Ridván Messages

Telugu · Universal House of Justice

వెలికివస్తున్న రెండు వాస్తవాలు, మిమ్మల్ని ఉద్దేశించి ఈ మాటలను పలికేలా మమ్మల్ని ప్రేరేపించాయి. మొదటి వాస్తవం, కొరోనా వైరస్ మహమ్మారి తెచ్చిపెట్టిన ప్రత్యక్ష భయానక విపత్తుల గురించి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అవగాహన. విపన్నివారణకు సమిష్టిగా సాహసోపేత, దృఢసంకల్పయుత యత్నాలు జరిగినప్పటికీ కుటుంబాలకూ, వ్యక్తులకూ విషాదాలను సృష్టిస్తూ, మొత్తంగా సమాజాలనే సంక్షోభంలోకి అణగద్రొక్కివేస్తూ, పరిస్థితి ఇప్పటికే దయనీయమై పోయింది. వేదన, విషాదాల అలలు ఒకదానివెంట ఒకటిగా పలుచోట్ల కల్లోలాన్ని రేపుతున్నాయి; వివిధ దేశాలనూ వివిధదశలలో, వివిధరీతులలో నిర్వీర్యం గావిస్తాయి.

అనునిత్యమూ మరింతగా ప్రస్ఫుటమౌతున్న రెండవవాస్తవం, సజీవస్మృతిలో యింతవరకూ అసదృశమైన సమస్యానేపధ్యంలో బహాయి ప్రపంచ సంయమనమూ,మొక్కవోని చైతన్యమూ. అపూర్వం మీ ప్రతిస్పందన. ఒక నెలక్రితం, నౌరూజ్‌కు మేము మీకు వ్రాసినప్పుడు, సాధారణ కార్యసరళి భంగమైపోయిన సమాజాలు ప్రదర్శిస్తున్న మనోజ్ఞలక్షణాలకు ప్రాధాన్యత నివ్వడంపట్ల మేము ఉత్సుకతను వహించడం జరిగింది. ఎంతోమంది మిత్రులు తీవ్రమైన కఠోర నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించవలసి వచ్చిన ఈ మధ్య వారాలలో జరిగిందంతా, మా అభిమానపూర్వక భావనలను ప్రవృద్ధం గావించింది. కొన్ని సమాజాలు ఇతరదేశాలలో సంతరించుకోబడిన అనుభవాన్నుంచి నేర్చుకుంటూ, జనబాహుళ్యంలో ప్రజారోగ్యావసరాలపై అవగాహనను కలిగించడానికి సురక్షిత, సృజనాత్మక విధానాలను కనుగొన్నాయి. వైరస్ కారణంగా మరీ ప్రమాదంలో ఉన్నవారి పట్లనూ, దాని వ్యాప్తివల్ల తలయెత్తుతున్న ఆర్ధికఇబ్బంది పట్లనూ ప్రత్యేకశ్రద్ధను వహించడం జరుగుతున్నది; ఇందుకు సంబంధించి బహాయివరల్డ్ న్యూస్ సర్వీసులో ప్రచురితమైన తొలి యత్నాలు జరుగుతున్న పలుకార్యక్రమాల్లో కేవలం కొన్నిమాత్రమే. ఈ సమయంలో ఎంతగానో అవసరమైన ఆధ్యాత్మిక లక్షణాలను సమీక్షించి, ప్రోత్సహించి, పెంపొందించడానికి జరుగుతున్న యత్నాలు వీటికి అదనంగా తోడౌతున్నాయి. నిస్సంశయంగా, ఈ యత్నాలలో చాలావరకూ, కుటుంబాలలోనో, వ్యక్తిగతంగానో చోటుచేసుకుంటున్నాయి, అయితే, పరిస్థితులు అనుకూలించే చోట్ల, లేదా సమాచారసాధనాలు సుసాధ్యం గావించే చోట్ల, అదేలాంటి పరిస్థితులలో ఉన్నవారిలో అసాధారణ సంఘీభావస్ఫూర్తి చురుకుగా పెంపొందించ బడుతున్నది. సమిష్టిప్రగతికి అత్యవసరమైన సామాజిక జీవనవిశిష్టతలు - ఓటమిచెందవు.

జ్యోతిఃసేనలోని అవిశ్రాంత సేనానులైన జాతీయ ఆధ్యాత్మికసభలు తమ సమాజాలకు ఎలా మార్గదర్శకత్వాన్ని వహించాయో, సంక్షోభానికి వాటి స్పందనను ఎలా మలిచాయో చూసి మామనస్సులు ఉత్తేజితాలైనాయి. వాటిని, ఎప్పటిలానే, వీరోచితంగా ప్రేమాన్విత సేవాప్రమాణానికి సముద్ధరించిన సలహాదారులూ, వారి సహాయకులూ – వాటికి దృఢంగా తోడ్పాటు నందించడం జరిగింది. తమదేశాలలో త్వరితగతిన ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల గురించి చక్కగా తెలుసుకుంటూనే, సభలు – దివ్యధర్మ వ్యవహారాల పాలనకు అవసరమైన ఏర్పాట్లను -ప్రత్యేకించి, వీలున్న చోట్ల, ఎన్నికలను నిర్వహించడానికి - చేశాయి. సక్రమ సమాచారవితరణ ద్వారా, వ్యవస్థలూ, ప్రాతినిధ్య సంస్థలూ విజ్ఞతాయుత హితవునూ, సాంత్వనాపూర్వక సమాశ్వాసననూ, నిరంతర ప్రోత్సాహాన్నీ అందించాయి. పలు సందర్భాలలో, అవి తమ సంఘాలలో ఆరంభమౌతున్న చర్చల నుండి ఉత్పన్నమయ్యే నిర్మాణాత్మక మౌలికాంశాలను గుర్తించ నారంభించాయి. మానవాళి సహనానికి వచ్చిపడిన ఈ పరీక్ష దానికి మరింత ప్రగాఢ అవగాహనను చేకూరుస్తుందని మేము మా నౌరూజ్ సందేశంలో వ్యక్తం చేసిన ఆశయం ఇప్పటికే సాకారం గావించబడుతున్నది. నాయకులూ, ప్రముఖ మేధావులూ,వ్యాఖ్యాతలూ – ఈ మధ్యకాలంలో ప్రజాచర్చలలో చాలావరకూ చోటుచేసుకొని ఉండని మౌలికాంశాలనూ, విశిష్టాశయాలనూ సంశోధించ నారంభించారు. ఇప్పటికిఇవి, కేవలం తొలికిరణాలు మాత్రమే, అయినా – సమిష్టి అవగాహనా తరుణం సాక్షాత్కారమయ్యే అవకాశం వాటికి ఉన్నది.

బహాయి ప్రపంచ సంయమనం కార్యరూపంలో అభివ్యక్తం కావడాన్ని గమనించడంలో మేము తీసుకున్న వెసులుబాటును, మానవాళిపట్ల మహమ్మారి పర్యవసానాల గురించిన మా విచారం కుదించివేసింది. అయ్యో, ఈ ఆవేదనలో మిత్రులూ, వారి సహచరులూ పాలుపంచుకుంటున్నారని మాకు తెలుసు.మిత్రులనుండీ,బంధువులనుండీ, ప్రజాభద్రతావసరాల దృష్ట్యా, ప్రపంచంలో అనేకమంది ఇప్పుడు పాటిస్తున్న దూరం, కొందరి విషయంలో, శాశ్వత వియోగానికి దారితీస్తుంది. సూర్యాస్తమయానికి ముందు మరిన్ని వ్యథలను అనుభవించడం తధ్యమని, ప్రతి ఉదయానా అనిపిస్తున్నది. ఆత్మీయులను కోల్పోయేవారికి, దివ్యలోకాలలో పునస్సమాగమమన్న వాగ్దానం ఊరటను కలిగించు గాక. వారి మనస్సుల సాంత్వనకూ, విద్య, ఉపాధులు, ఇళ్లు, చివరికి జీవనాధారాలే ప్రమాదంలో పడిపోతున్నవారికి భగవంతుని అనుగ్రహం నిమిత్తమూ ప్రార్ధిస్తున్నాము. మీగురించీ, మీరు అభిమానించేవారి కోసమూ, మీ సాటిపౌరుల నిమిత్తమూ బహాఉల్లాను వేడుకుంటున్నాము, ఆయనఆశీస్సులనూ, కటాక్షాన్నీ అర్ధిస్తున్నాము.

పయనించి తీరవలసిన మార్గం ఎంతటి దీర్ఘమూ,దుష్కరమూ అయినా, మీ మనోస్థైర్యం పట్లనూ, పయనాన్ని కొనసాగించ వలసిందేనన్న మీ దృఢసంకల్పంలోనూ మాకు అఖండమైన విశ్వాసం ఉంది. మీరు మీ అవసరాలకన్నా యితరుల అవసరాలకే ప్రాధాన్యతనిస్తూ, దీనజనులను ఆధ్యాత్మికంగా పరిపోషిస్తూ, ప్రత్యుత్తరాలకై యెంతో దాహార్తులైనవారికి సేదతీరుస్తూ ప్రపంచశ్రేయస్సుకై కృషిచేయాలని ఆకాంక్షించేవారికి సాధనాన్ని సమకూరుస్తూ, ఆశ, విశ్వాసం, ఔదార్యాల భాండారాలను వినియోగించుకోండి.శుభసంపూర్ణుని ధార్మికానుయాయులనుండి, ఇంతకన్నా తక్కువగా మేమేం ఆశించగలం?

దివ్యధర్మచరిత్రలోని ఒక అత్యంత చిరస్మరణీయాధ్యాయంలోని తుది పలుకులను ఇప్పటికి వ్రాయడమై, పుట తిరుగుతున్నది. ఈ రిద్వాన్ - ఒక పంచవర్ష ప్రణాళికకూ, అలాగే 1996లో ఆరంభమైన ప్రణాళికల పరంపర మొత్తానికీ చెందిన - ఒక అసాధారణ సంవత్సరం పరిపూర్తిని సూచిస్తున్నది. నూతన ప్రణాళికల పరంపర ఒకటి - తదుపరి రిద్వాన్‌కు ఆరంభం కావలసిన నవవర్ష ప్రయత్నానికి పూర్వరంగంగా ఉపకరిస్తాయన్న వాగ్దానంతో కూడిన పన్నెండు అత్యంత ప్రాధాన్యతాయుత మాసాలతో - సంకేతాన్నిస్తున్నది. సత్వరమే శక్తిని సంతరించుకుని, పెద్దపెద్ద అంగలను వేసుకుంటూ ముందుకు సాగేందుకు సంసిద్ధమైన సమాజం మా ముందర అగుపిస్తున్నది. అయితే, ఈ దశను అందుకోవడానికి ఎంతటి ప్రయాస అవసరమైంది, ఆ క్రమంలో―నేర్చిన పాఠాలు సమాజ భవితకు ఆకృతి నిస్తాయి, వాటిని ఎలా నేర్చుకోవడం జరిగింది అనే వైనం రానున్నదాని మీదికి వెలుగును ప్రసరిస్తుందనే దానిని గురించి―ఏర్పరుచుకోబడిన అవగాహనలు ఎంతటి కష్టసాధ్యాలు అన్న దానిని గురించి ఎలాంటి అపోహలూ ఉండకూడదు.

తమవైన పురోగమనాలతో, అవగాహనలతో సమృద్ధిని సంతరించుకుని 1996కు దారితీస్తూ వచ్చిన దశాబ్దాలు, అనేక సమాజాలలోని అసంఖ్యాక ప్రజలు దివ్యధర్మ పతాకం దిగువకు చేరేందుకు సంసిద్ధ మౌతారనడంలో, ఎటువంటి సందేహానికీ సందివ్వలేదు. భారీ స్థాయి నమోదులకు దృష్టాంతాలుగా ఉత్తేజకరమైనవే అయినా, భిన్న నేపధ్యాలలో నెలకొనగలిగి స్థిరంగా కొనసాగించబడగల అభివృద్ధి ప్రక్రియకు అవి సరితూగ లేదు. సమాజానికి లోతైన సమస్యలు ఎదురయ్యాయి; సముచితంగా స్పందించడానికి ఆ సమయంలో దానికి ఉన్నది అరకొర అనుభవమే. తన విస్తరణకు ఉద్దేశితమైన యత్నాలు దృఢీకరణ ప్రక్రియతో చేయీచేయీ కలుపుకుని ముందుకు సాగి, అభివృద్ధిని స్థిరంగా కొనసాగించడమన్న దీర్ఘకాలిక, దుస్సాధ్యగోచర సమస్యను ఎలా పరిష్కరించగలవు? బహాఉల్లా బోధనలను కార్యరూపంలోకి పరివర్తన చెందించే వ్యక్తులూ, వ్యవస్థలూ, సమాజాలూ ఎలా ఉత్పన్నం కాగలవు? ఇక, బోధనలకు ఆకర్షితులైనవారు, అంతర్జాతీయ ఆధ్యాత్మిక మహత్కార్యంలో ఎలా ప్రధాన పాత్రధారులు కాగలరు?

సరే, ఒక పావు శతాబ్దానికి పూర్వం, భగవంతుని దివ్యధర్మహస్తాలు ఇంకా ముగ్గురు తనకు ముందు శ్రేణులలో ఉండగా - తనకు పూర్వం అమలైన వాటికన్నా తనకు విలక్షణతను చేకూర్చిన ’సామూహిక ధర్మావలంబన ప్రక్రియలో గణనీయ పురోగమనం’ అనే ఏకైక లక్ష్యం మీద తన దృష్టిని నిలిపినటువంటి - చతుర్వర్ష ప్రణాళికలోకి ప్రవేశించిన బహాయి సమాజం అది. ఈ లక్ష్యం - అటుపై అమలులోకి వచ్చిన ప్రణాళికల పరంపరను నిర్ధారించింది. సమాజం అప్పటికే, ఈ ప్రక్రియ - కేవలం గణనీయంగా సమూహాలు దివ్యధర్మంలోకి ప్రవేశించడం మాత్రమే కాదు, అప్రయత్నంగా ఇది సంభవించేదీ కాదు అన్న అవగాహనకు వచ్చివేసింది; నిబద్ధతాయుతమూ, క్రమానుగుణమూ, త్వరితమూ అయిన విస్తరణ-దృఢీకరణలను అది సూచిం చింది. అసంఖ్యాకుల చైతన్యప్రపూరిత భాగస్వామ్యం ఈ కృషికి అవసరమౌతుంది; ఇది అనివార్యం గావించిన బృహత్తర విద్యాసమస్యను స్వీకరించవలసిందని 1996లో, బహాయి ప్రపంచాన్ని ఆమంత్రించడం జరిగింది. అభివృద్ధి ప్రక్రియను స్థిరంగా కొనసాగించేందుకు అవసరమైన సమర్ధతలతో అనుగ్రహీతులైన వ్యక్తుల బృహత్ప్రవాహాన్ని ఉత్పాదించడంపై దృష్టిని కేంద్రీకరించిన శిక్షణాసంస్థానాల యంత్రాంగాన్ని నెలకొల్పవలసిందని, దానికి పిలుపునివ్వడం జరిగింది.

