Prayers & Meditations
Telugu ·
ఓ ప్రభూ, నా దేవా, నీకు ప్రశస్తి! నీ సర్వాతిరిక్త వైభవస్వర్గములలోనికి మమ్ముల నుద్గమింపజేసి, నీ దివ్యైక్యతా పటవేశ్మములోనికి ప్రవేశించుటకు సంశయగ్రస్తులను నిరోధించు సందిగ్ధమాలిన్యము నుండి మమ్ము ప్రక్షాళన గావించు దానిని నాకును, నా సాహచర్యము నందున్న వారికిని అనుగ్రహింపుమని - అంధకారము జ్యోతిస్సుగా పరివర్తితము, పునస్సందర్శిత దేవాలయము నిర్మితము, లిఖిత దివ్యఫలకమావిష్కృతము, బాహ్యప్రసారిత వ్యావర్తిని వివృతము కాబడిన ఈ దివ్యావిష్కరణ నామమున ప్రార్థిస్తున్నాను.
ఓ నా ప్రభూ, నేను నీ ప్రేమాన్విత రజ్జుబంధాన్ని దృఢముగా చేపట్టి, నీ దయానుగ్రహ వస్త్రాంచలాన్ని పరిగ్రహించినవాడిని. నా కోసం, నా ప్రియజనులకోసం ఇహపర శుభము ననుగ్రహించు. నీవు సృజియించినవారియం దొకరిగా యెన్నుకోబడిన వారికి ప్రదానం చేయడానికి నీవు నిర్ణయించిన గుప్త బహుమానాన్ని ప్రసాదించు.
ఓ నా ప్రభూ! నీ సేవకులను ఉపవసింపుమని నీవు ఆజ్ఞాపించిన సుదినములివి. సంపూర్ణంగా, కేవలము నీ కొరకై నినువినా సమస్త వస్తువులయెడ పరిపూర్ణ విరాగముతో ఉపవసించువాడు ధన్యుడు. ఓ నా ప్రభూ, నీయెడ విధేయతను వహించి, నీ అనుశాసనముల ననుసరించుటకు నాకునూ, వారికినీ సహాయమొనరింపుము. నిక్కముగా నీవు ఆకాంక్షించు దాని నొనర్ప శక్తియుతుడవు.
సర్వవిజ్ఞానివీ, సర్వవివేవికీ అయిన నీవు తప్ప, అన్యదైవము లేడు. సమస్త ప్రపంచాధినాథుడగు దేవునికి సకలప్రశస్తి.
ఓ ప్రదాతా, ఓ క్షమాదాతా! ధన్యజీవి యొక్కడు దివ్యసత్య సామ్రాజ్యమున కధిరోహించి, ఐహిక ధూళీప్రపంచమునుండి నిత్యవైభవ లోకమునకు వేగిరపడనైనది. ఇప్పు డరుదెంచిన యతిధి స్థానమును సముద్ధరింపుము; నవీనాద్భుత చేలముతో యీచిరకాల సేవకు నలంకరింపుము.
ఓ అప్రమేయ ప్రభూ! ఈ యాత్మ నీ మార్మికాశ్రయములోనికి ప్రవేశించి, తేజోమయుల సందోహమునం దాత్మీయ సాహచర్యము నొందునటుల నీ క్షమాదరణములను ప్రసాదింపుము. నీవు దాతవు, ప్రదాతవు, నిత్యప్రేమికుడవు. నీవు క్షమాశీలివి, ఆర్ద్రహృదయుడవు, మహాశక్తిశాలివి.
ఓ దయాన్విత వల్లభా! సమావిష్టులైన వీరు, నీ ప్రేమతో పారవశ్యము నొందిన భవదీయ మిత్రులు. వారు నీ సౌందర్యమయూఖ ముగ్ధులు, నీ కస్తూరీవిలేపిత కేశపాశసమాకర్షితులు. వారు తమ హృదయములను నీ కర్పించి, నిమ్నులై, నిస్సహాయులై, నీ పథమున చరియింపుచున్నారు. శత్రుమిత్రుల నొక్కతీరుననే విడనాడి, వా రారాధనాపూర్వకముగ నీ మ్రోలన వినమ్రులగుచు, నీ యేకత్వమును విశ్వసించినారు
వా రీయధోలోకవాసులు; నీ దివ్యసామ్రాజ్యములోనికి వారల నాహ్వానించినావు. వారు అభాగ్యతావిహీనతల కాననమున వడలిన మొక్కలవంటి వారు; వారిని నీ జ్ఞానావగాహనోద్యానపు టంకురములను గావించినావు. వారి స్వరములు మూగవోయినవి; వారిని భాషింప జేసినావు. వారు నిస్తేజులు; తేజమును వారిపై ప్రసరించినావు. బీటలు వారిన బీడుభూమి వలె వా రుండినారు; అంతర్భావయుత గులాబీవనముగ వారిని మార్చినావు. వారు మానవప్రపంచమున పసివారలై యుండినారు; వారిని దివ్యపరిపక్వతా సమన్వితులను గావించినావు.
ఓ దయామయా! నీ రక్షణాశ్రయమున వారల కావాసమును, శరణమును ప్రసాదించి, విచారణ నుండియు, విపత్తు నుండియు వారిని రక్షింపుము. నీ యగోచరోపకారమును వారల కొనరించి, నీ యమోఘకృప ననుగ్రహింపుము.
ఓ దయాన్విత, ప్రియతమ విభుడా! దేహసదృశులు వారు, జీవాత్మవు నీవు. దేహము తన నవ్యతాసౌందర్యములకై యాత్మ కటాక్షముపై యాధారపడును. కావుననే, ఈ నవ్యదివ్యావిష్కరణమున వారు నీ యాశీస్సుల యావశ్యకత నొందియుండి, పవిత్రాత్మ యఖండ శక్తి నాకాంక్షింపుచున్నారు. మహనీయుడ వీవు. నీవు దాతవు, ప్రదాయకుడవు, అనుగ్రహశాలివి, క్షమాశీలివి. అగోచర దివ్యలోకము నుండి సముజ్జ్వలముగ తేజరిల్లు దివ్యుడవు.
(బహాఉల్లా మూడు అనివార్య ప్రార్థనలను వెలువరించాడు. ప్రతి విశ్వాసి వాటిలో ఒక దానిని ఎంచుకొని, దానికి గల ప్రత్యేక నిర్దేశాలకు అనుగుణంగా 24 గంటల కొక్కసారి పఠించాలి. పైన ఇవ్వబడినది - ఈ మూడింటిలోనూ బాగా చిన్నది. ఈ ప్రార్థనకు సంబంధించిన నిర్దేశం: దీనిని రోజుకొకసారి - మధ్యాహ్నానికీ, సూర్యాస్తమయానికీ మధ్యకాలంలో పఠించాలని.)
ఓ దేవా ! నిన్నరయుటకు, నిన్నారాధించుటకు నన్ను సృజియించితివందుకు నేనే సాక్షి. నీ శక్తికిని, నా యశక్తతకును, నీ కలిమికిని, నా లేమికిని సాక్ష్యము నిత్తు నీక్షణాన.
ఆపత్సహాయకుడవు, స్వయమాధారుడవు అయిన నీవు తప్ప అన్యదైవము లేడు.