The Promulgation of Universal Peace

Telugu · 'Abdu'l-Bahá

దివ్యప్రణాళికా ఫలకములు ABU0043

Add range:
  1. కెనడా, గ్రీన్‌ల్యాండ్ బహాయిలకు వెలువరించిన దివ్యఫలకము

[కెనడా – అంటే న్యూ ఫౌండ్లాండ్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలండ్, నోవా స్కోటియా, న్యూ బ్రన్స్విక్, క్విబెక్, సాస్కట్కెవన్, మనిటోబా, అంటారియో, అల్బర్తా, బ్రిటిష్ కొలంబియా, యుకాన్, మెకంజీ, కీవాటిన్, ఉంగావా, ఫ్రాంక్లిన్ ఐలండ్స్– ఇంకా గ్రీన్‌ల్యాండ్ నివాసులైన బహాయిలకు 1916 సం. ఏప్రిల్ 5న బహాఉల్లా దివ్యసమాధికి చేరువగా ఉన్న ఉద్యాన వనంలో దీనిని వెలువరించడం జరిగింది.]

ఆయన భగవంతుడు!

ఓ దివ్యసామ్రాజ్య నందినీ నందనులారా:

భగవంతునకు ప్రస్తుతి, ఆయన సౌరభములు యునైటెడ్ స్టేట్స్ కు చెందిన పలునగరములలో పరివ్యాప్తములై, అనేకులు దివ్యసామ్రాజ్యము దెస కభిముఖులై, అటుగా పురోగమిస్తున్నప్పటికీ, కొన్ని నగరములలో సమైక్యతా పతాక మింకనూ ఆశించినంత ఎగువకు ఎగురవేయబడుటయేని, బైబిల్, సువార్త, ఖురాన్ వంటి పవిత్రగ్రంథముల మర్మములు వెల్లడింపబడుటయేని జరుగనే లేదు. యావన్మిత్రుల అవిరళ కృషితో సమైక్యతాపతాక మారాష్ట్రములయం దావిష్కృతమై, దివ్యబోధనల ప్రచారము జరుగవలసిన అవసరమున్నది, తద్వారా, ఆ రాష్ట్రములు సైతము, దివ్యాశీస్సులలో తమ పాలునూ, మహోదాత్త మార్గదర్శన భాగమునూ స్వీకరింపవచ్చును. అదే విధముగా - న్యూ ఫౌండ్లాండ్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలండ్, నోవా స్కోటియా, న్యూ బ్రన్స్విక్, క్విబెక్, అంటారియో, మనిటోబా, సాస్కట్కెవన్, అల్బర్తా, బ్రిటిష్ కొలంబియా, ఉంగావా, కీవాటిన్, మెకంజీ, యుకాన్, ఇంకా ఆర్కిటిక్ సర్కిల్ లోని ఫ్రాంక్లిన్ ఐలండ్స్ వంటి కెనడా పాలిత ప్రాంతములకు చెందిన భగవద్విశ్వాసులు - ఆత్మత్యాగనిరతులై మార్గదర్శకత్వ మనబడు మైనపు వత్తులవలె కెనడా పాలిత ప్రాంతముల యందున ప్రజ్జ్వలింపవలె. వా రటువంటి ఔదార్యమును ప్రదర్శించిన పక్షంలో, నిస్సంశయముగా - సార్వత్రిక దైవానుగ్రహములకు పాత్రులౌతారు, అమరలోక సహచరు లవిచ్ఛిన్నముగా వారిని బలోపేతుల నొనరింపగలరు, మహత్తర విజయసాధన జరుగుతుంది. దైవేచ్ఛ అయితే, దివ్యసామ్రాజ్యాహ్వానము కెనడా ఉత్తర భాగంలోని ఫ్రాంక్లిన్ ద్వీపనివాసులూ, గ్రీన్‌ల్యాండ్ వాసులూ అయిన ఎస్కిమోల వీనులను సైతము చేర వచ్చును. గ్రీన్‌ల్యాండ్‌లో కనుక భగవంతుని ప్రేమాగ్ని ప్రజ్జ్వలితమైతే, ఆ దేశపు మంచు యావత్తూ కరిగిపోయి, దాని శీతల వాతావరణం ఉష్ణిమను సంతరించుకుంటుంది– అంటే, భగవత్ప్రేమ అనబడే వెచ్చదనంతో హృదయములను స్పర్శించిన పక్షంలో ఆ భూభాగము పవిత్రగులాబీవనముగా, దివ్యస్వర్గముగా రూపొందుతుంది; ఆత్మలు ఫలభరితవృక్షములై, అత్యంతాహ్లాదసౌందర్యములను సంతరించుకుంటాయి. అయితే – కృషి, అపార కృషి – అవసరం. మీరు కనుక కృషి సల్పినట్లైతే, తద్వారా ఎస్కిమోలకు భగవత్పరిమళముల పరివ్యాపనము జరుగవచ్చును. తత్ప్రభావము మహత్తరమూ, సువిస్తృతమూ అవుతుంది. మహనీయ ఖురాన్‌లో భగవంతుడు ఇలా వచిస్తున్నాడు: సమైక్యతాజ్యోతులు సమస్తప్రపంచాన్నీ శోభిల్లజేసే రోజు వస్తుంది. “పృథివి తన ప్రభుని జ్యోతితో భాసిల్లును”1 మరోలా చెప్పవలెనంటే, దైవజ్యోతితో భూమి ప్రకాశితమౌతుంది. ఆ జ్యోతి సమైక్యతాజ్యోతి. “భగవంతుడు దక్క వేరొక దేవుడు లేడు.” ఆ ఖండమూ, ఎస్కిమోల దీవులూ ఈ ప్రపంచములోని భాగములే. అవి సైతము, ఆ తీరుననే - మహత్తర మార్గదర్శకత్వ మున భాగము నొందవలె.

మీకు ప్రశంసాభినందనలు!


References:

. 1 ఖురాన్ 39:69