కార్యోన్ముఖులైన మిత్రులకు - బోధనారంగంలో తమ పూర్వవిజయాలు ఎటువంటివైనప్పటికీ, తాము ఏ సామర్ధ్యాలను సముపార్జించుకోవాలి, ప్రధానంగా, వాటిని ఎలా సముపార్జించుకోవాలి అన్న దానిని గురించి తాము స్పష్టంగా నేర్చుకోవలసిన దెంతో ఉందని తెలుసు. సమాజం ఆచరణ ద్వారా, అనేక విధానాలలో నేర్చుకుంటుంది; అది నేర్చిన పాఠాలు, కాలక్రమంలో విభిన్న నేపధ్యాలలో వినియోగించబడడం ద్వారా వడపోతకు లోనై, పరిష్కృతాలైన మీదట, అంతిమంగా విద్యాసంబంధిత అధ్యయనపాఠ్యాలలోకి విలీనం గావించబడతాయి. కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలు, ఒక ప్రజాసమూహపు టాధ్యాత్మికావసరాలకు సహజస్పందన అని గుర్తించడం జరిగింది. ఇందుకు సంబంధించి - అధ్యయన కేంద్రాలు, బాలల తరగతులు, ఆధ్యాత్మిక సమావేశాలు, అటుపై కిశోరప్రాయుల బృందాలు కీలక ప్రాధాన్యతా సమన్వితాలై నిలిచాయి; సంబంధిత కార్యక్రమాలతో అవి సమ్మిళితమైనప్పుడు ఉత్పన్నమైన పరివర్తనాత్మక శక్తి, సమాజజీవితానికి సంబంధించిన చైతన్యప్రపూరిత సరళి ఒక దానిని నెలకొల్పగలిగింది. ఇక, ఈ ప్రధాన కార్యక్రమాలలో పాల్గొనేవారి సంఖ్యలు పెరిగేకొద్దీ, వాటి మౌలికలక్ష్యానికి ఒక నూతన పార్శ్వాన్ని చేర్చడం జరిగింది. అవి -యువజనులూ, వయోజనులూ, ఇంకా విస్తృత సమాజంలోని కుటుంబాలకు కుటుంబాలే బహాఉల్లా దివ్యావిష్కరణ సమక్షంలోకి ప్రవేశించగలిగిన ద్వారసీమలుగా ఉపకరించాయి. ‘సముదాయం’ - విశిష్ట సామాజిక లక్షణాలతో కూడిన నిర్వహణీయ భౌగోళిక ప్రాంతం - అనే నేపధ్యంలో సమాజనిర్మాణ కృషికి వ్యూహాలను ఆలోచించడం ఎంత ఆచరణాత్మకమో కూడా స్పష్టమౌతూ వచ్చింది. సాముదాయిక స్థాయిలో సాధారణ ప్రణాళికలను రూపొందించగల సామర్ధ్యం వృద్ధిచెంద నారంభించింది, ఇక అటువంటి ప్రణాళికల నుండి, త్రైమాసిక కార్యక్రమావృత్తాలుగా వ్యవస్థీకృతాలైన దివ్యధర్మ అభివృద్ధి కార్యక్రమాలు ఆవిర్భవించాయి. ముందుగా వెల్లడైన ముఖ్యాంశం: శిక్షణాక్రమాల శ్రేణిలో వ్యక్తుల ప్రస్థానం, నిరంతరాభివృద్ధి వెంట సముదాయాల ప్రస్థానానికి ప్రేరణను ఇస్తుంది, దానిచే స్థిరీకృతమౌతుంది అన్న దానిని గురించి. ఈ పరస్పరాశ్రయ సంబంధం తమ స్వీయపరిసరాలలో అభివృద్ధి స్పందనను మదింపుచేసి, మరింత శక్తి దిశగా మార్గాన్ని ఏర్పరచుకోవడంలో ప్రపంచవ్యాప్తంగా మిత్రులకు సహాయపడింది. సముదాయంలో జరుగుతున్న దానిని మూడు విద్యా ప్రాధాన్యతల అంటే―బాలలకూ, కిశోరప్రాయులకూ, యువజనులకూ-వయోజనులకూ సేవలను అందించడం―దృక్కోణం నుండీ, అభివృద్ధి లయగతికి అతి ముఖ్యమైనటువంటి కార్యావృత్తాల దృక్కోణం నుండీ కూడా చూడడం ఉపయుక్తమని, కాలక్రమేణా, నిరూపితమైంది. ఇరవయ్యైదు సంవత్సరాల కృషిని విడివిడిగా పరిశీలిస్తే, అభివృద్ధి ప్రక్రియకు సంబంధించి మేమీనాడు చూస్తున్న అత్యంత విశిష్టలక్షణాలలో చాలావరకూ, అప్పట్లో బాగా నెలకొంటున్నటువంటివే.

మిత్రుల యత్నాలు ఉధృతమౌతున్న కొద్దీ, అభివృద్ధి ప్రక్రియకున్న సార్వత్రిక ఔచిత్యానికి సంబంధించిన వివిధ నియమాలూ, భావనలూ, వ్యూహాలూ - నూతనాంశాలకు స్థానాన్ని కల్పించేలా పరిణమించగల ఒక కార్యసారణిగా స్ఫటికీకృతం కానారంభించాయి. ఈ కార్యసారణి అత్యద్భుత చైతన్యాన్ని కలిగించడంలో కీలకంగా నిరూపితమైంది. తమ శక్తిసామర్ధ్యాలను చైతన్యోపేత సమాజాల అభివృద్ధికి హితకరమైన రీతుల్లో వినియోగించడంలో, ఇది మిత్రులకు తోడ్పడిందని అనుభవం వెల్లడించింది. అయితే, కార్యసారణి అంటే ఒక నిర్దిష్టసూత్రం కాదు. ఒక సముదాయపు, ప్రదేశపు, లేదంటే ఒక సామీప్య ప్రాంతపు టధివాస్తవికతను అంచనా వేస్తున్నప్పుడు కార్యసారణికి సంబంధించిన వివిధాంశాలనూ పరిగణనలోకి తీసుకోవడం ద్వారా, ఆ ప్రాదేశిక వివరాలకు స్పందిస్తూనే, తక్కిన బహాయి ప్రపంచం నేర్చుకుంటున్న దానిని వినియోగించిన కార్యాచరణ నమూనా ఒకదానిని రూపొందించవచ్చు. ఒక వంకన కఠినమైన అవసరాలు, మరోవైపున అంతులేని వ్యక్తిగత ప్రాధాన్యతలు- వీటి మధ్యన ఏర్పడిన ద్వైదీభావం: సమగ్రమైనదీ, అనుభవం సమీకరించుకోబడే కొద్దీ నిరంతరాయంగా మెఱుగు పరచబడుతూ ఉండేదీ అయిన ఒక ప్రక్రియకు సహకరించడంలో వ్యక్తులు ఉపయోగించగల వైవిధ్యభరిత విధానం గురించిన మరింత సునిశిత అవగాహనకు దారిని వదిలివేసింది. ఈ కార్యసారణి ఆవిర్భావంతో సూచితమైన పురోగమనం: అంటే యావత్ బహాయి ప్రపంచ ప్రయత్నాలనూ సమన్వయీకరించడానికీ, సమైక్యపరచడానికీ, దాని పురోగమనయాత్రకు ప్రేరణనివ్వడానికీ సంబంధిం చిన అంతరార్ధాలు మహత్తర పరిణామసమన్వితాలే నన్న దానిని గురించి ఏ సందేహమూ ఉండరాదు.

ప్రణాళిక ననుసరించి ప్రణాళిక ప్రవేశిస్తుండగా, సమాజనిర్మాణ కార్యక్రమంలో నిమగ్నం కావడం మరింత విస్తృత ప్రాతిపదికను సంతరించుకుంటుండగా - సాంస్కృతిక స్థాయిలో పురోగమనాలు మరింత ప్రాధాన్యతాయుతాలైనాయి. ఉదాహరణకు పిన్నతరాలను విద్యావంతులను గావించడానికి గల ప్రాముఖ్యతను, ప్రత్యేకించి కిశోరప్రాయులు ప్రదర్శించిన అసాధారణ అంతర్గతశక్తి మాదిరిగానే, మరింత విస్తృతంగా అవగతం చేసుకోవడం జరిగింది. ఉమ్మడిపథంలో వ్యక్తులు ఒకరికొకరు సహకరించుకుంటూ, తోడ్పాటును అందించుకుంటూ, అన్యోన్యసహకార వలయాన్ని అవిచ్ఛిన్నంగా విస్తృతపరుచు కుంటూ ఉండడమన్నది - సేవాసామర్ధ్యాన్ని పెంపొందించేందుకు ఉద్దేశితమైన అన్ని యత్నాలూ అభిలషించిన నమూనా అయింది. ఆధ్యాత్మిక లాలిత్యాలను జ్వలింపచేసి, ప్రవృద్ధం గావించడంలో, అర్ధవంతమైన చర్చలకు గల శక్తిని గురించిన చైతన్యం పెరుగుతూ ఉండేకొద్దీ మిత్రుల మధ్యనా, వారి చుట్టూతా ఉన్నవారితోనూ జరిగే వైయక్తిక వ్యవహరణాలు సైతం మార్పుకు లోనయ్యాయి. ఇక, ప్రధానంగా, బహాయి సమాజాలు మరింత సువిశాలదృక్పథాన్ని అలవరుచుకున్నాయి. దివ్యధర్మ దార్శనికతకు స్పందించే ఏ వ్యక్తి అయినా―ప్రోత్సాహకుడైనా, నిర్వాహకుడైనా సరే―విద్యాకార్యకలాపాలలోనూ, ఆరాధనా సమావేశాలలోనూ, సమాజనిర్మాణ కార్యక్రమంలోని తక్కిన అంశాలలోనూ క్రియాశీలక భాగస్వామి కాగలిగాడు; అటువంటి వ్యక్తులలో చాలామంది బహాఉల్లా పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటిస్తారు కూడా. అలా - వాదాల మీదా, ఊహల మీదా తక్కువగానూ; ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఎలా దివ్యధర్మాన్ని కనుగొనగలిగారు, దానితో చక్కని పరిచయాన్ని ఏర్పరుచుకోగలిగారు, దాని లక్ష్యాలతో భావసారూప్యతను ఏర్పరుచుకోగలిగారు, దాని కార్యకలాపాలలో, చర్చలలో పాల్గొనగలిగారు, దానిని― చాలా సందర్భాలలో―అవలంబించగలిగారు అన్న వాస్తవానుభవం మీద ఎక్కువగానూ ఆధారపడిన సామూహిక ధర్మావలంబనా భావన ఒకటి అవతరించింది. వాస్తవానికి, ప్రాంతం వెంట ప్రాంతంగా శిక్షణాసంస్థాన ప్ర‘కియ పటిష్టం కాబడుతూ ఉండే కొద్దీ, ప్రణాళికా కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న వ్యక్తుల సంఖ్య - దివ్యధర్మంతో ఈ మధ్యనే పరిచయం ఏర్పడిన వారికి సైతం విస్తరిస్తూ - ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. అయితే, ఇది కేవలం అంకెల పట్ల అనురక్తితోనే ప్రేరేపితమౌతూ రాలేదు. భగవద్వచనపు టధ్యయనం మీదా, గంభీరమైన ఆధ్యాత్మిక ఘట్టంలో ప్రధానపాత్రధారి కావడంలో ప్రతి ఒక్కరి సామర్ధ్యం పట్లనూ గల అవగాహన మీదా ఆధారితమై, ఏకకాలంలో నెలకొంటున్న వ్యక్తిగత, సమిష్టి పరివర్తనాత్మక దార్శనికత - ఒక సమిష్టిప్రయత్న స్పృహను రేకెత్తించింది.

ఈ ఇరవయ్యైదు సంవత్సరాల కాలానికీ సంబంధించిన అత్యంత మహత్తర, స్ఫూర్తిప్రద లక్షణాలలో ఒకటి: సమాజ యత్నాల పరంగా ప్రథమశ్రేణిలో తమ న్యాయబద్ధమైన స్థానాన్ని విశ్వాసంతోనూ, నిబ్బరంతోనూ వహించిన బహాయి యువజనులు అందించిన సేవ. దివ్యధర్మబోధకులుగానూ, పిన్నల అధ్యాపకులుగానూ, సంచార శిక్షకులుగానూ, స్థానీయ పయొనీర్లుగానూ, సాముదాయిక సంచాలకులుగానూ, బహాయి ప్రాతినిధ్యసంస్థల సభ్యులుగానూ - ఐదు ఖండాల యువజనులూ తమ సమాజాలను దీక్షతోనూ, త్యాగనిరతితోనూ సేవించడానికి ఉద్యమించారు. దివ్యప్రణాళికా పురోగమనం ఆధారితమై ఉన్న విధుల నిర్వహణలో వారు ప్రదర్శించిన పరిణితి - వారి ఆధ్యాత్మిక చైతన్యంలోనూ, మానవజాతి భవితను పరిరక్షించడం పట్ల వారి నిబద్ధతలోనూ అభివ్యక్తమౌతున్నది. అధికాధికంగా ప్రస్ఫుటమౌతున్న ఈ పరిణితికి గుర్తింపుగా, ఈ రిద్వాన్ తరువాయి నుండీ, స్థానిక సభకు సేవలను అందించేందుకు విశ్వాసి అర్హుడయ్యే వయస్సు ఇరవై ఒకటిగానే ఉండాలనీ, అయినా విశ్వాసి బహాయి ఎన్నికలలో ఓటును వేయగలిగే వయస్సు పద్ధెనిమిదికి తగ్గించబడాలనీ నిర్ణయించాం. ప్రతి నిర్వాచిత బహాయీ ఆహ్వానితుడైన ‘పవిత్ర కర్తవ్యా,‘ న్ని, ‘అప్రమత్తంగా, శ్రద్ధగా’ నెరవేర్చడంలో తమ సమర్ధత పట్ల మా విశ్వాసాన్ని ప్రపంచవ్యాప్తంగా యుక్తవయస్కులైన బహాయి యువజనులు నిలుపుకుంటారనడంలో మాకు సందేహం లేదు.

*

సమాజాల అధివాస్తవికతలు విపరీతంగా భేదిస్తాయన్నది, సహజంగా, మే మెరిగినదే. వివిధ జాతీయ సమాజాలూ, ఆ సమాజాలున్న వివిధ ప్రదేశాలూ ఈ ప్రణాళికల పరంపరను - అభివృద్ధికి సంబంధించిన వివిధ దశల వద్ద ఆరంభించాయి; అప్పటినుండీ, అవి సైతం వివిధ వేగాలతో వృద్ధి చెందాయి, ప్రగతిపరంగా వివిధ స్థాయిలను అందుకున్నాయి. ఇదీ, క్రొత్తదేమీ కాదు. సమస్య ఎప్పుడూ, ప్రాదేశిక పరిస్థితులు - ఆయా చోట్ల కనుగొనబడిన సానుకూలవైఖరి స్థాయి మాదిరే - వ్యత్యాసభరితాలై ఉంటాయన్న దానితోనే. అయినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాటి సమాజాల విజయంతో ఉత్తేజితాలై , సామర్ధ్య, విశ్వాస, సంచితానుభవాల పరంగా పలు సమాజాలు పెంపొందించుకుంటున్న ఆలోచనా ధోరణి ఉధృతిని సైతం అవలోకిస్తున్నాం. ఉదాహరణకు - 1996లో ఒక నూతన ప్రదేశానికి దివ్యధర్మపరిచయం చేసేందుకు ఉద్యుక్తులైనవారిలో ధైర్యానికీ, విశ్వాసానికీ, దీక్షకూ కొదవలేదు; ఈనాడు, ప్రపంచవ్యాప్తంగా వారి సమస్థాయిలో ఉన్నవారు అవే లక్షణాలను - విస్తరణ, దృఢీకరణల కృషిని క్రమబద్ధీకరించి, మెఱుగు పరిచేందుకై యావత్ బహాయి ప్రపంచమూ చేసిన ఇరవై ఐదు సంవత్సరాల కృషితో సమీకరించబడిన పరిజ్ఞానంతో, అవగాహనలతో, నైపుణ్యాలతో మేళవిస్తున్నారు.

ఇది - విశ్వాసం, పట్టుదల, నిబద్ధత అనబడే లక్షణాలను నేర్చుకోవాలన్న సంసిద్ధతతో మిళితం చేసినప్పుడు, ఒక సమాజపు టారంభదశతో ప్రమేయం లేకుండా, అభివృద్ధి ప్రక్రియను పురోగమింప చేసింది. వాస్తవానికి, ఈ ప్రణాళికల పరంపరకు సంబంధించి సంక్రమించిన ఒక మనోజ్ఞ భావన: పురోగమించేందుకై చేసే ఏ ప్రయత్నమైనా, నేర్చుకోవాలన్న దృక్పథంతో మొదలౌతుందనే సువిస్తృత గుర్తింపు. ఈ నియమపు నిరాడంబరత, దీనిని వెన్నంటి ఉన్న అంతరార్ధాల ప్రాముఖ్యతను అగుపడనివ్వడం లేదు. ప్రతి సముదాయమూ, నిర్ణీత సమయంలో, నిరంతరాభివృద్ధి వెంట పురోగమిస్తుందన్న దానిని మేము సందేహించం; అత్యంత త్వరితంగా పురోగమించిన సమాజాలు, తమ స్థితులూ, సాధ్యతలూ సారూప్యంగా ఉన్న వాటితో పోల్చుకున్నప్పుడు - భావైక్యతను ప్రోత్సహించగల ప్రభావశీల కార్యక్రమాన్ని గురించి తెలుసుకోగల దక్షతను ప్రదర్శించాయి. ఆ ప్రదర్శనను అవి కార్యక్రమనిర్వహణకు వెనుదీయకనే, చేశాయి.

