ అమెరికాలకు విస్తరించేలా - మాంట్రియల్ మరింతగా ఉత్తేజిత మగునని ఆశింతును.
ఓ భగవద్విశ్వాసులారా! మీ సంఖ్యాస్వల్పత కాందోళితులూ కావలదు, అవిశ్వాసప్రపంచ జనబాహుళ్యముతో నిస్పృహ చెందనూ వలదు. అయిదు గింజల గోధుమ ఆశీఃకృతమగును, వేయి టన్నుల నిష్ఫలధాన్య మెట్టి ప్రభావ ఫలితములనూ చూపజాలదు. ఫలవృక్ష మొక్కటైననూ, సమాజజీవనమునకు సముచితమే యగును, కలుపుమొక్కల అడవులు వెయ్యైననూ - ఫలముల నివ్వవు. ఆరుబయ లంతయూ గుండురాళ్లమయమే అయిననూ అమూల్యశిలలు మాత్ర మరుదుగనే యుండును. ఇసుక ఎడారులు వెయ్యింటికన్ననూ ముత్యమొక్కటి - ముఖ్యముగా దైవానుగ్రహీతమూ, అమూల్యతరమూ అయిన ఈ మౌక్తికము - మిన్న. అనతికాలమునకే దీనినుండి సహస్రాధికముగ ముత్యము లావిర్భవిస్తాయి. గుండురాళ్లతో ఆ మౌక్తికము కలగలిసి, సాన్నిహిత్యము నొందినప్పుడు, అవియూ మౌక్తికములుగా పరివర్తితము లౌతాయి.
పునరుద్ఘాటిస్తున్నాను: లౌకికదృక్కోణముననైనా, ఆధ్యాత్మిక అనుశీలనాను సారమైనా కెనడా భవిత మహత్తరమే. నాగరికతయూ, స్వేచ్ఛయూ దినదినప్రవర్ధ మానత నొందుతాయి. అక్కడ వేయబడిన మార్గదర్శన బీజములకు దివ్యసామ్రాజ్య పర్జన్యములు జలప్రాశన గావిస్తాయి. కనుక, మీరు విశ్రమింపవలదు, స్థిమితము నాశింపవలదు, ఈ క్షణభంగుర ప్రాపంచికవిలాసములకు మోహితులు కావలదు, ప్రతి బంధమునుండియూ విముక్తులు కండి, భగవంతుని దివ్యసామ్రాజ్యమున పూర్ణస్థిరత్వ సముపార్జనమునకై మనఃపూర్వకముగా కృషి సల్పండి. స్వర్లోకైశ్వర్యముల నార్జించుకొనండి. దినదినమునకూ మరింత దీప్తిని సంతరించుకొనండి. ఏకత్వ ద్వారము నకు - చేరువ, మరింత చేరువ కండి. ఆధ్యాత్మికానుగ్రహాభివ్యక్తులూ, అనంతకాంతుల ప్రభాతస్థలులూ కండి. వీలైతే, కెనడాలోని ఇతర ప్రాంతములకు బోధకులను పంపగలరు; ఆ తీరుననే - గ్రీన్‌ల్యాండ్ కూ, ఎస్కిమోల స్వస్థలము నకూ బోధకులను పంపగలరు.
బోధకుల విషయమున: వారు పాతపుట్టములను విడచి, నూతనవస్త్రధారులు కావలె. క్రీస్తు వాకృచ్చినట్లు, వారు పునర్జీవితుల స్థాయినొందవలె - అనగా, ఇంతకు మునుపు వారు మాతృగర్భమునుండి జన్మించినారు; ఈ పర్యాయము ప్రాకృతిక ప్రపంచగర్భమునుండి జన్మింపవలె. వారిప్పుడు గర్భస్త ప్రపంచానుభూతులను యే మాత్రమూ ఎలా ఎఱుగరో, ఆ తీరుననే ప్రాకృతికప్రపంచ లోపములను సైతము సంపూర్ణముగ మరచిపోవలె. జీవజలముతో, భగవంతుని ప్రేమానలముతో, పరిశుద్ధాత్మ నిశ్వాసములతో వారు జ్ఞానస్నానము సేయవలె; స్వల్పాహార సంతుష్టులు కావలె, అయినను, అధికాంశమును వారు స్వర్లోకభోజనపీఠి నుండియే పొందవలె. ప్రలోభమునకూ, దురాశకూ వారు దూరులు కావలె, స్ఫూర్తిసమన్వితులు కావలె. తమ పవిత్రనిశ్వాస ప్రభావముతో, వారు - శిలను సముజ్జ్వల పద్మరాగముగ, ముత్తెపు చిప్పను మౌక్తికముగ మార్చివేయవలె. వసంతమేఘపు జల్లువలె, వారు - నల్లని మన్నును గులాబీ వనముగా, ఫలోద్యానముగా పరివర్తిత మొనరింపవలె. అంధులు అవలోకించునటుల, బధిరులు ఆలకించు నటుల, మలిగిన వాడు రగుల్కొని ప్రజ్జ్వలించునటుల, మృతులు పునర్జీవితులగునటుల చేయవలె.