నేర్చుకోవడం పట్ల నిబద్ధతకు అర్ధం కూడా, తప్పులు చేయడానికి సంసిద్ధమై ఉండడవేు―అయినా, తప్పులు కొన్నిసార్లు, అసౌకర్యాన్ని తెచ్చిపెట్టాయి. అనుభవరాహిత్యం వల్ల, మొదట్లో నూతన పద్ధతులనూ, విధానాలనూ తెలిసీతెలియ కుండా వినియోగించడం జరిగిందంటే, ఆశ్యర్యం లేదు; అప్పుడప్పుడూ, ఒక సమాజం - నూతనంగా అలవరుచుకున్న ఒక విధమైన సామర్ధ్యాన్ని, తాను ఇంకొకదానిని అభివృద్ధి చేసుకోవడంలో నిమగ్నమై ఉండగా, నష్టపోవడం జరిగింది. ఉత్తమలక్ష్యాలు ఉండడమన్నది తప్పటడుగులు పడవనడానికి హామీ కాదు, వాటిని అధిగమించడానికి వినమ్రతా, నిర్మోహత్వమూ అవసరం. సహిష్ణుతను ప్రదర్శించాలి, సహజంగా సంభవించే పొరపాట్లనుండి నేర్చుకోవాలి అన్న దృఢసంకల్పంతో సమాజం ఉన్నప్పుడు, ప్రగతి ఎప్పుడూ కనుచూపుమేరను దాటిపోలేదు.

ప్రణాళికల పరంపర మధ్యకాలంలో, సాంఘిక జీవితంలో సమాజం పాత్ర మరింత నిశితదృష్టికి కేంద్రబిందువు కానారంభించింది. దీనిని గురించి సామాజిక కార్యక్రమమూ, వర్తమాన సాంఘిక చర్చలలో పాల్గొనడమూ అనే రెండు పరస్పర సంబంధమున్న కార్యరంగాలపరంగా ఆలోచించవలసిందని విశ్వాసులను ప్రోత్సహించడం జరిగింది. అయితే, ఇవి విస్తరణ-దృఢీకరణల కృషికి ప్రత్యామ్నాయాలూ కాలేదు, దానినుండి ప్రక్కత్రోవ పట్టించాయనడానికీ లేదు: అవి అందులోని అంతర్భాగాలే. ఒక సమాజం ఆహ్వానించగలిగిన మానవవనరులు ఎంత మహత్తరమైనవైతే, బహాఉల్లా దివ్యావిష్కరణలో నిక్షిప్తమై ఉన్న విజ్ఞతను సమకాలీన సమస్యల సాధనకు―ఆయన బోధనలను వాస్తవరూపంలోకి పరివర్తన చెందించడానికి― వినియోగించడంలో దాని సామర్ధ్యం అంత మహత్తరమూ అయింది. ఈ కాలగమనంలో, మానవాళి సంకటపరిస్థితులు - దివ్యవైద్యుడు సూచించిన ఔషధంకోసం అదెంత ఆర్తితో కాంక్షిస్తున్నదో నొక్కి వక్కాణిస్తున్నా యనిపిస్తున్నది. దీనంతటిలోనూ అంతఃసూచితమై ఉన్నది -- విస్తృతప్రపంచంలో ప్రబలి ఉన్న వాటికన్నా ఒక పూర్తి విభిన్నమైన మతసంబంధిత భావన: మతాన్ని - నిత్యపురోగమనశీల నాగరికతకు ప్రేరేపణనిస్తున్న బలీయశక్తిగా గుర్తించిన భావన అది. అటువంటి నాగరికత అయత్నకృతంగా, తన స్వీయేచ్ఛతో అవతరించదనీ, దాని ఆవిర్భావానికై శ్రమించడం బహాఉల్లా అనుయాయుల లక్ష్యమనీ గ్రహించడం జరిగింది. అటువంటి లక్ష్యం - సువ్యవస్థితమైన ఇదే జ్ఞానార్జనాప్రక్రియను సామాజిక కార్యక్రమానికీ, ప్రజాచర్చలలో పాల్గొనడానికీ ప్రయోగించడాన్ని బలంగా ఆశించింది.

గత రెండున్నర దశాబ్దాల దృక్కోణం నుండి చూసినప్పుడు, సామాజిక కార్యక్రమ నిర్వహణాసామర్ధ్యం - కార్యక్రమం పరంగా అసాధారణ వికాసానికి దారితీస్తూ - గణనీయంగా పెరిగింది. ఏడాది నుండి ఏడాదికి దాదాపు 250 సాంఘిక ఆర్ధికాభివృద్ధి పథకాలు స్థిరంగా కొనసాగించబడుతూ ఉండిన 1996తో పోల్చుకుంటే ఇప్పుడవి 1,500; బహాయి స్ఫూర్తిత సంస్థల సంఖ్య 160ని దాటిపోవడానికని నాలుగింతలైంది. ప్రతి సంవత్సరమూ 70,000 స్వల్పకాలిక అట్టడుగుస్థాయి సామాజిక కార్యక్రమ పధకాలను చేపట్టడం జరుగుతున్నది; యాభయ్యింతల పెరుగుదల అది. బహాయి ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఇప్పుడు అందించిన నిబద్ధతాయుత సహకార, ఉద్దీపనల పర్యవసానాలైన ఈ ప్రయత్నాలన్నింటి నిరంతరాభివృద్ధికై ఉత్కంఠతో నిరీక్షిస్తున్నాం. ఈ లోపున వర్తమాన సాంఘిక చర్చలలో బహాయిలు పాల్గొంటూ ఉండడం కూడా అపారంగా పెరిగింది. పనిలో నైనా, వ్యక్తిగత నేపధ్యంలోనైనా చోటుచేసుకునే చర్చలలో బహాయి దృక్పథాన్ని తాము వ్యక్తం చేయగలమని మిత్రులు భావించే పలు సందర్భాలతో పాటు, చర్చలలో మరింత సాధికారికంగా పాల్గొనడం గణనీయంగా పెరిగింది. ఈ కాలంలో ఆఫ్రికా, ఆసియా, ఐరోపాలలో అనుబంధ కార్యాలయాలను ఏర్పాటు చేసిన బహాయి అంతర్జాతీయ సమాజం యెక్క సువిస్తృత ప్రయత్నాలూ, అత్యంతాధునిక సహాయసహకారాలూ మాత్రమే కాక, బాహ్యవ్యవహారాలకు సంబంధించిన జాతీయ కార్యా లయాల - విస్తారంగా ప్రవర్ధితమై, మరింతగా పటిష్టీకృతమై, ప్రధానంగా ఈ కార్యరంగం పైనే దృష్టిని పెట్టిన యంత్రాంగం - కృషి సైతం మా మనస్సులో ఉన్నది; అదనంగా, వైయక్తిక విశ్వాసులు విశిష్ట రంగాలకు అందించిన అవగాహనాపూర్వకమైన, గణనీయ సహాయసహకారాలూ ఉన్నాయి. ఒక విధంగా, ఇదంతా - దివ్యధర్మాన్ని గురించీ, దాని అనుయాయులను గురించీ, వారి కార్యకలాపాలను గురించీ సమాజంలోని అన్ని స్థాయిల మేధావులూ, ఇంకా ఇతర ప్రముఖ వ్యక్తులూ పదేపదే వ్యక్తం చేస్తూవచ్చిన మాన్యతనూ, అభినుతినీ, అభిమానాన్నీ వర్ణించడానికి దోహదం చేస్తుంది.

ఇరవయ్యైదు సంవత్సరాల కాలమంతటినీ సమీక్షించే క్రమంలో, బహాయి ప్రపంచం ఏకకాలంలో సాధించిన బహురీతుల ప్రగతితో విస్మితులమయ్యాం. ఇప్పటికే చర్చించిన కార్యరంగా లన్నింటిలోనూ, దాని పురోగమనాలతో మాత్రమే కాక, బహాయి రచయితలు ప్రచురించిన సమున్నతస్థాయి సాహిత్య పరిమాణంతోనూ, బోధనల నేపధ్యంలో కొన్ని విశిష్టాంశాల అధ్యయనానికి వేదికల రూపకల్పనతోనూ, దివ్యధర్మ వ్యవస్థల సహకారంతో, ఇప్పుడు నూటికి పైగా దేశాల బహాయి యువతకు ఉపకరిస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ గ్లోబల్ ప్రాస్పరిటీ ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన అండర్ గ్రాడ్యుయేట్ల, గ్రాడ్యుయేట్ల సదస్సుల ప్రభావంతోనూ కూడా ప్రదర్శితమైనట్లుగా - దాని మేధోజీవితం వృద్ధి చెందింది. ఆరాధనామందిరాల నిర్మాణ యత్నాలు వేగవంతాలైనట్లు ప్రస్ఫుటమైంది. గత మాతృమందిరం చిలీలోని శాన్‌టియాగోలో నిర్మితమైంది, రెండు జాతీయ, ఐదు స్థానిక మష్రిఖుల్-అఝ్కార్‌లను నిర్మించడానికి పధకాలను ఆరంభించడం జరిగింది; కంబోడియాలోని బత్తమ్‌బాంగ్‌లోనూ, కొలంబియాలోని నోర్టా డెల్ కౌకాలోనూ ఆరాధనా మందిరాల ద్వారాలు ఈ సరికే తెరుచుకున్నాయి. బహాయి ఆలయాలు, నూతనావిష్కృతాలైనా, పూర్వసంస్థాపితాలైనా సమాజజీవితంలో స్థానాన్ని ఎక్కువగా ఆక్రమిస్తున్నాయి. భగవన్మిత్రులు చేపట్టిన బహువిధ యత్నాలకు విశ్వాసుల శ్రేణులు అందించిన భౌతిక సహకారం, ఔదార్యప్రపూరితంగా ఉంటూ వచ్చింది. మామూలుగా సమిష్టి ఆధ్యాత్మిక చైతన్యపూరిత చర్యగా చూసుకున్నప్పడు, అనల్పమైన ఆర్ధికసంక్షోభ సమయంలో, సంక్లిష్టమైన నిధుల వితరణ ఔదార్యంతోనూ, త్యాగంతోనూ నిర్వహించబడడం―కాదు, శక్తిసమన్వితం గావించబడడం―ఎంతైనా అర్ధవంతంగా ఉన్నది. బహాయి పరిపాలనా పరిధిలో, తమ సమాజాల వ్యవహారాలను - వాటి సంపూర్ణ సంక్లిష్టతతో - నిర్వహించుకోవడంలో జాతీయ ఆధ్యాత్మిక సభల సామర్ధ్యం గణనీయంగా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు స్థాయిల నుండి అవగాహనల సమీకరణను క్రమబద్ధీకరించడంలోనూ, అవి విస్తృతప్రాచుర్యాన్ని పొందేలా చూడడంలోనూ దోహదకారులైన సలహాదారుల నూతనస్థాయి తోడ్పాటుతో అవి ప్రత్యేకించి లబ్ధిని పొందాయి. ప్రాంతీయ బహాయి కౌన్సిల్ ఒక పూర్తిస్థాయి దివ్యధర్మవ్యవస్థగా అవతరించిన తరుణం అది, ఇప్పుడు 230 ప్రాంతాలలోని - కౌన్సిళ్లూ, అవి పర్యవేక్షించే శిక్షణాసంస్థానాలూ అభివృద్ధి ప్రక్రియను పురోగమింప చేయడంలో తమను తాము అత్యావశ్యకమైనవిగా నిరూపించుకున్నాయి. హుఖుఖుల్లా ప్రధాన ధర్మకర్తా, భగవంతుని దివ్యధర్మహస్తమూ అయిన ఆలీ-మహమ్మద్ వార్ఖా విధులను భవిష్యత్తులో కొనసాగింప చేసేందుకై, అంతర్జాతీయ హుఖుఖుల్లా ధర్మకర్తల మండలిని 2005లో స్థాపించడం జరిగింది; ప్రపంచమంతటికీ విస్తరిస్తూ 1000 మందికి పైగా ప్రతినిధుల కృషికి పథనిర్దేశం గావిస్తున్న 33 కు తక్కువ కాని జాతీయ, ప్రాంతీయ ధర్మకర్తల మండళ్ల యత్నాలను ఇవ్వాళ అది సమన్వయీకరిస్తున్నది. ఇదే సమయంలో బహాయి ప్రపంచ కేంద్రం వద్ద చోటుచేసుకున్న పరిణామాలు అనేకం: బాబ్ దివ్యసమాధి సోపానపంక్తుల నిర్మితినీ, ధనురాకృతిపై భవనద్వయ పరిపూర్తినీ, అబ్దుల్-బహా దివ్యసమాధి నిర్మాణారంభాన్నీ అవలోకించండి; ఇక దివ్యధర్మానికి సంబంధించిన అనర్ఘ పవిత్రస్థలాలను పటిష్టీకరించి, పరిరక్షించే పలు పధకాల సంచయాన్ని గురించిన విషయ ప్రస్తావన అవసరం లేదు. బహాఉల్లా దివ్యసమాధీ, బాబ్ దివ్యసమాధీ ప్రవంచ వారసత్వ స్థలాలుగా, మానవాళికి అనంత ప్రాధాన్యతాయుత ప్రదేశాలుగా గుర్తించబడినాయి. కొన్ని సంవత్సరాలలో ఒకటిన్నర మిలియన్ల సంఖ్యను అందుకుంటూ, ప్రజలు ఈ పవిత్రప్రదేశాలకు లక్షలాదిగా వెల్లువెత్తారు; ప్రపంచ కేంద్రం క్రమం తప్పకుండా ఒకేసారి వందల మంది పుణ్యయాత్రీకులకు - ఒక్కోసారి ఏడాదికి 5,000 మందికి పైగా, అంతేమంది బహాయి సందర్శకులతోనూ - స్వాగతాన్ని పలికింది; పెరిగిన సంఖ్యతో ఎంతగా ఆనందించామో, పుణ్యయాత్రాభాగ్యంలో పాలుపంచుకునే వారిలో వివిధ ప్రజల, దేశాల లెక్కతో అంతగానూ ఆనందించాం. పది భాషలలో లభ్యమౌతున్న బహాయి. ఆర్గ్ కు అనుబంధంగా అభివృద్ధి చెందు తున్న వెబ్‌సైట్ల సమాహారంలోని అత్యంత ప్రధానాంగాలలో ఒకటైన బహాయి రిఫరెన్స్ లైబ్రరీ విస్తరణకు సమాంతరంగా పవిత్రలేఖనాల అనువాద, ప్రచురణ, వితరణలను సైతం మరింతగా వేగవంతం చేయడం జరిగింది. బహాయి ప్రపంచ వ్యాప్తంగా బహువిధ కార్యరంగాలలో ఆవిష్కృత మౌతున్న జ్ఞానార్జనా ప్రక్రియకు తోడ్పడే బాధ్యతలతో ప్రపంచ కేంద్రంలోనూ, ఇతరచోట్లా, పలువిధ కార్యాలయాలనూ, ప్రాతినిధ్య సంస్థలనూ నెలకొల్పడం జరిగింది. విశ్వాసంలో మా సోదరీసోదరులారా, ఇదంతా ప్రపంచదూషితుడై ఉండిన ఆయన పట్ల మీ భక్తిభావం ఫలింపచేసిన దానిని గురించి మేము స్మరించుకోగలిగిన గాథలో ఒక భాగమే తప్ప మరొకటి కాదు. ప్రియతమ గురువర్యుడు ఒక సారి భావోద్వేగపరవశుడై: ‘‘ఓ బహాఉల్లా ! ఏం చేశావు?’’ అని ఆక్రందించిన వేదనామయ వాక్కులను ప్రతిధ్వనించడం తప్ప మేమింకేమీ చేయలేం.

*

ప్రాధాన్యతాయుతమైన పావుశతాబ్ద సంబంధిత విహంగవీక్షణం నుండి, మా దృష్టిని ఇప్పుడు, పూర్తిగా ఈ మధ్యదీ, మునుపు ముగిసిపోయిన ప్రణాళికలకు పలువిధాలుగా పూర్తి విభిన్నమైనదీ అయిన, పంచవర్ష ప్రణాళిక మీదికి సారిస్తున్నాం. గత ఇరవయ్యేళ్లలోనూ తాము నేర్చిన దాన్నంతటినీ వినియోగించుకుని, దానిని పూర్తిగా అమలు పరచవలసిందని ఈ ప్రణాళికలో మేము ప్రపంచ బహాయిలకు విజ్ఞప్తిని చేశాం. ఇందుకు సంబంధించిన మా ఆశయాలు అనుకున్న దానికన్నా అధికంగానే సాధించబడినాయి; అయితే, శుభసౌందర్యుని అనుయూయల నుండి మేము సహజంగానే మహత్తరాంశాలను ఆశించేటప్పుడు, వారి బహత్ప్రయత్నాల కార్యసాధన స్వభావం నిజంగా విస్మయ పూర్వకంగా ఉన్నది. ఇరవై ఐదు సంవత్సరాల కార్యసాధనకు శిఖరశిల ఇది.

ప్రపంచవ్యాప్తంగా స్థానిక సమాజాలను సముత్తేజ పరచిన రెండు వేర్వేరు పవిత్ర ద్విశతజయంతులతో త్రిధాకరిత మైనందువల్ల ఆ ప్రణాళిక విశేషించి చిరస్మరణీయమైంది. సమాజంలోని సమస్తవర్గాల ప్రజలనూ భగవంతుని దివ్యావతార జీవితోత్సవాన్ని జరుపుకోవడంలో నిమగ్నం గావించగల సామర్ధ్యాన్ని మున్నెన్నడూ చూసి ఉండని స్థాయిలో, సాపేక్ష సౌలభ్యతతో విధేయుల సమూహం ప్రదర్శించింది. ఒక విధమైన సువిస్తృతికి: అంటే దివ్యధర్మ పురోగమనానికి అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తులను వినియోగించగల సమర్ధతకు - శక్తిసమన్విత సంకేతమది. స్పందన ఎంత మహత్తరంగా ఉందంటే, అనేకచోట్ల దివ్యధర్మం అస్పష్టదశ నుండి జాతీయస్థాయి నందుకున్నది. ఊహించని, బహుశః ఆశించనైనా ఆశించని చోట్ల దివ్యధర్మం పట్ల గణనీయమైన సానుకూలవైఖరి అభివ్యక్తమైంది. ఈనాడు ప్రపంచవ్యాప్త బహాయి సమాజాలకు స్వభావసిద్ధమైన ఆధ్యాత్మిక చైతన్యంతో తమకు తటస్థించిన ముఖాముఖితో వేలాది, వేలాది, వేలాదిమంది - ముగ్ధులయ్యారు. ఒక బహాయి పవిత్రదినాన్ని పాటించడం వల్ల సాధ్యం గావించబడింది ఏమిటనే దాని పట్ల దార్శనికత ఎంతగానో విస్తరించడం జరిగింది.

మామూలుగా సంఖ్యాత్మకంగా చూసుకుంటే, ప్రణాళిక ఫలితసాధనలు, దానికన్నా ముందు 1996 నుండి వచ్చిన సకల ప్రణాళికల ఫలితసాధనలకూ సత్వరమే గ్రహణాన్ని పట్టించాయి. ఈ ప్రణాళిక మొదట్లో, ఒక నిర్ణీతసమయంలో కేవలం 100,000కు పైగా ప్రధాన కార్యక్రమాలను నిర్వహించగల సామర్ధ్యం ఉండేది; ఇరవై సంవత్సరాల సమిష్టికృషి ఫలం అది. ఇప్పుడు, ఏకకాలంలో 300,000 ప్రధాన కార్యక్రమాలు స్థిరంగా కొనసాగించబడుతున్నాయి. ఆ కార్యక్రమాలలో పాల్గొనేవారి సంఖ్య ఇరవై లక్షలకు పెరిగింది, ఇదీ త్రిగుణాత్మక పెరుగుదలకు సమీపమే. 329 జాతీయ, ప్రాంతీయ శిక్షణా సంస్థానాలు పని చేస్తున్నాయి, వాటి సామర్ధ్యం - పదిలక్షలలో ముప్పాతిక వంతు మంది శ్రేణిలోని పుస్తకాలలో కనీసం ఒక్కదాన్ని పూర్తిచేయ గలిగారన్న వాస్తవంతో స్పష్టీకతమైంది; మొత్తంగా, ఇప్పుడు వ్యక్తులు పూర్తి చేసిన శిక్షణాక్రమాల సంఖ్య సైతం ఇరవై లక్షలు―ఐదేళ్లలో మూడోవంతుకన్నా మరింత ఎక్కువ ఎదుగుదలే.

ప్రపంచమంతటా అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ద్యోతకమౌతున్న మహోధృతి తనదైన మనోజ్ఞ గాథను చెబుతున్నది. ఈ ఐదేళ్ల వ్యవధిలో, అభివృద్ధి ఆరంభమైన 5,000 సముదాయాలలో ప్రతి ఒక్కదానిలోనూ, అది - వేగవంతం కాబడాలని పిలుపునిచ్చాం. ఈ ప్రధానసూచన - ప్రపంచవ్యాప్తంగా నిబద్ధతాయుత కృషికి ప్రేరణ అయ్యింది. ఫలితంగా, విశేషాభివృద్ధి కార్యక్రమాల సంఖ్య రెండింతలకు పైగా పెరిగి, ఇప్పుడు దాదాపు 4,000 ల వద్ద ఉన్నది. ప్రపంచ ఆరోగ్యసంక్షోభం మధ్యన, దివ్యధర్మాన్ని నూతన గ్రామాలకూ, సామీప్య ప్రాంతాలకూ విస్తరింపచేయడంలో అంతర్లీనమై ఉన్న ఇబ్బందులు కానీ, మహమ్మారి మొదలైనప్పటికి ఆరంభదశలో ఉండిపోయిన విస్తరణ కార్యకలాపాలు కానీ - ప్రణాళిక చివరి సంవత్సరంలో మరింత ఎక్కువ మొత్తాన్ని అందుకోనివ్వకుండా అవరోధించాయి. అయితే, ఇంతకన్నా చెప్పవలసింది ఉంది. ప్రణాళిక ఆరంభంలో - మిత్రులు నిరంతరాభివృద్ధి వెంట మూడవ మజిలీని చేరుకున్న సముదాయాల సంఖ్య, వాటి కార్యక్రమాల పరిధిలోకి అధికసంఖ్యాకులను ఎలా స్వాగతించాలన్న పరిజ్ఞాన పర్యవసానంగా - మరిన్ని వందల్లో వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాం. ఆ మొత్తం, అప్పుడు - రమారమి 40 దేశాలలో విస్తరించుకుని 200 వద్ద నిలిచింది. ఐదు సంవత్సరాలు గడిచేసరికి, ఈ సంఖ్య 100 దేశాలలో ఆశ్యర్యకరంగా 1,000 కి పెరిగింది―ప్రపంచంలోని మొత్తం విశేషాభివృద్ధి కార్యక్రమాలలో ఇది నాలుగో వంతూ, మా అంచనాలను ఎంతగానో అధిగమించిన కార్యసాధన కూడాను. అయినా, ఈ సంఖ్యలు సైతం - సమాజం అందుకున్న అత్యంత సమున్నత శిఖరాలను వ్యక్తీకరించలేవు. స్థిరంగా కొనసాగించబడుతున్న ప్రధాన కార్యక్రమాలు 1,000 ని అధిగమిస్తున్న సముదాయాలు - 30కి పైగానే ఉన్నాయి; కొన్నిచోట్ల, ఈ మొత్తం - ఒక్క సముదాయంలోనే 20,000 మంది భాగస్వామ్యంతో - అనేక వేలల్లో ఉన్నది. దాదాపుగా గ్రామంలోని అందరు బాలల, కిశోరప్రాయుల అవసరాలను తీర్చే విద్యాకార్యక్రమాల వికాసాన్ని, ఇప్పుడు, అసంఖ్యాక స్థానిక ఆధ్యాత్మిక సభలు పర్యవేక్షిస్తున్నాయి; అదే అధివాస్తవికత ఇప్పుడు కొన్ని పట్టణ సామీప్యప్రాంతాలలో గోచరించ నారంభిస్తున్నది. బహాఉల్లా దివ్యావిష్కరణతో సాంగత్యం - ముఖ్యసందర్భాలలో, వ్యక్తులనూ, కుటుంబాలనూ, ఉమ్మడి బంధుత్వాలనూ అధిగమించి పోయినట్లనిపిస్తున్నది―అంటే ఉమ్మడికేంద్రం దిశగా ప్రజాసమూహాల పయనం అన్నమాట. కొన్ని సందర్భాలలో, వైరివర్గాల మధ్యన ఉన్న పూర్వకక్షలను వదిలివేసుకోవడం జరుగుతున్నది, దైవబోధనల నేపధ్యంలో కొన్ని సామాజిక వ్యవస్థలూ, ప్రవర్తనారీతులూ పరివర్తితాలౌతున్నాయి.

ఇంతటి మనోహరాన్విత పురోగమనాలతో మహదానందభరితులం కాకుండా ఉండలేకపోతున్నాం. బహాఉల్లా దివ్యధర్మానికి గల సమాజనిర్మాణ శక్తి మరింత స్పష్టతతో అభివ్యక్తీకృత మౌతున్నది; ఇక ఇదే సుస్థిర పునాది మీద ఆరంభమౌతుంది -- రానున్న నవవర్ష ప్రణాళిక. ఆశించినట్లుగానే, స్పష్టమైనశక్తితో కూడిన సముదాయాలు, జ్ఞానం పరంగానూ, వనరుల పరంగానూ తమ పొరుగువాటికి భాండారాలుగా నిరూపితమయ్యాయి. అటువంటి సముదాయాలు ఒకటికి మించి ఉన్న ప్రాంతాలు, ఒక దాని వెంట ఒకటిగా సముదాయాల అభివృద్ధిని వేగవంతం గావించే మార్గాన్ని మరింత సులభంగా అభివృద్ధి చేశాయి. అయితే, ప్రగతి దాదాపుగా సార్వత్రికతకు చేరువ కావడం జరిగిందని మరోసారి నొక్కి చెప్పాలని మాకు బలంగా అనిపిస్తున్నది; ప్రదేశానికీ ప్రదేశానికీ ప్రగతిలో ఉన్న వ్యత్యాసం - స్థాయికి సంబంధించినదే. సామూహిక ధర్మావలంబన ప్రక్రియ పట్ల సమాజానికి ఏర్పడిన అవగాహనా, ఈ ప్రక్రియను ఏ పరిస్థితుల సంచయంలో నైనా ఉద్దీపింప చేయగలగడంలో దానికి గల ఆత్మవిశ్వాసమూ - గత దశాబ్దాలలో అనూహ్య స్థాయిలకు ఎదిగిపోయాయి. సుదీర్ఘకాలంగా వేధిస్తున్నవీ, 1996లో నిశిత పరిశీలనలోకి తీసుకురాబడినవీ అయిన లోతైన ప్రశ్నలకు బహాయి ప్రపంచం ఆమోదనీయంగా ప్రత్యుత్తరాలను ఇచ్చింది. తమ యావజ్జీవితాలలోనూ సమాజప్రగతి ముద్రితమైపోయిన విశ్వాసుల తరం ఒకటున్నది. కాని, జ్ఞానార్జనాసీమలు (విజ్ఞాన శిఖరాలు) విస్తారితాలౌతున్న పలు సముదాయాలలో చోటుచేసుకున్నదాని సంపూర్ణస్థాయి - సామూహిక ధర్మావలంబన ప్రక్రియ లోని ఒక ప్రధాన పురోగమనాన్ని, చారిత్రాత్మక స్థాయిగల మహత్త్వపూర్ణ పురోభివృద్ధిగా పరివర్తన గావించింది.

సంరక్షకుడు దివ్యధర్మ యుగాలను క్రమానుగత యుగాంశాలుగా ఎలా విభజించాడో చాలామందికి సుపరిచిత మౌతుంది; రచనాత్మక యుగపు పంచమ యుగాంశం 2001లో మొదలైంది. అంత బాగా తెలియనిది: ధర్మసంరక్షకుడు దివ్యప్రణాళికలో యుగాంశాలూ, ఆ యుగాంశాలలో దశలూ ఉండడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడన్నది. పరిపాలనా సంవిధానానికి సంబంధించిన స్థానిక, జాతీయ వ్యవస్థలు అభివృద్ధి గావించబడుతూ, దృఢీకృతాలౌతూ ఉండగా, అబ్దుల్-బహా మేధాజనితమై, రెండు దశాబ్దాల పాటు సుప్తచేతనావస్తలో ఉంచబడిన దివ్యప్రణాళికను, దాని ప్రథమ యుగాంశపు తొలి దశతో: అంటే ఉత్తర అమెరికా బహాయి సమాజానికి ధర్మసంరక్షకుడు అప్పగించిన సప్తవర్ష ప్రణాళికతో, 1937లో, లాంఛనప్రాయంగా - ప్రారంభించడం జరిగింది. 1963లో ప్రపంచవ్యాప్తంగా దివ్యధర్మ పతాకసంస్థాపనగా పరిణమించిన దశవర్ష మహోద్యమ పరిపూర్తి అనంతరం ఈ ప్రథమ యుగాంశం ముగిసింది. ద్వితీయ యుగాంశపు టారంభదశ - తొలి నవవర్ష ప్రణాళిక; పన్నెండు మాసాల నుండి ఏడు సంవత్సరాల వ్యవధి వరకూ విస్తరించిన ప్రణాళికలు, పదికి తక్కువ కాకుండా, దానిని అనుసరించి వచ్చాయి. ఈ రెండవ యుగాంశపు టారంభం జరిగిన నాటికే, దివ్యప్రణాళిక కృతికర్త అభిదర్శించిన: ’దివ్యధర్మంలోకి సామూహిక ప్రవేశాల’ ప్రప్రథమ సమారంభాలను బహాయి ప్రపంచం అవలోకిస్తున్నది; అనంతర దశాబ్దాలలో, మహాఘననామ సమాజంలోని విధేయవిశ్వాసుల తరాలు, స్థిరంగా కొనసాగించబడిన విస్తృతస్థాయి అభివృద్ధికి అవసరమైన పరిస్థితులను పెంపొందింప చేసేందుకై దివ్యద్రాక్షావాటికలో శ్రమించాయి. ఈ సముజ్జ్వల రిద్వాన్ పర్వకాలం నాటికి, ఆ శ్రమఫలితాలు ఎంతటి అపారమైనవి! గణనీయ సంఖ్యాకులు సమాజ కార్యకలాపాలను వృద్ధి చేస్తూ ఉండడం, విశ్వాసస్ఫూర్తిని అందిపుచ్చుకోవడం, ప్రణాళిక అగ్రభాగాన సేవలను అందించేందుకు సత్వరమే ఉద్యమించడం అన్న విశిష్టఘటన - విశ్వాసంతో కొనసాగుతూ వచ్చిన భవిష్యసూచన నుండి, పునరావృత వాస్తవికతకు మారింది. అటువంటి ప్రస్ఫుట, ప్రదర్శనీయ పురోగమనం - దివ్యధర్మ చరిత్రపుటలలో ప్రస్తావనను అనివార్యంగా ఆశిస్తున్నది. గురువర్యుడి దివ్యప్రణాళిక తృతీయ యుగాంశం ప్రారంభమైందని, ప్రమోదభరిత హృదయాలతో, ప్రకటిస్తున్నాం. ప్రతి హృదయాన్నీ దివ్యసామ్రాజ్య దీప్తి జ్యోతిర్మయం గావించేంత వరకూ - దశలవారీగా, యుగాంశాలవారీగా - ఆయన దివ్యప్రణాళికా వికాసం జరుగుతుంది.