మీకు ప్రశంసాభినందనలు!
ఓ నా దేవా, నీకు ప్రస్తుతి! వీరు నీ కారుణ్యసౌరభములకు సమాకర్షితులూ, నీ ఏకత్వవృక్షమున జ్వలియించు అగ్నిచే ప్రజ్జ్వలితులూ, నీ ఏకత్వ సైనాయిలో భాసిల్లు దీపప్రభల సంవీక్షణతో జ్యోతిర్మయనేత్రులూ అయిన సేవకులు.
ఓ ప్రభూ! నీ ప్రజలయందున నీ ప్రస్తావన మొనరించుటకై వారి జిహ్వలకు స్వేచ్ఛ నిమ్ము, నీ కృపతో, సాదరకారుణ్యముతో నీ సంకీర్తనమును సేయనిమ్ము, నీ దేవదూతలసేనతో వారికి తోడ్పడు, నీ సేవలో వారి కటిసీమలను దృఢీకరించు, వారిని నీ జీవులయందున నీ మార్గదర్శక సంకేతములను కానిమ్ము.
నిక్కముగా, నీవు సర్వశక్తిమంతుడవు, మహోదాత్తుడవు, నిత్యక్షమాశీలివి, సకల దయాన్వితుడవు.
ఈ ప్రార్థనను భగవత్సౌరభ పరివ్యాపకులు ప్రతి ఉదయమునా పఠింపవలె.
ఓ దేవా, నా దేవా! అలౌకిక శక్తికై అర్ధింపుచున్న ఈ శక్తిహీనుని, నీ స్వర్లోక సంపదలకై తపియింపుచున్న ఈ దీనుని, అమరజీవన ప్రస్రవణము నాకాంక్షింపుచున్న ఈ పిపాసువుని, నీ ఊర్ధ్వస్థిత సామ్రాజ్యమున నీ నియుక్త సేవకులకై నీవు లక్షించిన నీ అనంతకారుణ్యముతో నీ వాగ్దత్తచికిత్స నపేక్షింపుచున్న ఈ ఆర్తుని వీక్షింపుచున్నాడవు.
ఓ ప్రభూ! నాకు నీవు దక్క సాహాయ్యుడు లేడు, నీవు గాక వేరొండు ఆశ్రయణము లేదు, నీవు తప్ప వేరొక పరిపోషకుడు లేడు. నీ వెంచుకొనిన నీ జనుల యందున నీ పవిత్రసౌరభములను సువిస్తృతముగ పరివ్యాపన మొనరించుటలో, నీ దేవదూతలతో నాకు సాయపడు.
ఓ నా ప్రభూ! నీనుండి దక్క అన్య మంతటినుండియు నేను విముక్తుడనై, నీ అనుగ్రహ వస్త్రాంచలమును దృఢముగ చేబూని, నీ దివ్యధర్మమునకు సంపూర్ణముగ అంకితుడనై, నీ ప్రేమయందున సుదృఢముగ, సుస్థిరముగ నిలచి, నీవు నీ దివ్య గ్రంథమున విధియించిన దానిని పాలించునటు లొనరింపుము.
నిక్కముగా, నీవు అధికారయుతుడవు, మహాబలుడవు, సర్వశక్తిశాలివి.
References:
1 ఖురాన్ 67:3
- యునైటెడ్ స్టేట్స్, కెనడాల బహాయిలకు వెలువరించిన దివ్యఫలకము
[యునైటెడ్ స్టేట్స్, కెనడాల బహాయిల నుద్దేశించి 1917 సం. మార్చి 8 న హైఫాలో అబ్దుల్-బహా నివాసంలోని వేసవి గది (ఇస్మాయిల్ అఖా గది) లో దీనిని వెలువరించడం జరిగింది.]
ఆయన భగవంతుడు!