ప్రియతమ మిత్రులారా, దివ్యప్రణాళిక ద్వితీయ యుగాంశానికి ముగింపును పలికిన పంచవర్ష బహద్యత్న సమీక్ష ఏదీ కూడా, దాని తుది సంవత్సరాన్ని వెన్నంటివచ్చి, ఇంకా పీడిస్తూనే ఉన్న ఉపద్రవాల విశేష ప్రస్తావన లేకుండా పరిపూర్ణం కాదు. ఈ కాలం అంతటా, వ్యక్తిగత వ్యవహరణంపై చాలా దేశాలలో పెరుగుతూ తరుగుతూ వచ్చిన ఆంక్షలు, సమాజపు సమిష్టి యత్నాలకు తీవ్రవిఘాతాన్ని కలిగించి ఉండేవి, దానినుండి కోలుకోవడానికి సంవత్సరాలు పట్టి ఉండేది, కాని అది సమస్యే కాకపోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి: మాననవాళిని సేవించడమనే బహాయిల కర్తవ్యానికి సంబంధించిన సువిస్తృత చైతన్యం - విపత్కర, ప్రతికూల సమయాలలో కన్నా - ఎన్నడూ అలా లేదు. ఇంకొకటి: ఆ చైతన్య వ్యక్తీకరణా సామర్ధ్యానికి సంబంధించి, బహాయి ప్రపంచంలో చోటుచేసుకున్న అసాధారణ పెరుగుదల. అనేక సంవత్సరాలకు పైగా వ్యవస్థీకత కార్యాచరణ నమూనాలను అనుసరించడానికి అలవాటుపడిన మిత్రులు - తాము అభివృద్ధి చేసిన నూతన విధానాలను, క్రమానుగత ప్రణాళికలలో పరిపుష్టం గావించడానికి తాము శ్రమించి ఉన్న కార్యసారణికి అనుగుణంగా ఉండేలా చూసుకుం టూనే, అనూహ్యసంక్షోభానికి - తమ సృజనాత్మకతనూ, సంకల్పస్పృహనూ అనువర్తింప చేశారు. ఇది, బహాయిలు - దేశదేశాలలోని తమ సాటి విశ్వాసుల వలెనే, భరించిన తీవ్రక్లేశాలను ఉపేక్షేంచడం కాదు; అయినా, దుర్భర కష్టాలలోనూ, విశ్వాసులు నిశ్చలచిత్తులై నిలిచారు. అవసరంలో ఉన్న సమాజాల కోసం వనరులను వినియోగించడం జరిగింది, సాధ్యమైనచోట్ల ఎన్నికలు ముందుకు సాగాయి, దివ్యధర్మవ్యవస్థలు సర్వావస్థలలోనూ తమ విధుల నిర్వహణను కొనసాగిస్తూనే వచ్చాయి. సాహసోపేత చర్యలనూ తీసుకోవడం జరిగింది. సావ్ తోమీ, ప్రిన్సిపీ జాతీయ ఆధ్యాత్మిక సభ ఈ రిద్వాన్‌కు పునఃస్థాపితమౌతుంది; విశ్వన్యాయ మందిర నూతనస్తంభాలు, రెండు: జాగ్రెబ్ మూలపీఠంగా క్రోయేషియా జాతీయ ఆధ్యాత్మిక సభ, డిలి మూలపీఠంగా టిమోర్-లెస్టీ జాతీయ ఆధ్యాత్మిక సభ - నెలకొల్పబడతాయి.

ఇక, ఏకవర్ష ప్రణాళిక మొదలౌతున్నది. ఒడంబడిక దినోత్సవాన పంపబడిన మా సందేశంలో దాని లక్ష్యాన్నీ, అవసరాలనూ ఈ సరికే నిర్దేశించడం జరిగింది; సంక్షిప్తమే అయినా, ఈ ప్రణాళిక - తనను అనుసరించి వచ్చే నవవర్ష ప్రణాళిక నిమిత్తం బహాయి ప్రపంచం సన్నద్ధం కావడానికి సరిపోతుంది. దివ్యప్రణాళికా ఫలకాల ఆవిష్కరణానంతరం నూరేళ్లకు మొదలైన విశిష్ట శక్తిసమన్విత కాలం, అబ్దుల్-బహా శతవర్ధంతి వెనువెంటనే - రచనాత్మక యుగపు ప్రథమ శతాబ్దపు సంపూర్తినీ, ద్వితీయ శతాబ్దపు టారంభాన్ని సూచిస్తూ - ముగుస్తుంది. మానవాళి తన భేద్యగుణం బహిర్గతం కావడంతో దారికి వచ్చి, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సంయుక్త కృషి అవసరం పట్ల మరింత అప్రమత్తంగా ఉన్నట్లనిపిస్తున్న తరుణంలో, విధేయుల సందోహం ఈ నూతన ప్రణాళికలోనికి ప్రవేశిస్తున్నది. అయినా, సమాజంలోని అధికసంఖ్యాకులు తాము సైతం మానవాళి సహజసిద్ధ ఏకత్వంపట్ల మహామోదాన్ని ఎలా కాంక్షిస్తున్నారో వాచా, కర్మణా వ్యక్తం చేస్తున్నప్పటికీ - స్పర్థ, స్వప్రయోజనం, పక్షపాతం, సంకుచిత మనస్తత్వం వంటి దీర్ఘకాలిక అలవాట్లు సమైక్యత దిశగా ప్రస్థానాన్ని ప్రతిరోధిస్తూనే ఉన్నాయి. ప్రజాసంక్షేమ ప్రయోజనాల దృష్ట్యా తన విభేదాలను అవతల పెట్టడంలో, దేశసంచయం విజయాన్ని సాధించుగాక అని ప్రార్ధిస్తున్నాం. రానున్న మాసాలను ఆవరించుకునే అనిశ్చితులకు అతీతంగా, తన అనుయాయులను సుదీర్ఘకాలంగా పరిపోషిస్తూ వచ్చిన ఆశీస్సులను మరింత సమృద్ధిగా, తన ఆరోగ్యకరణ సందేశావసరం సదా అపారమే అయిన ప్రపంచం యొక్క అనిశ్చితితో మీ స్థైర్యం సంచలించక, మీరు మీ లక్ష్యంలో ముందుకు సాగేలా - అనుగ్రహించమని బహాఉల్లాను వేడుకుంటున్నాం.

దివ్యప్రణాళిక నూతన యుగాంశంలోనికి, నూతన దశలోనికి ప్రవేశిస్తున్నది. పుటను త్రిప్పడమైనది.

అబ్దుల్-బహా స్వర్గారోహణ శతాబ్ధి సందర్భాన ఆయన గౌరవార్ధం పవిత్రభూమిలో జరిగిన విశేష కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతినిధులను పంపడంతో సహా, మిత్రులు గావించిన యత్నాలతో విశిష్టతను సంతరించుకున్న సన్నద్ధతాయుత, సమీక్షా పూర్వక, బృహత్పరిశ్రమాన్విత సంవత్సరం పరిసమాప్తమైంది. అబ్దుల్-బహా జీవితం అందించిన స్ఫూర్తిని - ఈ యత్నాల ద్వారా - కేవలం బహాయిలు మాత్రమే కాక, అనేకమంది అనుభూతి చెందడం జరిగింది. ఆయనకు మానవకుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరి పట్లనూ గల ఆందోళన, ఆయన బోధనాకృషి, విద్య-సాంఘిక శ్రేయోపథకాలకు ఆయన ఇచ్చిన తోడ్పాటు, ప్రాక్పశ్చిమాలు రెండింటా సాంఘిక (సమస్యలపై) చర్చలకు ఆయన అందించిన మహత్త్వపూర్ణ సహాయసహకారాలు, ఆరాధనా మందిరాల నిర్మాణ పథకాలకు ఆయన (అందించిన) మనఃపూర్వక ప్రోత్సాహం, తొలి బహాయి పరిపాలనా రీతులకు ఆయన (కావించిన) రూపకల్పన, సామాజిక జీవితపు వివిధాంశాలకూ ఆయన చేకూర్చిన సంస్కారం―ఆయన జీవితంలోని ఈ పరిపూరక పార్శ్వాలన్నీ - భగవత్సేవ పట్లనూ, మానవసేవపట్లనూ ఆయనకు గల సుస్థిర, సంపూర్ణ అంకితభావ ప్రతిఫలనమే. నైతిక సాధికారతకూ, అనంత ఆధ్యాత్మికావగాహనకూ మహోదాత్తస్వరూపుడు కావడమే కాక, బహాఉల్లా దివ్యావిష్కరణ వెలువరించిన శక్తులను ప్రపంచంపై ప్రవర్తిల్ల చేయించగలిగిన పావనవాహిని - అబ్దుల్-బహా. దివ్యధర్మానికి గల సాంఘిక నిర్మాణశక్తిని అవగతం చేసుకునేందుకు గాను, అబ్దుల్-బహా తన పాలనా కాలంలో సాధించిన కార్యసాఫల్యతలనూ, ఆయన లేఖిని నుండి అవిచ్ఛిన్నంగా వెలువడిన మార్గదర్శకత్వపు పరివర్తనాన్విత ప్రభావాలనూ మించి మనం విలోకించ నవసరం లేదు. ఈనాటి బహాయి సమాజం సాధించిన―గత రిద్వాన్‌కు మేము మీ కిచ్చిన సందేశంలో సమీక్షితాలైన―ఎన్నెన్నో మహాద్భుత పురోగమనాలు, తమ మూలాలను - అబ్దుల్-బహా చర్యలలోనూ, నిర్ణయాలలోనూ, నిర్దేశాలలోనూ కనుగొంటాయి.

ఇక, బహాయి సమాజం - దివ్యధర్మ సాంఘిక - నిర్మాణశక్తి మరింత బృహత్పరిమాణాలలో వెలువరింపు కావడంపై కేంద్రీకృతమైన ప్రధాన పూనికను ఆరంభించడానికి - తాను తన పరిపూర్ణ ఆదర్శమూర్తికి అర్పించే నివాళినే నాందిగా చేసుకోవడం ఎంత సముచితం! నవ వర్ష ప్రణాళిక - ఇంకా వర్తమాన ప్రణాళికల పరంపర యొక్క - పరిధిలోకి వచ్చే కార్యరంగాలను ఈ సర్వప్రధాన లక్ష్యసాధన దెసకే నిర్దేశించడమైనది. ఈ మహత్తర ఆధ్యాత్మికయత్న సమారంభాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 10,000కు పైగా సమావేశాల లక్ష్యమూ ఇదే. సంఖ్యాత్మకంగా అసాధారణ స్థాయిలో సహయోగులను స్వాగతిస్తాయని భావించబడిన ఈ సమావేశాలు - బహాయిలను మాత్రమే కాదు; వారితో కలిసి - సమైక్యతను సమర్ధించి, ప్రపంచాన్ని సంస్కరించాలన్న ఆకాంక్షను పంచుకుంటున్న మరెందరో మానవాళి శ్రేయోభిలాషులను సంఘటిత పరుస్తున్నాయి. వారి దృఢసంకల్పమూ, పటిష్ట లక్ష్యసాధనా చైతన్యమూ ఇప్పటికే జరిగిన సమావేశాలలో ఉత్పన్నమైన స్ఫూర్తిలో ప్రతిఫలించాయి; వాటిలో పాల్గొన్నవారు, తాము తోడ్పాటు నందించిన విశిష్ట సమాలోచనలతో ఉత్తేజితులైనంతగా, ఆయా ఆహ్లాదభరిత ఘట్టాలలో సమీక్షితమైన సమిష్టి దార్శనికతతోనూ ఉత్తేజితులైనారు. రానున్న మాసాలూ, సంవత్సరాలూ కొనితెచ్చే దేమిటోనని ఉత్కంఠాన్వితులమై మేము ఎదురుచూస్తున్నాము.

30 డిసెంబరు 2021 నాటి మా సందేశాన్ని సలహాదారుల సదస్సును ఉద్దేశించి మేము వెలువరించినప్పటి నుండీ, జాతీయ ఆధ్యాత్మిక సభలూ, ప్రాంతీయ బహాయి కౌన్సిళ్లూ తమ పాలనాపరిధికి చెందిన సముదాయాలలో నవ వర్ష ప్రణాళికా కాలంలో అభివృద్ధి ప్రక్రియను ఉధృతం గావించడానికి గల అవకాశాలను నిబద్ధతాపూర్వకంగా మదింపు చేస్తూ వస్తున్నాయి. కాలక్రమంలో సాధించబడిన ప్రగతిని గణన చేసేందుకు గాను, ప్రణాళికను - నాలుగేళ్ల, ఐదేళ్ల వ్యవధితో కూడిన - రెండు దశలలో అమలు జరిగేదిగా పరిగణించడం ఉపయుక్త మౌతుందని భావిస్తున్నాము; తమ తమ సమాజాలలో తాము విలోకించదలిచే పురోగమ నాలను రిద్వాన్ 2026కూ, అటుపై రిద్వాన్ 2031కీ గణన చేయవలసిందిగా జాతీయ సభలను కోరడమైనది. ఈ సాధనలో సముదాయ సరిహద్దుల పునర్విశ్లేషణ సైతం ఇమిడి ఉన్నది, ఈ సర్దుబాట్ల పర్యవసానంగా, ప్రపంచంలోని సముదాయాల సంఖ్య ఒక పాతిక వంతు పెరిగి, ఇప్పుడు 22,000 కు పైబడి నిలిచింది. అందిన ముందస్తు సూచనలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రణాళిక ముగిసేనాటికి, వీటిలోని దాదాపు 14,000 సముదాయాలలో అభివృద్ధి కార్యక్రమం పురోగమనపరంగా ఒక స్థాయిలో నెలకొని ఉంటుందని అంచనా వేయడం జరిగింది. వీటిలో నుండి, అభివృద్ధి కార్యక్రమం విశేషస్థాయిని అందుకున్నవిగా పరిగణింపబడే వాటి సంఖ్య, అదే కాలవ్యవధిలో 11,000 కు ఆరోహిస్తుందని ఆశించడం జరిగింది. ఇక వీటిలో మూడవ మజిలీని అధిగమించిన సముదాయాల సంఖ్య 2031 నాటికి - 5,000కు ఎదుగుతుందని ఆశించడమైనది. అటువంటి పురోగమనాల సాధనకు ప్రణాళికా కాలమంతటా బృహత్ర్పయత్నం అనివార్య మౌతుందనడంలో ఇంకొక ప్రశ్నకు తావులేదు. అయినా, వీటిని మేము పరిశ్రమించదగిన ఆశయాలుగానే పరిగణిస్తున్నాము, ఎందుకంటే, సమీపాన ఉన్న దానికి సంబంధించినంతవరకూ - ఆశాభావయుతమే అయినా, అలక్ష్యం చేయరాని - అంచనాను అవి సూచిస్తాయి.