ఓ దివ్యాత్మలారా, దివ్యసామ్రాజ్య నందినీ నందనులారా
ఖురాన్‌లో భగవంతు డిట్లనుచున్నాడు: “మీరెల్లరును దైవరజ్జువును బలముగ చేబూనుడు, అనైక్యులు కావలదు.”1
అనిశ్చిత ప్రపంచమున మానవశిశువుల యందున సమైక్యతా సామరస్యముల సాధన కనువైన సమష్టికేంద్రము లెన్నియో కలవు. ఉదాహరణమునకు: దేశభక్తి యొక సమష్టికేంద్రము; జాతీయవాద మొక సమష్టి కేంద్రము; ప్రయోజన సారూప్యత ఒక సమష్టికేంద్రము; రాజకీయకూటమి ఒక సమష్టికేంద్రము; సైద్ధాంతిక ఏకీభావ మొక సమష్టికేంద్రము; సమష్టికేంద్రముల వ్యవస్థీకరణపైనను, అభివృద్ధిపైనను మానవప్రపంచాభ్యుదయ మాధారితము. ఏమైననూ, పై వ్యవస్థలన్నియూ, వాస్తవమునకు - విషయసంబంధితములే తప్ప, అర్థవంతములు కావు, యాదృచ్ఛికములే తప్ప శాశ్వతములు కావు - తాత్కాలికములే తప్ప నిత్యములు కావు. ఈ సమష్టికేంద్రము లన్నియూ మహావిప్లవముల, సంక్షోభముల వెల్లువలో తుడిచిపెట్టుకు పోయినవి. కాని వ్యవస్థల, దైవబోధనల ప్రపూరితమైన దివ్యసామ్రాజ్య సమష్టికేంద్రము - శాశ్వత సమష్టికేంద్రము. అది ప్రాక్పశ్చిమముల మధ్యన అనుబంధము నేర్పరచి, మానవకోటి ఏకత్వస్థాపన మొనరించి, వ్యత్యాసముల పునాదులను ధ్వంసము గావించును. అది తక్కిన సమష్టికేంద్రము లన్నింటినీ జయించి తనలో విలీన మొనరించుకొనును. సమస్తప్రదేశములనూ సమావృత మొనరించుకొనుచున్న అంధకారమును, అది - సూర్యకిరణసమమై, సంపూర్ణముగ పాఱద్రోలి, ఆదర్శ జీవితము నొసగి, దివ్యజ్ఞానదీప్తిని కలిగించును. పవిత్రాత్మనిశ్వాసములతో అది అద్భుతములను ప్రదర్శిస్తుంది; ప్రాచ్య పాశ్చాత్యములు - సహచరములూ, సహవర్తులూ అవుతాయి, విరుద్ధ, విరోధపూరిత భావములు కనుమఱుగౌతాయి. వైరపూరిత లక్ష్యములు త్రోసిపుచ్చబడతాయి, అస్తిత్వ పోరాట సిద్ధాంతము రద్దవుతుంది, మానవజాతుల నన్నింటినీ తన ఛాయతో సమాచ్ఛాదిస్తూ, ప్రపంచశిఖరాగ్రాన ప్రపంచమానవాళి ఏకత్వమండపము నిర్మిత మౌతుంది. కనుక, నిజమైన సమష్టి కేంద్రము - సమస్తస్థాయీ సమన్వితమూ, మానవాళి సార్వత్రిక సంబంధముల, ఆవశ్యక శాసనముల సమావృతమూ అయిన - దివ్యబోధనల వ్యవస్థయే.
పర్యాలోచన సేయుడు! ప్రాక్పశ్చిమవాసు లొకప్పుడు పూర్తిగ అపరిచితులై యుండెడు వారు. వా రిప్పుడెంతటి ఉదాత్తస్థాయిలో పరస్పర సుపరిచితినొంది మమేక మైనారో. అమెరికాలోని మారుమూల గ్రామసీమలకు, పర్షియా వాసులున్న దెంత దూరమున! ఇప్పుడిక, స్వర్గశక్తి ప్రభావ మెంతటి మహత్తరమో పరికింపుడు, వేలకొలది మైళ్ల దూర మొక్క అడుగు వంటిదైనది. ఈ శక్తితో - సంబంధములైనను, సారూప్యతలైనను లేని వివిధదేశము లేతీరున ఇప్పు డేకమైనవో, ఏకీభవించినవో! గతమున నైనను, భవితయందైనను శక్తి మాత్రము భగవంతునిదే. నిక్కముగా, సమస్తాంశముల పైననూ అధికారపరిపూర్ణుడు భగవంతుడే.