వాస్తవం ఇది. భారీగా, అధిక సంఖ్యలో భావసారూప్యులకు ఆహ్వానాన్ని పలుకుతూ, కార్యక్రమాలు త్వరితగతిన హెచ్చిల్లిన సమాజం యొక్క వ్యవహారాలను నిర్వహించగల సముచిత సామర్ధ్యాతిరేకతను సంతరించుకుంటూ పాలనావ్యవస్థలూ, ప్రాతినిధ్య సంస్థలూ గణనీయంగా అభివృద్ధి చెంది ఉండకపోతే, ఇటువంటి లక్ష్యాలను వాస్తవదృక్కోణంతో పర్యాలోచించడం జరిగి ఉండేది కాదు. వ్యవహరించడం, సమీక్షించడం, అవగాహనలను అందిపుచ్చుకోవడం, అన్యప్రాంతాలలో ఉత్పన్నమౌతున్న అవగాహనలను స్వీకరించడం―తో కూడిన జ్ఞానార్జనాకాంక్ష సమాజపు అట్టడుగుకు విస్తరిస్తూ, అన్ని స్థాయిలలోనూ పెంపొంది ఉండకపోతే అటువంటి అభివృద్ధికై ఆశించడం సాధ్యమై ఉండేది కాదు. బోధనా కార్యక్రమానికీ, మానవవనరుల అభివృద్ధికీ సక్రమ విధానమొకటి బహాయి ప్రపంచంలో మరింతగా ప్రస్ఫుటమై ఉండనట్లైతే, ఇక, అటువంటి అంచనాలు సూచించిన యత్నం ఆచరణసాధ్యమై ఉండేది కాదు. ఇదంతా తన గుర్తింపు పరంగా, తన లక్ష్యం పరంగా బహాయి సమాజానికి ఏర్పడి ఉన్న అవగాహనలో పురోగమనానికి హేతువైంది. సమాజనిర్మాణ ప్రక్రియలో నవభావాలను ఆహ్వానించే దృక్పథంతో ఉండాలన్న దృఢసంకల్పం, ఈసరికే అనేకానేక ప్రదేశాలలో వేళ్లూనుకున్న సాంస్కృతికాంశమై ఉన్నది; వాస్తవానికి ఇప్పుడది సంఖ్యాత్మకంగా ఎదుగుతున్న సమాజాలలో- బహాయి సమాజసభ్యత్వాన్ని సైతం మరింతగా అధిగమించి, సాంఘికంగా విస్తృత సువిస్తృత వర్గాల ఆధ్యాత్మిక, భౌతిక ప్రగతి పట్ల అసలైన బాధ్యతాభావనగా వికాసం చెందింది. సమాజాల నిర్మాణానికీ, సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికీ, వర్తమాన సాంఘిక చర్చకు తోడ్పడేందుకూ సంబంధించి మిత్రులు గావిస్తున్న యత్నాలు―ఆధ్యాత్మిక నియమసమన్విత మూలబంధం (పునాది) మీద తన వ్యవహారాలను ఆరంభించడంలో మానవాళికి తోడ్పడటంపై కేంద్రీకృతమైన ఉమ్మడి కార్యాచరణసరణితో కలగలిసి―అంతర్జాతీయ బృహత్ర్పయత్నంగా సంఘటిత మైనాయి. మేము వర్ణించిన - పరిపాలనా సంవిధానం ప్రారంభించబడిననూరేళ్లకు ఈ దశను అందుకుంటున్న - పరిణామాల ప్రాధాన్యత అలక్ష్యం చేయరానిది. భగవంతుని దివ్యధర్మం రచనాత్మక యుగం యొక్క ఆరవ యుగాంశంలోకి ప్రవేశించిందన్న సునిశ్చిత నిదర్శనం: సామర్ధ్యపరంగా గత రెండు దశాబ్దాలలోనూ చోటుచేసుకున్న―అలాగే, తన యత్నాలను దివ్యధర్మపు సాంఘిక-నిర్మాణశక్తి వెలువరింపుగా పరిగణించుకోవడాన్ని బహాయి ప్రపంచానికి సాధ్యం గావించిన― అపూర్వాభివృద్ధిలో - మాకు అగుపిస్తున్నది. బహాయి కార్యక్రమాలలో అధికసంఖ్యాకులు విశ్వాసప్రజ్జ్వలితులై పాల్గొనడం, తమ సమాజాలను సేవించగల నైపుణ్యాలను, దక్షతలను అలవరచుకోవడం వంటి సువిస్తృత విశేషసంఘటనలు - గురువర్యుని దివ్యప్రణాళికలోని మూడవ యుగాంశపు టారంభాన్ని సూచించాయని గత రిద్వాన్‌కు, మేము ప్రకటించాము; అలా, ఏక వత్సర ప్రణాళిక - అప్పటి తన ఆరంభ తరుణానా, ఇప్పుడు తన పరిసమాప్త సమయానా విధేయుల సందోహం గావించిన చారిత్రాత్మక పురోగమనాల సమాహారాన్ని సూచించ వచ్చింది. ఇక, ఈ విశ్వాసుల సంయుక్త సంచయం, ఒక నవీన బృహత్కార్య ద్వారసీమ వద్ద, సువిశాలంగా తన ఎదుట విస్తరించుకుని ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సన్నద్ధమై నిలిచి ఉన్నది.

ఖండాంతర ఆరాధనా మందిరాలలోని తుది మందిర నిర్మాణమూ, జాతీయ, స్థానిక స్థాయిలలో ఆరాధనా మందిరాల నిర్మాణ పథకాల ప్రారంభమూ - ఇప్పుడు ముగుస్తున్న యుగాంశ విశేష లక్షణమై ఉన్నది. మష్రిఖుల్-అఝ్కార్ భావనను గురించీ, అందులో మూర్తీభవించి ఉండే ఆరాధన, సేవల సమ్మేళనాన్నీ గురించీ ప్రపంచవ్యాప్త బహాయిలు ఎంతో తెలుసుకోవడం జరిగింది. రచనాత్మకయుగం యొక్క ఆరవ యుగాంశ వ్యవధిలో ఉత్తేజభరిత ధార్మికజీవనసమన్విత సమాజంలో అభివృద్ధి నుండి― ఇంకా అది ప్రేరేపించే సేవ నుండి―మష్రిఖుల్-అఝ్కార్ ఆవిర్భావం వరకూ దారితీసే మార్గాన్ని గురించి మరెంతో తెలియవస్తుంది. వివిధ జాతీయ ఆధ్యాత్మిక సభలతోనూ సమాలోచనలు ఆరంభ మౌతున్నాయి; ఇవి కొనసాగుతుండగా, రానున్న సంవత్సరాలలో బహాయి ఆరాధనా మందిరాలు నిర్మితమయ్యే ప్రదేశాలను, మేము ఎప్పటికప్పుడు ప్రకటిస్తాము.

మహాఘన నామ సమాజం మరిన్ని విజయాల దిశగా పురోగమిస్తుండటాన్ని చూసినప్పటి మా ఆనందం: దుఃఖాన్నీ, దుర్భరవేదననూ కలిగిస్తున్న ప్రపంచ పరిస్థితుల, మహాసంగ్రామాల – మౌఢ్యతను―ప్రత్యేకించి, ప్రజాసందోహాలపై (కొనసాగుతున్న) ఘోరాలను―పరికిస్తుండగా, అంతర్జాతీయ వ్యవహారాలను అస్తవ్యస్తం గావించిన విధ్వంకర శక్తుల పునర్విజృంభణను వీక్షించినప్పటి మా ప్రగాఢసంతాపంతో - నిస్తేజమైంది. బహాయి సమాజాలు పలువిధ సందర్భాలలో పదేపదే ప్రదర్శించినట్లు, తమ స్వీయ స్థితిగతులు ఎంతటి దుర్భర ప్రయాసాభరితాలైనా - తమ చుట్టూ ఉన్నవారికి సహాయసాంత్వనలను అందించేందుకు బహాఉల్లా అనుయాయులు నిబద్ధులై ఉన్నారని మాకు బాగా తెలుసు; మాకు ఆ దృఢవిశ్వాసమూ ఉన్నది. అయినా - న్యాయం, సత్యం అనబడే మూలబంధాల (పునాదుల) పై సమస్త మానవాళీ తన వ్యవహారాల స్థాపనను చేపట్టనంత వరకూ, అయ్యో - అది సంక్షోభం నుండి సంక్షోభానికి తూగిసలాడుతూ సాగక తప్పదు. ఐరోపాలోని ఇటీవలి యుద్ధప్రజ్జ్వలనం భవితకు ఏవైనా పాఠాలను వదలాలన్నా, నిజమైన శాశ్వతశాంతిని తాను సాధించుకోవాలన్నా, ప్రపంచం తా ననుసరించి తీరవలసిన గమనాన్ని గురించిన ఆత్యవసర స్మరణికగా అది ఉపకరించాలని ప్రార్థిస్తున్నాము. తన సమకాలీన చక్రవర్తులకూ, అధ్యక్షులకూ బహాఉల్లా స్పష్టీకరించిన నియమాలూ; పూర్వ, ప్రస్తుత పాలకులకు విధించిన బృహత్తర బాధ్యతలూ - వాటిని ఆయన లేఖిని ప్రథమంగా లిఖించిన నాటికన్నా - బహుశః ఈనాడు మరింత సముచితాలూ, సర్వప్రాథమ్యతాయుతాలూ కావచ్చు. బహాయిల కోసం అగ్నిపరీక్షలనూ, ఉపద్రవాలనూ తనతో కొనితెస్తూ, మానవాళిని అంతిమంగా న్యాయం వంకకూ, శాంతిసమైక్యతల దెసకూ ప్రేరేపిస్తున్న―భగవంతుని బృహత్ర్పణాళిక యొక్క అప్రతిహత పురోగమనం: విశ్వాసులు ప్రధానంగా నిమగ్నులై ఉన్న భగవంతుని లఘుప్రణాళిక వికాసం చెందే సందర్భం. దివ్యధర్మపు సాంఘిక నిర్మాణ శక్తి విస్తారంగా వెలువరింపు కావలసిన అవసరాన్ని - వర్తమాన సమాజపు నిష్ర్కియాపరత్వ స్థితి ప్రస్ఫుటమూ, ప్రముఖమూ గావిస్తున్నది. ప్రకంపనలూ, కల్లోలాలూ ప్రపంచాన్ని సంక్షోభితం గావిస్తూనే ఉంటాయని ముందస్తు ఊహను చేయడం వినా ఇప్పటికి ఇక మేమేమీ చేయజాలము; భగవంతుని సంతతి సమస్తమూ వ్యాకులపాటు నుండీ, దుర్భర విపత్తు నుండీ విముక్తం కావడం కోసం మనసారా మే మర్పించే ప్రతి వేడుకోలూ, మరి శాంతి-రాజనందనుని దివ్యధర్మ నిమిత్తమై మీ రందిస్తున్న అత్యావశ్యక సేవాసాఫల్యానికి సమతుల్యమైన మనఃపూర్వక ప్రార్థనతో ఎందుకు అనుసంధాన మౌతుందో నిస్సందేహంగా మీరు గ్రహిస్తారు.

ప్రణాళికా కార్యక్రమాలు వేగాన్ని సంతరించుకుంటున్న ప్రతి సముదాయంలోనూ, 30 డిసెంబరు 2021 నాటి సందేశంలో మేము వర్ణించిన ఉదాత్తలక్షణాలతో సముదాయాల అభివృద్ధి మాకు అగుపిస్తున్నది. సమాజాలు వివిధ రీతుల ఒత్తిళ్లకు లోనౌతూ ఉన్న తరుణాన, తమ సంయమన, సహేతుకతా లక్షణాల పరంగానూ, తమ ప్రవర్తనా స్థాయి పరంగానూ, తమ నియమబద్ధత పరంగానూ, తమ కారుణ్య, నిష్పాక్షికతల పరంగానూ, సమైక్యతా లక్ష్యసాకార పరంగా తాము ప్రదర్శించే సహిష్ణుత పరంగానూ - ఆభా సౌందర్యుని అనుయాయులు ఎంతో, ఇంకెంతో విశిష్టతను సంతరించుకోవాలి. అనేక సందర్భాలలో, అత్యంత సంక్లిష్ట సమయాలలో విశ్వాసులు ప్రదర్శించిన విశేష లక్షణాలూ, వైఖరులూ - ప్రజలను: వివరణకూ, సలహా నిమిత్తమూ, సహాయం కోసమూ―ప్రత్యేకించి, ఆపదతో, అనుకోని అవాంతరాలతో సాంఘిక జీవితం అస్తవ్యస్తమైనప్పుడు―బహాయిలను ఆశ్రయించేలా ప్రేరేపించాయి. ఈ పరిశీలనలను పంచుకోవడంలో, బహాయి సమాజం సైతం ప్రపంచంలో పని చేస్తున్న విచ్ఛిన్నకర శక్తుల ప్రభావాలను అనుభవిస్తున్నదని

మే మెఱుగుదుము. అంతేకాదు, భగవద్వచనాన్ని ప్రచురపరిచేందుకై మిత్రులు గావించే యత్నాలు బృహత్తరములయ్యే కొద్దీ - త్వరలోనో, ఆ తరువాయో - వివిధ దిశల నుండీ వారికి ఎదురయ్యే సరిసమాన శక్తులు దృఢతరము లౌతాయనీ మాకు తెలుసు. అనివార్యంగా వచ్చిపడనున్న పరీక్షలకు ప్రతిగానూ; అవి తమ యత్నాల సమగ్రతను నిర్వీర్యం కానివ్వకుండానూ; తమ మనస్సులనూ, చేతనలనూ వారు పటిష్టపరచుకోవాలి. అయినా, ముందున్న తుఫానులు ఎటువంటివైనా, వా టన్నింటికీ దివ్యధర్మనావ దీటైనదేనని విశ్వాసులకు సువిదితమే. దాని సాగరయానపు క్రమానుగత దశలు - అది పంచభూతాలను సైరించడాన్నీ, అలలపై

స్వారీ చేయడాన్నీ వీక్షించే ఉన్నాయి. దాని తెరచాపలను పూరించి, దానిని తన గమ్యం దెసగా చోదన గావించే మహోధృత వాయువులు - సర్వశక్తిమంతుని ఆశీస్సులు. ఇక దివ్యఒడంబడిక - పావనతరణిని దాని నిశ్చిత, నిర్ణీత మార్గాన నిర్దేశిస్తున్న ధృవతార. అందులో పయనించేవా రందరికీ స్వర్లోకసేనలు ఆశీస్సుల నందజేయు గాక.

తన కివ్వబడిన సమున్నతాహ్వానానికి సముచిత ఉదాత్త మనస్తత్వమూ, సుదృఢసంకల్పమూ గల సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించడం మాకు మహదానంద మనిపిస్తున్నది. మీపట్ల మాకు గల అనురాగ మెంత మహత్తర మెంతటి మహనీయతరమని! బహాఉల్లా దివ్యబోధనలు మలచిన జీవితాలను గడిపేందుకూ, ఆయన దివ్యావిష్కరణ జీవజలాలను తీవ్రదాహార్తి నొందిన ప్రపంచానికి యివ్వజూపేందుకూ గాను మీరు చేస్తున్న నిష్కపట, నిబద్ధతాయుత పరిశ్రమను విలోకిస్తున్నప్పుడు మా మనస్సు లెంతగా పొంగి పోతున్నాయని! పటిష్టమైన మీ లక్ష్యజ్ఞానం ప్రస్ఫుటమై కానవస్తున్నది. విస్తరణా, దృఢీకరణా, సామాజిక కార్యక్రమమూ, సామాజిక సమస్యాచర్చలలో పాల్గొనడమూ - వడిగా సాగిపోతున్నాయి; సాముదాయిక స్థాయిలో, ఈ పూనికల సహజహేతుబద్ధత, సదా గోచరమౌతున్నది. ప్రయత్నాల—వాటిలో ప్రతిదీ దివ్యధర్మ సమాజనిర్మాణ శక్తిని వెలువరించే సాధనమే—పరంపరలో అధికసంఖ్యా కులు పాలుపంచుకుంటున్న చోట్లనే, యిది స్పష్టతర మౌతున్నది.