వనపుష్పములను పరికింపుడు: రీతిలో, రంగులో, రూపులో, ఆకృతిలో విభిన్నములైననూ, అవి ఒకే స్రవంతీ జలములతో సేదదేఱి, ఒకే వాయునిశ్వాసముతో పునరుజ్జీవనము నొంది, ఒకే సూర్యుని కిరణములతో సశక్తీకృతము లైన హేతువున, ఈ వైవిధ్యము వాటి ఆకర్షణము నతిశయింప చేస్తున్నది, వాటి సౌందర్యమును ఇనుమడింప చేస్తున్నది. ఆ వనములలోని పువ్వులు, మొక్కలు, ఆకులు, మొగ్గలు, పండ్లు, కొమ్మలు, చెట్లు - సమస్తమూ ఒకే రంగునూ, రూపునూ కలిగి ఉన్నచో, కంటి కెంత అప్రియమగును! రంగు, రూపు, ఆకృతులలోని వైవిధ్యము – వనమునకు శోభ నిచ్చి, సముద్భూషించి, తత్ప్రభావమును ప్రవృద్ధము గావిస్తుంది. అదే విధముగా భావనకూ, ప్రవృత్తికీ, ప్రవర్తనకూ సంబంధించిన విభిన్నఛాయలూ ఒకే కేంద్రీయ వ్యవస్థ అధికార, ప్రాబల్యముల క్రిందికి తీసుకురాబడతాయి. మానవపరిపూర్ణతా సౌందర్య వైభవములు సుప్రదర్శితములూ, సువ్యక్తములూ అవుతాయి. సమస్తాంశముల అధివాస్తవికతలను పరిపాలించునదీ, అధిగమించునదీ అయిన భగవద్వచనపు టలౌకికశక్తి దక్క, మరేదీ - మానవబాలల పరస్పర విరుద్ధభావములనూ, మనోగతములనూ, ఊహలనూ, నమ్మికలనూ సమన్వయము గావింపజాలదు.
కనుక, అన్ని అమెరికన్ రిపబ్లిక్కులకు చెందిన విశ్వాసులూ: దైవశక్తితో, దివ్యబోధనల పరివ్యాపనకూ మానవకోటి ఏకత్వసంస్థాపనకూ కారకులు కావలె. మరుజన్మ సాకారమయ్యేందుకై, అమెరికన్ ప్రాంతములన్నింటి మీదికీ జీవననిశ్వాస ప్రసరణను గావిస్తూ, ప్రజలకు నవ్యస్ఫూర్తిని అందిస్తూ, భగవంతుని ప్రేమాగ్నితోనూ, జీవజలము తోనూ, పవిత్రాత్మ నిశ్వాసములతోనూ వారిని జ్ఞానస్నాతులను గావిస్తూ ముఖ్యుల యందలి ప్రతి ఒక్కరూ ఉద్యమింప వలె. ఎందులకనగా, “శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్న,”2 దని సువార్త యందున లిఖియింపనైనది.
కనుక, యునైటెడ్ స్టేట్స్, కెనడాలకు చెందిన భగవద్విశ్వాసులారా! అలాస్కా అంతటా, మెక్సికో రిపబ్లిక్కులోనూ, గ్వాటెమాలా, హాండూరస్, సాల్వడార్, నికారాగ్వా, కోస్ట రీకా, పనామా, బెలిజా వంటి మధ్య అమెరికన్ రిపబ్లిక్కులలోని దక్షిణ మెక్సికోకూ; అర్జెంటీనా, ఉరుగ్వయ్, పరగ్వయ్, బ్రెజిల్, ఫ్రెంచ్ గియానా, డచ్ గియానా, బ్రిటిష్ గియానా, వెనిజులా, ఈక్వడోర్, పెరూ, బోలీవియా, చిలీ వంటి దక్షిణ అమెరికన్ రిపబ్లిక్కుల వ్యాప్తంగానూ; క్యూబా, హెయ్తీ, పోర్టో రికో, జమైకా, సాంటో డొమింగో వంటి వెస్ట్ ఇండీస్ ద్వీప సముదాయంలోనూ, లెస్సర్ అంటిలీస్, బహామా, బెర్మూడా ద్వీపాల సముదాయాలలోనూ; అలాగే, దక్షిణ అమెరికాకు ఉత్తర, పశ్చిమ ద్వీపాలైన ట్రినిడాడ్, ఫౌక్లాండ్ ద్వీపాలకూ, గలాపగోస్ ద్వీపాలకూ, హ్వన్ ఫెర్నాండెజ్, టొబాగోలకూ పర్యటించేందుకై ముఖ్యులను ఎంపికైనా చేయండి, లేని పక్షంలో - వారు ఇతరులనుండీ, ప్రపంచ నిర్లిప్తతనుండి తెగతెంపులు చేసుకుని తమంతతాముగా ఉద్యమించినా సరే. ప్రత్యేకించి, బ్రెజిల్ తూర్పుతీరాన వున్న బహియా నగరాన్ని సందర్శించండి. ఎందులకనగా, గతంలో ఈ నగరానికి బహియా పేరిట నామకరణము చేయనైనది; ఇది నిస్సంశయముగా పవిత్రాత్మస్ఫూర్తితోనే జరిగినది.