నవ వర్షప్రణాళిక ఆరంభం నుండీ, గడచిన పన్నెండు మాసాలలోనూ, ఈ ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక సముద్యమం ఎలా మిత్రులకు స్ఫూర్తిని యిచ్చిందో, ఉత్తేజపరిచిందో, విశేష చర్యాక్రమాలకు ప్రేరణను యిచ్చిందో పరికించడం మాకు ఆనందాన్ని కలిగించింది. మూడవ మజిలీని అధిగమించిన సముదాయం, అంటే - ప్రజలు విస్తృతసంఖ్యలో కలిసికట్టుగా కృషి చేస్తున్నటువంటి, చైతన్యతర సమాజ జీవితానికి తోడ్పాటునందిస్తున్నటువంటి ప్రాంతం—ప్రతి దేశానా, ప్రాంతానా—కనీసం ఒక్కటైనా తప్పక ఆవిర్భవించి తీరేలా చూసే ప్రణాళికలను అమలులో పెట్టడం పట్ల తక్షణశ్రద్ధను వహించడం జరిగింది. అయితే, ప్రపంచంలోని ప్రతి సముదాయంలోనూ విశేషాభివృద్ధి కార్యక్రమా న్నొకదానిని ఆరంభించడమన్నది ఈ ఇరవయ్యైదు సంవత్సరాల కాలావధికి లక్ష్యం - అన్న చైతన్యంతో, విశ్వాసులు సైతం నూతన సముదాయా లను దివ్యధర్మం దిశగా స్వాగతించడాన్నీ, విశేషాభివృద్ధి కార్యక్రమం అమలులో ఉన్న చోట్ల తమ యత్నాలను ఉధృతపరచడాన్నీ ఆరంభించారు. ప్రపంచప్రాంతాలన్నింటా కార్యోన్ముఖు లయ్యేందుకు పయొనీర్లకు గల అవకాశానికి సంబంధించిన ఒక విశేషావగాహన నెలకొని ఉన్నది. ఈ మహదవకాశానికి తా మెలా స్పందించగలమో నని, నిబద్ధులైనవా రెందరో తర్కించుకుంటున్నారు; కాగా, మరెందరో ఆయా ప్రదేశాలలో - గణనీయంగా స్థానీయరంగాన మాత్రమే కాక, అధికాధికంగా అంతర్జాతీయక్షేత్రాన కూడా - ఇప్పటికే నిలద్రొక్కుకున్నారు. మేము ఆశించినట్లుగానే, మిత్రులనుండి అన్యోన్య సహకారస్ఫూర్తి సర్వత్రా అభివ్యక్తమౌతున్న పలురీతులలో యిదొకటి. శక్తిని సంతరించుకున్న సమాజాలు వేరొకచోట—అది ఇంకొక సముదాయమైనా, ప్రాంతమైనా, దేశమైనా, లేదంటే ఖండమైనా సరే—కొనసాగుతున్న ప్రగతికి దన్ను నిచ్చేందుకు నిబద్ధమైనాయి; సుదూరం నుండి ప్రోత్సాహాన్ని అందించేందుకూ, అనుభవం నేరుగా వినిమయమయ్యేలా చేసేందుకూ సృజనాత్మక మాధ్యమాలను కనుకొనడం జరిగింది. ఈ లోపుగా, సముదాయంలో నేర్చుకోబడుతున్న దానిని గ్రహించే మౌలిక విధానాన్ని - అది, స్థానికంగానూ, అన్యత్రా (ఇతరచోట్లా) నూ రచించబడిన ప్రణాళికలను తెలియచేయగలిగేలా - విస్తృతంగా అమలుపరచడం జరుగుతున్నది. (శిక్షణా) సంస్థానం అందించిన విద్యానుభవ శ్రేష్ఠతను పెంపొందించడం ఎలానో తెలుసుకోవడంపట్ల ప్రత్యేక శ్రద్ధను వహించడం జరుగుతూ ఉండడాన్ని చూసి మేము సంతుష్టులమైనాము. (శిక్షణా) సంస్థాన ప్రక్రియ సమాజంలో వేళ్లూనుకున్నప్పుడు, తత్ప్రభావాలు పరమాద్భుతంగా ఉంటాయి. ఉదాహరణకు, శిక్షణాసంస్థానాన్ని స్థానికవాసులు తమదైన శక్తిసమన్విత సాధనంగా పరిగణించే దశకు వచ్చి, ఆ సాధనపు సర్వసమగ్రాభివృద్ధిని తమ మౌలికబాధ్యతగా చేపట్టడం జరిగిన విశేష కార్యక్రమకేంద్రాలను పరికించండి. దివ్యధర్మద్వారాలు సదా సువిశాలంగా తెరుచుకునే ఉంటాయని చక్కగా ఎఱిగిన విశ్వాసులు, ప్రవేశించేందుకు సర్వసన్నద్ధులైన వారికి ప్రోత్సాహాన్ని యివ్వడ మెలాగో నేర్చుకుంటున్నారు. అటువంటి వారితో కలిసి పయనించి, ద్వారసీమను దాటడంలో వారికి తోడ్పడటమన్నది ఒక మహద్భాగ్యం, ఒక మహదానందం; ప్రతి సాంస్కృతిక నేపధ్యంలోనూ - గుర్తింపుకూ, అనుబంధానికీ సంబంధించిన ఈ భావనాపూర్ణ ఘట్టపు విశిష్టరీతులను గురించి తెలుసుకోవలసినది ఎంతైనా ఉంటుంది. అంత మాత్రమే కాదు. సామాజిక పరివర్తనకు తోడ్పడేందుకు పలు సముదాయాలలో జరుగుతున్న యత్నాలు వాటి ప్రప్రథమ దశలలో ఉండగానే, సదరు యత్నాలు సమాజ నిర్మాణప్రక్రియ నుండి ఎలా ఆవిర్భవిస్తాయన్న దానిని గురించి సువిస్తృతంగా తెలుసుకునేందుకు జాతీయ ఆధ్యాత్మిక సభలు, ఎప్పటిలాగే సలహాదారుల దక్షతాయుత సహకారంతో, క్రియాశీలకంగా యత్నిస్తున్నాయి. తమ సామీప్య పరిసరాలలో చోటు చేసుకుంటున్న అర్ధవంతమైన చర్చలలో పాల్గొనేందుకు మిత్రులు సైతం మార్గాలను కనుగొంటూ ఉండగా, సామాజికుల సాంఘిక, భౌతిక శ్రేయస్సును గురించిన చర్చలు కుటుంబసంచయాలలోనూ, సమాజాలలోనూ మెఱుగులను దిద్దుకోవడం జరుగుతున్నది.

మా వివరణమంతటికీ మూలకేంద్రంలో యువజన కార్యకలాపాలు సముజ్జ్వలంగా భాసిల్లు తున్నాయి. కేవలం నిమిత్తమాత్రు లైన ప్రభావప్రభావితులుగా—ఆ ప్రభావం హితకరమైనదైనా, మరేదైనా సరే—ఉండిపోకుండా, వారు ధైర్యంగా, తమను ప్రణాళికలో వివేచనాన్వితులైన ప్రధానపాత్రధారులుగా నిరూపించుకున్నారు. సమాజం తమను యీ దృష్టితో చూసి, తమ పురోగమనానికి సముచిత పరిస్థితులను కల్పించినచోట్ల, యువజనులు తమలో అభివ్యక్తమైన ఆత్మవిశ్వాసం సహేతుకమని అధికాధికంగా నిరూపించుకున్నారు. వారు తమ మిత్రులకు దివ్యధర్మాన్ని బోధిస్తున్నారు, సేవను మరిన్ని అర్ధవంతమైన స్నేహాలకు పునాదిని గావిస్తున్నారు. ఒక్కొక్కసారి, అటువంటి సేవ తమకన్నా చిన్నవారిని—నైతిక, ఆధ్యాత్మిక శిక్షణను అందించడం ద్వారా మాత్రమేకాక, తఱచుగా వారి చదువుకు సైతం సహకరిస్తూనూ—విద్యావంతులను చేయడంగా కూడా రూపును దిద్దుకుంటున్నది. (శిక్షణా) సంస్థాన ప్రక్రియను సశక్తీకరించడ మన్న పవిత్రబాధ్యత విధించబడిన వారై, బహాయి యువజనులు - మా చిరకాల వాంఛలను నెరవేరుస్తున్నారు.

ఈ సమస్త యత్నాలకూ నేపధ్యం: ఒక తీవ్ర అనిశ్చిత యుగం. వర్తమాన దురవస్థలలో మానవాళి అవసరాలను తీర్చగలిగేందుకు ఈనాటి వ్యవస్థలు సన్నద్ధమై లేవన్న విస్తృతాంగీకార మొకటి నెలకొని ఉన్నది. సునిశ్చితమనీ, అచంచలమనీ విస్తారంగా విశ్వసింపబడిన దానిలోని అధికాంశమూ, ప్రశ్నల నెదుర్కొంటున్నది. తత్ఫలితమైన కల్లోలం - ఒక ఏకీకృత దార్శనికతకై ఆకాంక్షను రేకెత్తిస్తున్నది. ఏకత్వానికీ, సమానత్వానికీ, న్యాయానికీ దన్నుగా ఎలుగెత్తబడిన గళసందోహం (అభిప్రాయాల సమాహారం) - తమతమ సమాజాల నిమిత్తం, ఇవే ఆశయాలు యింకెందరికో ఉన్నాయని నిరూపిస్తున్నది. అయినా, మనస్సులు శుభసౌందర్యుడు ప్రతిపాదించిన ధార్మికాదర్శాలను కోరుకోవాలన్నది, ఆయన అనుయాయికి విస్మయకర మేమీ కాదు. ఆ మాటకు వస్తే, ఒక సంవత్సర కాలంలో - మానవాళి సమిష్టి పురోభివృద్ధికి సదవకాశాలు సకృత్తుగా (అరుదుగా), తీవ్రనిరాశాభరితంగా అగుపించినప్పుడు - అవే ఆదర్శాలను సమర్ధించే విధానాలపై దృష్టిని కేంద్రీకరించి దాదాపు ఒకటిన్నర మిలియన్ల మంది పాల్గొంటున్న పదివేలకు పైగా సమావేశాలలో, దివ్యధర్మజ్యోతి మహాద్భుతశోభతో భాసిల్లడమన్నది మనకు అసాధారణ మనిపించదు. బహాఉల్లా దార్శనికత —అలాగే, ప్రపంచశ్రేయస్సుకు సమైక్యంగా కృషిని సల్పవలసిందిగా మానవాళికి ఆయన గావించిన ఉపదేశమూ—విభిన్న సామాజికాంశాలూ ఉత్కంఠతో పరివేష్టించిన (చుట్టుముట్టిన) మూలస్థానం; అయినా ఆశ్చర్యమే లేదు, ఎందుకంటే అబ్దుల్-బహా వివరించినట్లు “ప్రపంచమునందలి ప్రతి సమాజమూ ఈ దివ్యబోధనలలో తన సమున్నతాశయముల సాఫల్యతను దర్శింపగలదు.” మానవశ్రేయోభిలాషులు కొందరు, తొలుత ఒక పునరావాస స్థానంగా—విభాజితమూ, శక్తివిహీనమూ అయిన ప్రపంచాన్ని మించిన పరమాశ్రయంగా—పరిగణించి బహాయి సమాజం వంకకు ఆకర్షితులై ఉండవచ్చు. అయినా, ఆశ్రయానికన్నా, వారికి అగుపించేది: ప్రపంచాన్ని (నవ్యంగా) పునర్మించేందుకు సమిష్టిగా పరిశ్రమిస్తున్న తమ సాటి వారే.

సమావేశాల భౌగోళిక వ్యాపనాన్ని గురించైనా, నూతన ప్రణాళికకు అవి సంతరింపజేసిన అసాధారణ ప్రేరణను గురించైనా, లేదంటే, వాటిలో పాల్గొన్న వారినుండి అవి వెల్లడి గావించిన ఆనందోత్సాహయుత మనఃపూర్వక అభివ్యక్తీకరణలను గురించైనా సరే ఎంతైనా వ్రాయవచ్చును. అయితే, ఈ కొద్ది వాక్యాలలోనూ, అవి దివ్యధర్మాభ్యుదయాన్ని గురించి సూచించిం దేమిటి అన్న దాని వంకకే మేము దృష్టిని సారించ దలిచాము. విభేదాన్ని కాక అనుబంధాన్ని పరిగణించే బహాయి సమాజానికి అవి ప్రతీకగా నిలిచాయి. అందరూ ఆహ్వానితులే అయిన (సదరు) సమావేశాలలో, ఈ దృక్పథం - నవవర్ష ప్రణాళిక అధ్యయనాత్మక సమీక్షను సహజసిద్ధం గావించింది. ప్రణాళికలోని అంతఃసూచనలను మిత్రులు తమ సమాజాల కోసమని - కేవలం వ్యక్తుల, కుటుంబాల సాహచర్యంలో మాత్రమే కాక, స్థానిక నేతల, అధికారుల సమక్షంలో సైతం - సమీక్షించారు. అనేకమందిని ఒకేచోట సమీకరించడమన్నది - ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఆధ్యాత్మిక-సామాజిక ప్రగతిని గురించిన పరివర్తనాత్మక చర్చకు (తగిన) పరిస్థితులను కల్పించింది. ఏకకాలంలో నిష్పాక్షికాలూ, ఉత్తేజభరితాలూ, లక్ష్యసమన్వితాలూ అయిన యీ సమావేశాలు, సముదాయంలో విస్తరిస్తున్న సమాజాభివృద్ధి సారణికి అందించగల విశేషసహకారం - బహాయి వ్యవస్థలకు, భవిష్యత్తు నిమిత్తమై మనస్సులో ఉంచుకోవలసిన అమూల్యపాఠం.

ఆ విధంగా విధేయుల బృందం నవ్యదృక్పథంతో, తాము సాధించయత్నిస్తున్న దాని పట్ల ప్రగాఢావగాహనతో ప్రణాళిక రెండవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. వివిధ కార్యాచరణలూ —అవి వెలువరించే సమాజనిర్మాణ శక్తి దృష్ట్యా చూసినప్పుడు—ఎలా కానవస్తాయని! ఈ సువిస్తృతావకాశం - స్థిరంగా కొనసాగించబడిన కార్యక్రమాన్ని ఒకే ఒక్క సేవాకార్యక్రమానికన్నా, కేవలం ఒక సమాచార విశేషానికన్నా మరింత మిన్న అయిన దానిగా పరిగణింపబడే వీలును కల్పిస్తుంది. కొనసాగించబడుతున్న బృహద్యత్నాలు, స్వీయాభివృద్ధి పథంలో పయనించడానికి సంబంధించి పెరుగుతున్న బాధ్యతను తా నెలా వహించాలో తెలుసుకుంటున్న జనసంచ యాన్ని - పలుచోట్ల వెలుగులోకి తెస్తున్నాయి. తత్పర్యవసానమైన ఆధ్యాత్మిక, సామాజిక పరివర్తనే - ఒక జనసందోహ జీవనంలో వివిధ రీతులలో అభివ్యక్తమౌతుంది. పూర్వప్రణాళికల పరంపర క్రమంలో - ఆధ్యాత్మిక విద్య, సమిష్టి ఆరాధనలకు యివ్వబడిన ప్రోత్సాహంలో దీనిని ప్రస్ఫుటంగా గమనించవచ్చు. ఈ నూతన ప్రణాళికల పరంపరలో, సమాజ జీవితాన్ని సుసంపన్నం గావించ యత్నించే ఇతర ప్రక్రియల పట్ల—అంటే ఉదాహరణకు, ప్రజారోగ్యాన్ని మెఱుగుపరచడం ద్వారానూ, పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారానూ, కళల శక్తిని మరింత సమర్ధవంతంగా వినియోగించడం ద్వారానూ, మరింత శ్రద్ధను వహించడం అవసరమౌతుంది. ఏది యేమైనా, సమాజశ్రేయస్సుకు సంబంధించిన ఈ పరస్పర ఆధారితాంశాలన్నీ పురోభివృద్ధి చెందడానికి అవసరమైంది: ఈ రంగా లన్నింటా సక్రమమైన జ్ఞానార్జనలో పాల్గొనే సామర్ధ్యం—అంటే దివ్యబోధనల నుండీ, వైజ్ఞానిక పరిశోధనతో ఉత్పాదితమై సమీకృత మైన మానవజ్ఞానభాండారం నుండీ ఏర్పడుతున్న అవగాహనలను వినియోగించుకోగల సామర్ధ్య మన్నమాట. ఈ సామర్ధ్యం వృద్ధి చెందే కొద్దీ, రానున్న దశాబ్దాలలోఎంతో సాధించడం జరుగుతుంది.

ఈ సువిస్తారిత సమాజనిర్మాణ దార్శనికతకు విస్తృత ప్రభావశీలత గల అంతరార్ధాలు ఉన్నాయి. అది సాకారమయ్యే దిశగా ప్రతి సమాజమూ తనదైన పథంలో పయనిస్తున్నది. అయితే ఒక్కొక్క సారి ఒక ప్రదేశంలో సాధించబతున్న ప్రగతికీ మరో ప్రదేశంలోని ప్రగతికీ - లక్షణాలలో సారూప్యత ఉంటున్నది. ఒక లక్షణం: సామర్ధ్యం వృద్ధి చెందుతూ, స్థానిక లేదా జాతీయ సమాజ శక్తులు బహుళీకృతమయ్యే కొద్దీ, ఇక, నిర్ణీత సమయం ఆసన్నమైనప్పుడు, మష్రిఖుల్-అఝ్కార్ ఆవిర్భావానికి అవసరమైనటువంటి, మా రిద్వాన్ 2012 సందేశంలో వ్యక్తీకరించినటువంటి, నిబంధనలు - చివరికి సాకారం కావడం. మీకు ఉద్దేశించిన గత రిద్వాన్ సందేశంలో మేము సూచించినట్లు, బహాయి ఆరాధనామందిరాలు నిర్మితం కావలసిన ప్రదేశాలను మే మెప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటాము. ఈ తరుణంలో, నేపాల్‌కు చెందిన కంచన్‌పూర్‌లోనూ, జాంబియాకు చెందిన మ్వినిలుంగాలోనూ స్థానిక ఆరాధనా మందిరాల స్థాపనకు పిలుపునివ్వడానికి మే మానందిస్తు న్నాము. దీని తదుపరి, కెనడాలో చిరకాలం క్రితమే నెలకొని ఉన్న జాతీయ హజిరతుల్-ఖుద్స్ సమీపాన జాతీయ ఆరాధనా మందిర మొకటి నిర్మితం కావాలని పిలుపునిస్తున్నాము. మిత్రులు దేశదేశానా ఆరాధనామందిరాల నిధులకు అందించే తోడ్పాటుతో ఈ నిర్మాణప్రణాళికలకూ, భవిష్యత్తులో ఆరంభింపబడే వాటికీ - లబ్ధి చేకూరుతుంది.

అనంతములు - కారుణ్యాధినాథుడు తన ప్రియతములకు ప్రసాదింప నెంచిన యాశీస్సులు. మహోదాత్త మాహ్వానము, మహత్తర మవకాశము. సంక్లిష్టములు - సేవల నందింపుడని మన ఎల్లరకూ పిలుపు యివ్వబడిన దినములు. ఇక, మనఃపూర్వకములు - మీ నిర్విరామ యత్నాలకు బహాఉల్లా దివ్యద్వారసీమ చెంతన, మీ పక్షాన మేమర్పించే ప్రార్థనలు.

మహత్తర పర్వదినం సమీపించడంతో, మేము కృతజ్ఞతాపూర్వక, ఆశాభావయుత అనుభూతులతో పరవశించాం——కృతజ్ఞత, బహాఉల్లా తన అనుయాయులతో సాధింపచేసిన అద్భుతాలకూ; ఆశాభావం, సమీపభవిష్యత్తు సన్నద్ధం చేసి ఉంచిన దానికీని.

ప్రపంచవ్యాప్త బహాఉల్లా ద్విశతజయంత్యుత్సవాలు కలిగించిన ప్రేరణ, ఆనాటినుండీ పెరుగుతూనే వచ్చింది. బహాయి సమాజపు సత్వరాభివృద్ధీ, విస్తరిస్తున్న దాని సామర్ధ్యమూ, తన సభ్యులలో అధిక సంఖ్యాకుల శక్తిసామర్ధ్యాలను వినియోగించుకోవడంలో దానికి గల దక్షతా, ఈ మధ్యకాలంలో దాని అంతర్జాతీయ ఫలిత సాధనల సారాంశంనుండి విస్పష్టంగా వెల్లడౌతున్నాయి. వీటిల్లో, సమాజనిర్మాణ కార్యకలాపాలలో పెరుగుదల, ప్రత్యేకించి ఆకట్టుకుంటున్నది. ఈ కార్యకలాపాలను సక్రమవిధానంలో సంస్కరించి, హెచ్చించడానికి బహాయి ప్రపంచం ఇరవయ్యేళ్లుగా చేస్తూ వచ్చిన కృషిని, ప్రస్తుత పంచవర్ష ప్రణాళిక అనుసరిస్తున్నది. అయితే, ఆశ్చర్యకరంగా, ప్రణాళిక తొలి రెండున్నర సంవత్సరాలలోనూ, ప్రధానకార్యక్రమాల సంఖ్యే సగాన్ని మించిపోయింది. ఆధ్యాత్మిక వాస్తవాలను సంశోధించి, స్పందించడంలో పది లక్షలకన్నా ఎక్కువమందికి తోడ్పడుతూ, అటువంటి కార్యకలాపాలలో వారు ఏ సమయంలోనైనా పాల్గొనేలాచేసే సామర్ధ్యాన్ని ప్రపంచవ్యాప్త బహాయి సమాజం ప్రదర్శించింది. ఆ కొద్దిపాటి సమయంలోనే, ప్రార్థనాసమావేశాల సంఖ్య దాదాపుగా రెండింతలైంది. ఆశాభావానికీ, అనుగ్రహానికీ ‘మూలమూర్తి’ పట్ల మానవులలో పెరుగుతున్న విముఖతకు అత్యంతావశ్యకమైన ప్రతిస్పందన యిది. ఆధ్యాత్మిక సమావేశాలు సమాజజీవితంలో నవ్యస్ఫూర్తిని నింపుతాయి కనుక, ఈ పరిణామంలో ఒక విశేషసూచన ఉన్నది. అన్ని వయస్సులవారి విద్యాయత్నాలతో సమ్మిళితాలైన అవి: దైవారాధన, మానవసేవలపరంగా తమకంటూ ఒక విశిష్టతను సంతరించుకున్న సమాజాలను ప్రోత్సహించడం లాంటి యత్నాల ఉదాత్తాశయాన్ని పటిష్టపరుస్తాయి. బహాయి కార్యకలాపా లలో అధికసంఖ్యాకుల భాగస్వామ్యం స్థిరంగా కొనసాగింపు కాబడుతున్నటువంటి, మిత్రులు సమాజాభివృద్ధికి సంబంధించిన మూడవ మజిలీని దాటినటువంటి సముదాయాలలోకన్నా, ఇదింకెక్కడా యింత ప్రస్ఫుటంగా లేదు. అభివృద్ధి ప్రక్రియ ప్రణాళికారంభంనుండి ఈ స్థాయికి పురోగమించిన సముదాయాల సంఖ్య రెండింతలను మించిపోయి, ఇప్పుడు దాదాపు ఐదువందల దగ్గర నిలిచి ఉండడం మాకు సంతోషంగా ఉంది

ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరివర్తనాస్థాయికి, ఈ సంగ్రహ పరిశీలన న్యాయం చేయజాలదు. ప్రణాళికలో మిగిలిన రెండేళ్ల భవితా మహోజ్జ్వలంగా ఉంది. మేమనుకున్నట్టే, పరిజ్ఞానానికీ, వనరులకూ భాండారాలైన సముదాయాలలోని దృఢతర అభివృద్ధి కార్యక్రమాల నుండి నేర్చుకున్న పాఠాలకు విస్తృత ప్రచారాన్ని కల్పించడంద్వారా, గత సంవత్సరంలో ఎంతో సాధించడం జరిగింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోని మిత్రులూ ఈ జ్ఞానార్జనావేగంవల్ల లబ్ధిని పొందగలిగేలా, ఏర్పడుతున్న అవగాహనలను తమ వాస్తవస్థితులకు అనువర్తించుకునేలా చూడడంలో అంతర్జాతీయ బోధనాకేంద్రం, సలహాదారులు, అలుపెరగని - వారి సహాయకులు ఎంతవరకైనా వెళ్లారు. తమ పరిసరాలలో అభివృద్ధిప్రక్రియ పురోగమించేందుకు, ఏ నిర్దిష్ట సమయంలో, ఏం కావాలో కార్యరూపేణానూ, సమీక్షాత్మకంగానూ తెలుసుకుంటూ ఉండే మిత్రుల కేంద్రకం - సంఖ్యాత్మకంగా పెరుగుతున్న సముదాయాలలోనూ, వాటిలోని సామీప్యప్రాంతాలోనూ, గ్రామాలలోనూ - ఏర్పడుతూ ఉండడం మాకు ఆనందంగా ఉంది. సమాజపు టాధ్యాత్మిక, భౌతికాభ్యుదయానికి తోడ్పడే సామర్ధ్యాన్ని పెంపొందించిన శిక్షణాసంస్థానమనే శక్తివంతమైన సాధనాన్ని వారు వినియోగించుకుంటున్నారు; వారు (తదనుగుణంగా) వ్యవహరించేకొద్దీ వారితో కలిసివచ్చేవారి సంఖ్య పెరుగుతూ ఉంది. సహజంగానే, ప్రదేశానికీ ప్రదేశానికీ అభివృద్ధిపరమైన లక్షణాలలాగే, పరిస్థితులూ వేరువేరుగా ఉంటాయి, అయినా, సక్రమకృషితో, ప్రస్తుత కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎంతో ప్రభావపూర్వకైమెన తోడ్పాటును అందించగలరు. ఎదుటివారిని, వెనువెంటనేకానీ, క్రమక్రమంగా కానీ, సున్నిత ఆధ్యాత్మిక భావసంచలనానికి దారితేసే అర్ధవంతమైన, ఉత్తేజపూరితములైన చర్చల్లో నిమగ్నులను చేయడంలోని నిజమైన ఆనందం ప్రతిచోటా, నెలకొనే ఉంది. విశ్వాసి మనస్సులో అగ్ని ఉజ్జ్వలంగా రగుల్కొల్పబడేకొద్దీ, దాని వెచ్చదనం సోకినవారికి అనుభవైక వేద్యమయ్యే ఆకర్షణాశక్తి అంత మహత్తరంగానూ ఉంటుంది. ఇక బహాఉల్లా పట్ల ప్రేమతో నిండిపోయిన మనస్సుకు - భావసారూప్యులకై అన్వేషించడం, వారు సేవాపథంలో ప్రవేశిస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించడం, వారు అనుభవాన్ని సంతరించుకుంటున్నప్పుడు వారికి తోడ్పాటును అందించడం, ఇంకా——బహుశః, అన్నింటికన్నా మహదానందకరం——వ్యక్తులు తమ విశ్వాసపరంగా దృఢీకృతులై, స్వతంత్రంగా సముద్యమించి, సాటివారికీ అదే పయనంలో తోడ్పాటునందించడాన్ని చూడడానికన్నా - సముచితమైన మరే వ్యాసంగాన్ని ఊహించవచ్చు! ఈ అశాశ్వతజీవితం కల్పించగల ఘట్టాలన్నింటిలోకి ఇవెంతో అపురూపమైనవి.

ఈ ఆధ్యాత్మిక బృహత్కార్యాన్ని కొనసాగించడానికి గల అవకాశాలు బాబ్ ద్విశతజయంతి సమీపిస్తుండడంతో మరింత ఉద్వేగ భరితాలైనాయి. దానికి ముందు వచ్చిన ద్విశతజయంతి లాగే, ఈ వార్షికోత్పవ మొక అపూర్వసందర్భం. తమ చుట్టూ ఉన్నవారిని - భగవంతుని మహాయుగానికీ, ప్రపంచ దిఙ్మండలాన్ని శోభాయమానం గావించిన మహాతేజోమూర్తులైన, భగవంతుని రెండు దివ్యావతారాల ఆవిర్భావంతో సూచితమైన పరమానుగ్రహపు టసాధారణ స్రవంతికీ - మేల్కొల్పగలిగే మహాద్భుతావ కాశాలను యిది బహాయిలందరికీ కల్పిస్తుంది. రెండేళ్లక్రితంనాటి ద్విశతజయంతి అనుభవం దృష్ట్యా, రాబోయే రెండు ఆవృత్తాలలోనూ సాధ్యపడనున్న దాని పరిమాణం అందరికీ తెలిసిందే; ఇక ఆ సందర్భంగా నేర్చుకున్న దంతా, ఈ ఏడాది పవిత్రజయంతుల ద్వయానికి వేయబోయే ప్రణాళికలలో వినిమయం కాబడాలి. ద్విశతవత్సర వార్షికం సమీపిస్తుండగా, బాబ్‌ను సముచిత రీతిన గౌరవించడానికి మీరు చేసే యత్నాలు, ఆయనచే పూర్వసూచితమైన దివ్యధర్మాన్ని పురోగమింప చేయడంలో విజయవంత మౌతాయని పవిత్రసమాధుల సమక్షంలో, మీ పక్షాన ఎప్పటికప్పుడు ప్రార్థనలను అర్పిస్తాం.

రచనాత్మక యుగపు తొలి శతాబ్దానికి ముగింపుకు రెండున్నరేళ్ల వ్యవధి ఉంది. దివ్యధర్మపు ధీరోదాత్తయుగంలో వేయబడిన త్యాగప్రపూరిత పునాదిని దృఢీకరించి, విస్తరించడానికి సంబంధించిన నూరేళ్ల నిబద్ధతాయుత కృషికి అది ముగింపును పలుకుతుంది. ఆ సమయంలో బహాయి సమాజం అబ్దుల్-బహా దివ్యారోహణ (నిర్యాణం) - అలౌకిక యశోలోకములయందున్న తన తండ్రి ని తిరిగి కలుసుకునేందుకై ఈ ప్రాపంచిక బంధాలనుండి ప్రియగురువర్యుడు విముక్తుడైన ఘడియ - శతవార్షికాన్ని పాటిస్తుంది. ఆ మరునాడు జరిగిన, ఆయన అంత్యక్రియలవంటి ఘట్టాన్ని – “పాలస్తీనా ఎన్నడూ చూసి ఉండలేదు”. దాని తుది అంకంలో, ఆయన భౌతికావశేషాలను బాబ్ స్మారకమందిరం (దివ్యసమాధిమందిరం) లోని ఒక భూగర్భపుటరలో స్థాపితం చేయడం జరిగింది. అయితే, షోఘి ఎఫెండీ దానినొక తాత్కాలికైమెన ఏర్పాటుగానే పరిగణించడం జరిగింది. అబ్దుల్-బహా విశిష్ట స్థానానికి సముచిత స్వాభావికతతో, దివ్యసమాధి ఒకటి, తగిన సమయంలో నిర్మితం కావలసి ఉన్నది.

ఆ సమయం వచ్చింది. ఆ పవిత్రావశేషాలను శాశ్వతంగా నిక్షిప్తపరచుకునే కట్టడాన్ని నిర్మించవలసిందిగా బహాయి ప్రపంచానికి పిలుపు నివ్వడం జరుగుతున్నది. రిద్వాన్ ఉద్యాన సమీపంలో, శుభసౌందర్యుని అడుగుజాడలతో పునీతమైన భూభాగంమీద అది నిర్మితం కావాలి; అబ్దుల్-బహా దివ్యసమాధి ఆ విధంగా అక్కా, హైఫాలలోని పవిత్ర దివ్యసమాధులకు మధ్యగా అన్వేషితమైన చంద్రవంక మీద నెలకొంటుంది. నిర్మాణప్రణాళికలపై పని సాగుతున్నది, రాబోయే మాసాలలో మరింత సమాచారాన్ని పంచుకోవడం జరుగుతుంది.

రానున్న సంవత్సరం గురించీ, అది సూచిస్తున్న దాన్నంతటి గురించీ సమాలోచిస్తున్నకొద్దీ, అంతులేని ఆనందానుభూతులు మాలో ఎగసిపడుతున్నాయి. దేశదేశానా శాంతి ఉద్యమానికై శ్రమిస్తూ, బహాఉల్లాకు సేవలను అందించడంలో నిమగ్నులై ఉన్న మీలో ప్రతి ఒక్కరూ, మీ మహోదాత్త లక్ష్యాన్ని నెరవేరుస్తారని ఆశిస్తున్నాం.