ఆ కారణముగా, భగవద్విశ్వాసులు గరిష్ఠముగా కృషిని సలువపలె, ఆ ప్రాంతములయం దెల్లెడలా దివ్యగీతిక నాలపింపవలె, దివ్యబోధనల నుద్ఘోషించి, సర్వజనులపైననూ అమరజీవనస్ఫూర్తిని ప్రసరింపచేయవలె; తద్వారా ఆ రిపబ్లిక్కులు అన్యదేశముల ప్రశంసకూ, మెప్పునకూ లక్ష్యము లగునంతగా, సత్యసూర్యుని తేజోప్రభలతో దీప్తి మంతములు కావచ్చును. ఆ విధముగనే, పనామా రిపబ్లిక్కు పట్లనూ మీరు విశేషశ్రద్ధను వహింపవలె. ఎందులకనిన, ప్రాక్పశ్చిమములు అక్కడ- పనామా కాలువ ద్వారా - పరస్పరం ఒక్కటౌతున్నాయి. అంతియగాక, అది రెండు మహా సముద్రములకు మధ్యన ఉన్నది. భవిష్యత్తులో ఆ ప్రాంతమెంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. బోధనలు కనుక, అక్కడ ఒకసారి నెలకొనడమంటూ జరిగిన పక్షంలో అవి - తూర్పు పడమరలనూ ఉత్తర దక్షిణములనూ మమేకం గావిస్తాయి.
కనుక, ఉద్దేశ్యము పవిత్రత నొందవలె, ప్రయత్నము మహోదాత్తమూ, మహోన్నతమూ కావలె, తద్వారా, మీరు మనుష్యప్రపంచ హృదయములలో భావసారూప్యత నేర్పరుపవచ్చును. పవిత్రమతములకు ప్రాతిపదికలైన దివ్యబోధనల పరివ్యాపనముతో దక్క, ఈ మహత్తరలక్ష్య మింకొక విధముగా నెరవేరదు.
యోచన సేయుడు, భగవన్మతములు మనుష్యప్రపంచము నెట్లు సేవించినవో! తోరా మతము ఇజ్రాయేలీయ జాతి వైభవ, గౌరవ, ప్రగతుల కెట్లు హితకరమైనదో! పరమపూజ్యుడైన క్రీస్తు పవిత్రాత్మ నిశ్వాసలు భిన్నవర్గములకూ, పోరుతెగలకూ మధ్యన ఆత్మీయతాసమైక్యతల నెట్లు సృష్టించినవో! పరమపూజ్యుడైన మహమ్మదు దివ్యశక్తి ఏ విధముగా అరేబియా ద్వీపకల్పమునందలి పోరుతెగలనూ, భిన్నవర్గములనూ - వేయితెగ లొకే తెగగా అనుసంధానితములై; కలహవైషమ్యములు పరిత్యజితములై; సాంస్కృతిక, నాగరికతా లక్ష్యమును ప్రవర్ధిల్లజేయుటకై సమైక్యముగా, ఏకైకావగాహనతో వారెల్లరును శ్రమించి, శాశ్వతవైభవ శిఖరమునకు ఆ విధముగా కెగయుచూ, అవమానపు టధమస్థితినుండి స్వేచ్ఛనొందు నటుల - సమైక్యపరచి, సమన్వయీకరించుటకు సాధనమైనదో! మహాద్భుత ప్రపంచమున ఇంతకుమించిన మహత్తర సమష్టి కేంద్రమును కనుగొనుట సాధ్యమేనా? దివ్యత నొందిన ఈ సమష్టి కేంద్రముతో సరిపోల్చినప్పుడు జాతీయవాద సమష్టి కేంద్రము, దేశభక్తి సమష్టికేంద్రము, రాజకీయ సమష్టికేంద్రము, సాంస్కృతిక-మేధో సంబంధిత సమష్టికేంద్రము - ఇవన్నియూ బాల్యక్రీడల వంటివే!
సమస్తప్రవక్తలూ దేనిని ప్రబోధింప నవతరించిరో, దైవబోధనలకు స్ఫూర్తి ఏదో - ఆ పవిత్రమతముల సమష్టి కేంద్రము - అమెరికాలోని అన్ని ప్రాంతములకూ విస్తరించునటుల మీరిప్పుడు కృషి సల్పుడు, తద్వారా మీయందలి ప్రతి ఒక్కరూ వాస్తవికతా దిఙ్మండలమునుండి ప్రభాతనక్షత్రములవలె ప్రకాశింపవచ్చును, దైవశోభ ప్రాకృతి కాంధకారమును జయింపవచ్చును, మనుష్యప్రపంచము జ్ఞానము నొంద వచ్చును. మహత్కార్యమిది! అందున మీ రనుగ్రహీతులైనచో, ఈ ప్రపంచ మింకొక ప్రపంచమై, అవనీతలము రమ్యతరస్వర్గమై, శాశ్వతవ్యవస్థలు సంస్థాపితములు కావచ్చును.
బోధనార్థమై వివిధ ప్రదేశములకు పయనించునాతడిని - గిరిపై, ఎడారిలో, అవనిపై, అంబుధిపై – ఈ ప్రార్థనను పఠియింపనిండు:
ఓ దేవా! ఓ దేవా! నీ ప్రాణుల యెదుట నా ఆశక్తతను, హైన్యతను, విధేయతను విలోకింపుచున్నాడవు; అయినను, నీయందున విశ్వాసమునుంచి, నీ యధికార, బలములపై ఆధారితుడనగుచూ నీ సుదృఢసేవకుల యందున నీ బోధనల పరివ్యాపనముకై ఉద్యమించినాను.
ఓ ప్రభూ! నేనొక రెక్కలు విరిగిన పక్షిని, అయినను నీ అనంతాంతరిక్షమున విహరింప నెంచితిని. నీ దివ్యేచ్ఛాకారుణ్యములు, నీ అనుగ్రహసాహాయ్యముల మూలమున దక్క, నా కెటుల సాధ్యమిది.
ఓ ప్రభూ! నా బలహీనతను మన్నించు, నీ శక్తితో నన్ను దృఢీకరించు. ఓ ప్రభూ! నా అశక్తతను కనికరించు, నీ శక్త్యౌన్నత్యములతో నాకు తోడ్పడు.
ఓ ప్రభూ! బలహీనతమ జీవిని పవిత్రాత్మనిశ్వాస మనుగ్రహించినచో, ఆతడు తన అపేక్షితముల నన్నింటినీ అందుకొనును, తా నాశించు దేనినైనను పొందును. నిక్కముగ, నీవు గతమున నీ సేవకులకు సహకరించినావు; వారు నీ ప్రాణులలో దుర్బలతములూ, నీ సేవకులయందున హీనతములూ, భువిపై వసియించినవా రందరికన్ననూ సామాన్యతములూ అయిననూ, నీ అనుమతముతో, అధికారముతో, నీ ప్రజలలోని పరమ యశస్వులకన్ననూ, మానవాళియందలి మహోదాత్తులకన్ననూ ఆగ్రస్థానము నొందినారు. నీ అనుగ్రహ, కారుణ్యముల వలన - గతమున వారు శలభములై యుండినను, రాచడేగలైనారు, పూర్వము వారు సెలయేళ్లై యుండినను, సాగరములైనారు. వారు నీ మహోత్కృష్ట కృపతో, మార్గదర్శన దిఙ్మండల ప్రకాశిత నక్షత్రములు, అమరత్వపు గులాబీ ఉపవన గాయక విహంగములు, విజ్ఞాన, విజ్ఞతారణ్యములయందున గర్జించు సింగములు, జీవసాగరతరణము గావించు తిమింగిలములు అయినారు.
నిక్కముగా, నీవు కృపామయుడవు, అధికారయుతుడవు, మహాశక్తిశాలివి, దయామయుల కత్యంత దయామయుడవు.
References:
1 ఖురాన్ 3:103 2 బైబిల్ - యోహాను 3:6